రోజువారీ జీవితంలో ఒత్తిడి పెరిగిపోతోంది. ఆరోగ్యం కోసం గంటల తరబడి వ్యాయామం చేయడానికి సమయం దొరకడం లేదు కదూ? అయితే మీ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. కేవలం ప్రతి రోజు 10 నిమిషాలు కేటాయించి, కొన్ని సులభమైన యోగా ఆసనాలు వేస్తే చాలు. మీ శరీరంలో కొత్త శక్తి పుంజుకొని, రోజంతా ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఆ అద్భుతమైన సమయాన్ని ఆదా చేసే ఆసనాలు ఏమిటో చూద్దాం.
10 నిమిషాల్లో అద్భుతాలు చేసే యోగా ఆసనాలు: యోగా అనేది కేవలం వ్యాయామం కాదు, మనసు శరీరం, ఆత్మను కలిపే ఒక జీవన విధానం. సమయం లేని వారి కోసం, శక్తిని పెంచే ఈ మూడు ఆసనాలను మీ దినచర్యలో చేర్చుకోండి.
తాడాసనం (Mountain Pose) – 1 నిమిషం: ఈ ఆసనం శరీరం మొత్తానికి మంచి బేస్‌ను ఇస్తుంది. ముఖ్యంగా వెన్నెముకను నిటారుగా ఉంచి, ఏకాగ్రతను పెంచుతుంది. రోజును ఉల్లాసంగా మొదలుపెట్టడానికి ఇది మంచి ప్రారంభం.
ఎలా చేయాలి: కాళ్ళను దగ్గరగా ఉంచి నిలబడాలి. శ్వాస తీసుకుంటూ రెండు చేతులను తలపైకి చాచి, వేళ్లను ఒకదానితో ఒకటి పెనవేసి, అరచేతులను పైకి తిప్పాలి. పాదాలపై బరువు వేసి, శరీరాన్ని పైకి సాగదీయండి. శ్వాసను నెమ్మదిగా వదులుతూ, చేతులను దించండి.
వృక్షాసనం (Tree Pose) – ఒక్కో వైపు 1 నిమిషం: ఈ ఆసనం శారీరక సమతుల్యతను, మానసిక స్థిరత్వంను మెరుగుపరుస్తుంది. ఇది కాళ్ళ కండరాలను బలోపేతం చేసి, నరాల వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది.

ఎలా చేయాలి: నిటారుగా నిలబడి, కుడి మోకాలును వంచి, కుడి పాదాన్ని ఎడమ తొడ లోపలి భాగంలో ఉంచండి. నమస్కారం ముద్రలో చేతులను ఛాతీ ముందు ఉంచండి లేదా శ్వాస తీసుకుంటూ చేతులను నెమ్మదిగా పైకి చాచండి. కొంత సమయం అలాగే ఉండి, ఆపై నెమ్మదిగా మరో వైపు చేయండి.
భుజంగాసనం (Cobra Pose) – 3 సార్లు: ఈ ఆసనం వెన్నుముకను బలోపేతం చేస్తుంది మరియు ఛాతీ, పొట్ట కండరాలను సాగదీస్తుంది. ఆఫీసులో కూర్చుని పనిచేసే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలసటను దూరం చేస్తుంది.
ఎలా చేయాలి: పొట్టపై పడుకుని, అరచేతులను భుజాల కింద నేలపై ఉంచండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తల, ఛాతీని పైకి లేపండి. నడుమును వంచకుండా కేవలం పై భాగాన్ని మాత్రమే పైకి లేపాలి. శ్వాస వదులుతూ తిరిగి నేలపై పడుకోవాలి.
కేవలం ఈ మూడు ఆసనాలను ప్రతి రోజు 10 నిమిషాలు క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా మీరు మీ శారీరక, మానసిక ఆరోగ్యంలో స్పష్టమైన తేడాను గమనించవచ్చు. యోగా అనేది ఓ పవర్ బూస్టర్ లాగా పనిచేసి, మీ జీవితానికి కొత్త శక్తిని ఇస్తుంది. ఈ మార్పును ఇప్పుడే మొదలుపెట్టండి.
గమనిక: యోగా ప్రారంభించే ముందు, ముఖ్యంగా మీకు ఏదైనా వెన్నునొప్పి లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే, శిక్షణ పొందిన యోగా గురువు లేదా డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం.