కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రధాని మోదీ దేశంలో మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ ఉన్నప్పటికీ నాన్ ఎసెన్షియల్ (అత్యవసరం కాని) వస్తువులను కూడా అమ్మేందుకు తమకు అనుమతివ్వాలని ఈ-కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు తాజాగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. తాము కోవిడ్ 19 వ్యాప్తి చెందకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుని కస్టమర్లకు కావల్సిన వస్తువులను డెలివరీ చేస్తామని.. కనుక నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్‌ను అమ్మేందుకు కూడా తమకు అనుమతి ఇవ్వాలని ఆ సంస్థలు కేంద్రాన్ని కోరాయి.
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో వర్క్ ఫ్రం చేస్తున్న ఎంతో మంది ఉద్యోగులతోపాటు.. అనేక మంది ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని.. అలాగే ఇప్పటికే గతంలో ఆర్డర్ చేసిన వస్తువుల డెలివరీలు అనేకం పెండింగ్‌లో ఉన్నాయని.. కనుక తమకు అనుమతిస్తే.. నాన్ ఎసెన్షియల్ వస్తువులను కూడా ప్రస్తుతం డెలివరీ చేస్తామని.. దీంతో చిరు వ్యాపారులకు ఎంతగానో మేలు కలుగుతుందని.. ఆయా ఈ-కామర్స్ సంస్థలు తెలిపాయి.
కాగా దేశంలో మార్చి 25వ తేదీ నుంచి లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు కేవలం అత్యవసర సరుకులు, మెడికల్ సప్లయిస్, మందులు తదితర వస్తువులను మాత్రమే ప్రస్తుతం కస్టమర్లకు డెలివరీ చేస్తున్నాయి. ఏప్రిల్ 20వ తేదీ తరువాత సడలింపుల నేపథ్యంలో ఈ-కామర్స్ సంస్థలకు నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్‌ను అమ్మేందుకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయా సంస్థలు తాజాగా ఈ విషయమై కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. మరి ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..!