పశువులకు పాలు తీయటంలో ఈ జాగ్రత్తలు అవసరం..!

-

పాడిపరిశ్రమలో.. పశుపోషణ ఎంత ముఖ్యమో.. పాలు తీయటం కూడా అంతే ముఖ్యం. పాలు తీసే సమయంలో సరైన జాగ్రత్తలు పాటిస్తే.. ఉత్తమైన పాల దిగుబడులు పొందవచ్చు. అంత కష్టపడి గేదలకు గడ్డి, దాణా చెక్కలు వేసి.. తీరా పాలు తీసే టైంలో తప్పులు చేస్తే.. అది యజమానికే నష్టం కలిగిస్తుంది. పాలు పితికే ముందు, పితికి తర్వాత రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. అవేంటో చూద్దమా..!

రైతులు పశువుల పాలు పితకటానికి రెండు గంటల ముందుగా దాణాను తడిపి పశువులకు పెట్టాలి. పశువులు బెదిరిపోయే పరిస్ధితుల్లో కాకుండా నిశబ్ధం, ప్రశాంత వాతావరణంలోనే పాలు తీయటం మంచిది. బెదరటం వల్ల ఆడ్రినలిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది.. దీని వల్ల పాలు పితకటానికి వీలు పడదు. పాలు పితకటానికి ముందుగా వెల్లుల్లి, ఉల్లి, క్యాబేజీ, సైలేజీ గడ్డి మేపకూడదు. వీటివల్ల పాల రంగు , రుచి, వాసన మారిపోతుంది.

మొదట పితికిన పాల్లలో రక్తపు చారలు గానీ, మరేవైనా మలినాలు ఉన్నాయోలేదో చూడాలి. తేడా కనిపిస్తే ఆ పాలను మిగతా పాలల్లో కలపకూడదు. 12 లీటర్ల వరకు పాలదిగుబడి ఇచ్చే పశువులకు పాలను రోజుకు రెండు సార్లు లేదంటే మూడుసార్లు పాలు తీయాలి. ప్రతిరోజు ఒకే వ్యక్తి, ఒకే సమయంలో, ఒకే ప్రదేశంలో పాలు పితకాలి. పాలు తీసే ప్రతిసారి వ్యక్తి తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలి. దూడను వదిలిన తరువాత పొదుగులో పాలు చేపిన తరువాత పొదుగును శుభ్రంగా నీటితో కడగాలి.

పాలను ఇలా తీయకూడదు..

పాలను బొటన వేలు మడిచిగానీ గోరుతో నొక్కిగానీ, చన్నును కిందకు లాగుతూ పాలు తీయ్య కూడదు. పొదుగు చనుకట్లను పిడికిలి నిండుగా పట్టుకుని మాత్రమే పాలను తీయాలి. పాలను తీయడానికి చన్ను మొదట్లో ఒత్తిడి కలగజేసి తరువాత పిడికిలి బిగిస్తూ పాలను బయటకు పితకాలి. చేతులకు గోళ్ళను తొలగించుకోవాలి. చివరి పాలలో వెన్నశాతం అధికంగా ఉంటుంది. కాబట్టి ఆఖరి దారలతో సహా పూర్తిగా పితకాలి.

పాడిపశువుల్ని పాలు పితికే ముందే పేడ వెయ్యనివ్వాలి. పాలు పితికే ప్రాంతాన్ని కూడా శభ్రంగా ఉంచుకోవాలి. పాలు తీసే ముందు పొదుగును మరీ చన్నీళ్ళతో కాకుండా గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.. పొదుగు కడగటం వల్ల చేపు రావటంతోపాటు సూక్ష్మజీవులు నశించి పాలు కలుషితం కాకుండా ఉంటాయి. పొదుగు చన్నులను 2 నిమిషాలపాటు నెమ్మదిగా మర్ధన చేయాలి. పాలు పితకటాన్ని 10 నిమిషాల వ్యవధిలోనే పూర్తిచేయాలి. అలస్యం చేస్తే ఆక్సిటోసిన్ హార్మోన్ ప్రభావం తగ్గి చేపు పోతుంది.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news