- కలకలం సృష్టిస్తున్న మావోయిస్టు పార్టీ ఆడియో
విశాఖ: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో ఇటీవల జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టులు స్పందించారు. ఈ మేరకు వారి ప్రతినిధి కైలాసం ఆడియో టేపు విడుదల చేశారు. ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు మావోయిస్టులను చుట్టుముట్టి మీనాను అతి సమీపం నుంచి కాల్చి చంపారని కైలాసం ఆరోపించారు. కాల్పుల్లో గాయపడిన మీనాను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ అలా చేయకుండా చంపేశారని అన్నారు. మీనా మృతి మావోయిస్టులకు తీరని లోటని అన్నారు.
ఏవోబీలో గల ఆండ్రాపల్లి, జోడాంబో, పనసపుట్టు తదితర ప్రాంతాల్లో బీఎస్‌ఎఫ్, ఎస్‌ఓజీ బలగాలు గిరిజనులను చిత్రహింసలు పెడుతున్నాయని, వారిపై మావోయిస్టు ముద్ర వేస్తున్నాయని కైలాసం ఆరోపించారు. కటాఫ్ ఏరియాలోని వివిధ మండలాల్లో ఈ దారుణాలు కొనసాగుతున్నాయన్నారు. బంధువుల ఇంటికి వచ్చిన వారిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకుని మావోయిస్టులుగా చిత్రీకరించారని మండిపడ్డారు. పోలీసుల అరాచకాలను అడ్డుకున్న గిరిజనులపై టియర్ గ్యాస్ ప్రయోగించారన్నారు.