టెలికాం సంస్థ రిలయన్స్ జియోలో ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ భారీ పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. జియోలో 9.99 శాతం వాటాను ఫేస్బుక్ రూ.44వేల కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో వాట్సాప్ ద్వారా తన జియో మార్ట్ సేవలను ప్రారంభించింది. ఇక ఆ డీల్ పూర్తయి కొద్ది రోజులు కూడా గడవకముందే మరో అమెరికా సంస్థ జియోలో భారీగా పెట్టుబడులు పెట్టింది.
రిలయన్స్ జియోలో అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేటు ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ 746.74 మిలియన్ డాలర్ల (దాదాపుగా రూ.5,656 కోట్లు) పెట్టుబడి పెట్టింది. ఈ మేరకు సిల్వర్ లేక్ ఈ విషయాన్ని సోమవారం వెల్లడించింది. ఈ క్రమంలో జియోలో సదరు మొత్తంతో 1.15 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ఆ సంస్థ తెలియజేసింది.
కాగా ఫేస్బుక్, సిల్వర్ లేక్ సంస్థలు పెట్టిన పెట్టుబడుల వల్ల జియో ప్లాట్ఫాం ఈక్విటీ విలువ రూ.4.90 లక్షల కోట్లకు చేరుకుంది. అలాగే సంస్థ విలువ 5.15 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక జియోలో ఫేస్బుక్ ఈక్విటీ విలువ 12.5 శాతానికి చేరుకుంది.