నురగ ఎక్కువ వచ్చే షాంపూలు మంచివేనా..?

-

జుట్టు రాలిపోతుంది అని ఎంతసేపు బాధపడుడు..పెరగాలంటే ఏం ఆయిల్‌ వాడాలా, తలకేం పెట్టాలా ఇదే ఆలోచనే కానీ.. అసలు మనకు ఎందుకు జుట్టు ఊడిపోతుంది. ఏంటి కారణం, మన అలవాట్లా, తినే ఆహారమా ఏంటి లోపం ఇలా ఆలోచించుకోవాలి. సమస్య కామన్‌గా ఉన్నా..దానికి కారణాలు మాత్రం ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటాయి. చాలామంది తలస్నానం చేసేప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. దాని వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. ఫేస్‌కు సబ్బు ఎక్కువ పెట్టోద్దు..అలాగే హెయిర్‌కు కూడా ఎక్కువగా నురగనిచ్చే షాంపూలూ వాడొద్దు. మీరు అనుకుంటారు.. ‘అరే ఈ షాంపు అసలు ఎంతకీ నురగ రాదు.. మురికే పోదు.. మంచిది కాదేమో’ అని. బాగా నురగ వచ్చే షాంపూలే వాడతారు. కానీ ఇలా ఎక్కువ నురగనిచ్చే షాంపులే మీ కొంపముంచుతాయ్.!!
జుట్టు ఎందుకు రాలుతుంది…?
లైఫ్ స్టైల్ లో మార్పులు, వేళకు భోజనం చేయకపోవడం, అర్థరాత్రి వరకు మెలకువగా ఉండటం, మానసిక ఒత్తిడి వంటి కారణాలు జుట్టు రాలిపోయేందుకు కారణమవుతున్నాయని నిపుణులు అంటున్నారు. సాధారణంగా జుట్టు పెరిగే దశ, విశ్రాంతి దశ, రాలిపోయే దశ అని మూడు దశలు ఉంటాయి. ఆడవారికైనా, మగవారికైనా రోజుకు వంద వెంట్రుకల వరకు రాలిపోతుంటాయి. వాటి స్థానంలో కొత్తవి వస్తుంటాయి. ఇలా వెంట్రుకలు రాలిపోకుండా ఉంటే వాటిని పెంచడం కష్టంగా ఉంటుంది. కానీ అదే పనిగా వెంట్రుకలు ఊడిపోతే అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
బట్టతల రావడానికి కారణం..?
 బీ 12 విటమిన్, ఐరన్‌ లోపం, జన్యు సంబంధిత సమస్యల వల్ల బట్ట తలవస్తుంది. ఒక వేళ తండ్రికి బట్టతల ఉంటే వారి సంతానానికి వచ్చే అవకాశం 78 శాతం ఉంటుంది. మిగిలిన 22 శాతం తాత, ముత్తాతల నుంచి వచ్చే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. జుట్టుకు రంగులు వేయడం, వీవింగ్‌ చేయించడంతో పాటు కరోనా టీకా కారణంగా కూడా జుట్టు రాలిపోతుందని ఈ మధ్య అధ్యయనాలు చెబుతున్నాయి. వయసు ఆధారంగా వచ్చే బట్టతలను ఆపలేం. మందులు, ఆయిల్స్‌ వాడినా ఎలాంటి ప్రయోజనం ఉండదు.
నివాస ప్రాంతాలు మారినప్పుడు కూడా అక్కడి వాటర్ పడకపోవడం వల్ల జుట్టు రాలిపోతుంది. జుట్టు రాలకుండా ఉండే మందులను వైద్యుల సూచన మేరకే వాడుకోవాలి. డైట్‌లో మార్పులు చేసుకోవడం, ఆరోగ్యకరమైన జీవన విధానాలను పాటించడం వల్ల ఈ సమస్యను అరికట్టవచ్చు. బాగా నురుగు రాకుండా ఉండే షాంపూలు వాడాలి. నురగ ఎక్కువగా వచ్చే షాంపూల్లో అలా నురగ వచ్చేందుకు ఎక్కువ కెమికల్స్‌ వాడతారు. దానివల్ల జుట్టు రాలుతుంది. కాబట్టి మురికిపోతే చాలు..నురగ ఎక్కువగా రావాలి అనే అదేపనిగా అలా నురగ ఎక్కువగా వచ్చే షాంపూలను వాడకండి. నెలకు ఒక్కసారైనా కుంకుడికాయలతో తలస్నానం చేసేందుకు ప్రయత్నించండి.

Read more RELATED
Recommended to you

Latest news