కరోనాపై పోరాటానికి ప్రధాని మోదీ 21 రోజుల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రకటించారు. దీంతో జనాలందరూ ఇండ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో దేశంలో నిత్యం కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా.. ఇతర దేశాలతో పోలిస్తే అంత ఆందోళనకర స్థితి మన దగ్గర లేదు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ ఏప్రిల్ 7వ తేదీ వరకు రాష్ట్రంలో కరోనా సోకిన వ్యక్తులు ఎవరూ ఉండరని రాష్ట్ర ప్రజల్లో ధైర్యం కల్పించే ప్రకటన చేశారు. దీంతో అందరం ఊపిరి పీల్చుకున్నాం. కానీ ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ సంఘటనతో యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకేసారి పెద్ద ఎత్తున కరోనా కేసులు బయట పడ్డాయి. దీంతోపాటు అక్కడ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు పెద్ద సంఖ్యలో ఉండే సరికి జనాల్లో తీవ్రమైన భయాందోళనలు నెలకొన్నాయి. అంతా బాగానే ఉంది.. మరికొద్ది రోజుల్లో అంతా సద్దుమణుగుతుంది.. అని అందరమూ అనుకున్నాం. కానీ సీన్ రివర్స్ అయింది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు జనాలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. అయితే.. నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలు జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు.. అసలు ఏం జరిగింది..? అన్న వివరాలను ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం..
మార్చి 13 – ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో దాదాపుగా 3400 మంది ప్రార్థనల్లో పాల్గొన్నారు.
మార్చి 16 – ఢిల్లీలో మార్చి 31వ తేదీ వరకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్ని రకాల మతపరమైన, సామాజిక, రాజకీయ సమావేశాలను నిషేధించారు. ఒక చోట 50 మంది కన్నా తక్కువ సంఖ్యలో సమావేశాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు.
మార్చి 20 – ఢిల్లీలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న 10 మంది ఇండోనేషియా వాసులకు తెలంగాణలో కరోనా టెస్టులు చేయగా వారికి పాజిటివ్ అని నిర్దారణ అయింది.
మార్చి 22 – దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
మార్చి 23 – మర్కజ్ నుంచి 1500 మంది వెళ్లిపోయారు.
మార్చి 24 – కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అన్ని రకాల సమావేశాలు, ప్రార్థనలపై నిషేధం అమలులోకి వచ్చింది. కేవలం అత్యవసర సేవలను మాత్రమే అందుబాటులో ఉంచారు. మర్కజ్‌లో ఉన్న మిగిలిన వ్యక్తులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిజాముద్దీన్ పోలీసులు ఆదేశించారు.
మార్చి 25 – లాక్‌డౌన్ విధించినప్పటికీ ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తూ మర్కజ్‌లో 1000 మంది వరకు అలాగే ఉన్నారు. అక్కడికి ఓ వైద్య బృందం చేరుకుని కరోనా అనుమానితులను ఐసొలేషన్‌కు తరలించింది. జమాత్ అధికారులు మర్కజ్‌ను ఖాళీ చేసేందుకు ఎస్‌డీఎంను అనుమతి కోరారు.
మార్చి 26 – మర్కజ్‌లో ప్రార్థనల్లో పాల్గొన్న ఒక వ్యక్తి కరోనా పాజిటివ్‌తో శ్రీనగర్‌లో మృతి చెందాడు. మర్కజ్‌ను స్థానిక ఎస్‌డీఎం సందర్శించారు. జమాత్ అధికారులు కలెక్టర్‌తో సమావేశం కావాలని సూచించారు.
మార్చి 27 – మర్కజ్ నుంచి 6 మంది కరోనా అనుమానితులను బయటకు తీసుకువెళ్లారు. వారిని హర్యానాలోని ఝజ్జర్‌లో క్వారంటైన్‌లో ఉంచారు.
మార్చి 28 – మర్కజ్‌ను స్థానిక ఎస్‌డీఎంతో కలిసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) ప్రతినిధులు సందర్శించారు. 33 మంది కరోనా అనుమానితులను ఢిల్లీలోని రాజీవ్ గాంధీ క్యాన్సర్ హాస్పిటల్‌లో ఐసొలేషన్ వార్డులో ఉంచారు. మర్కజ్‌లో ఉన్నవారు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని స్థానిక ఏసీపీ ఆదేశించారు.
మార్చి 29 – పోలీసుల ఆదేశాలను మర్కజ్ అధికారులు ధిక్కరించారు. దీంతో పోలీసు, వైద్యాధికారులు మర్కజ్ చేరుకుని అక్కడ ఉన్నవారిని పరీక్షల నిమిత్తం సమీపంలోని హాస్పిటల్స్‌కు తరలించారు. కొందరు అనుమానితులను క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.
కాగా మార్చి 23, 28 తేదీల్లో మసీదును ఖాళీ చేయాలని మర్కజ్ అధికారులకు సూచించినా వారు పట్టించుకోలేదు. అయితే మరోవైపు మర్కజ్ అధికారులు మాత్రం తాము నిబంధనలను ఏమీ ఉల్లంఘించలేదని చెప్పారు. ఇక ప్రస్తుతం.. మర్కజ్ వెళ్లి వచ్చిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండడం.. వారు దేశంలోని అనేక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు చెందిన వారు కావడం.. వారు ఇప్పటికే అనేక మందితో కలిసి ఉండవచ్చన్న అనుమానంతో జనాల్లో చాలా మందికి తీవ్రమైన భయం కలుగుతోంది. ఇక వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్ రావడం.. కొందరు చనిపోవడం.. జరుగుతుండడంతో జనాలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. అయితే మరో వారం రోజుల పాటు ఆగితేనే గానీ అసలు పరిస్థితి అర్థం కాదని వైద్యులు చెబుతున్నారు..!