ఆడవాళ్ళు రెడీ కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. అలా తీసుకోవడానికి అందం మీద ఎక్కువ శ్రద్ధ చూపడం ఒక్కటే కారణం కాదు. తల స్నానం చేసిన తర్వాత జుట్టు తొందరగా ఆరకపోవడం కూడా ఒక సమస్యే. ఏదైనా ఫంక్షన్ కి వెళ్తున్నప్పుడు ఈ సమస్యు ఇబ్బంది పెడుతుంది. జుట్టు ఆరకుండా ఫంక్షన్ కి వెళ్ళలేరు. కాబట్టి తడి జుట్టు తొందరగా ఆరడానికి కావాల్సిన చిట్కాలేంటో చూద్దాం.
ఐతే ఏదైనా ప్రత్యేకమైన రోజున తలస్నానం చేయాలనుకుంటే, పొద్దున్న పూట తొందరగా నిద్రలేచి స్నానం చేయండి. అప్పుడు మీరనుకున్న సమయానికి జుట్టు ఆరిపోతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. కానీ ప్రతీసారీ ఇలా కుదరదు. చాలా సార్లు అంత సమయం ఉండదు. తొందర తొందరగా రెడీ అవ్వాల్సి ఉంటుంది. అలాంటప్పుడు జుట్టు తొందరగా ఆరడానికి కావాల్సిన చిన్న టిప్స్ తెలుసుకుందాం.
స్నానం చేసి వచ్చాక శరీరాన్ని తుడుచుకున్న టవల్ తో జుట్టును తుడుచుకోకూడదు. దానివల్ల జుట్టు తొందరగా ఆరదు. జుట్టుకి ప్రత్యేకమైన టవల్ వాడాలి. చాలా మంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ ఇదే అన్నింటికన్నా ముఖ్యమైనది.
మేకప్, డ్రెస్ మొదలగు వాటికి వెళ్ళేముందు జుట్టు ఆరబెట్టుకోండి. జుట్టు ఆరిన తర్వాతే ఇతర పనులు చేసుకోండి. లేదా టవల్ తో జుట్టుని కట్టేసుకుని మీ పనులు చేసుకోండి. ఇక్కడే ఒక విషయం గుర్తుంచుకోవాలి. టవల్ తో జుట్టుని కట్టేసుకున్న తర్వాత ఎక్కువ సేపు అలా ఉండకూడదు. దానివల్ల జుట్టు మొదళ్ళ నుండి ఊడిపోయే అవకాశం ఉంది.
స్నానం చేసిన తర్వాత తొందరగా బాత్రూమ్ లో నుండి బయటకి వచ్చేయడం వల్ల జుట్టు తొందరగా ఆరిపోతుంది. లేదంటే అందులో ఉండే హ్యూమిడిటీ జుట్టుని త్వరగా ఆరనివ్వదు.