పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా శిరోజాల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే కొందరు స్త్రీలకు మాత్రం ఎల్లప్పుడూ పలు వెంట్రుకల సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఎన్ని పద్ధతులు ట్రై చేసినా శిరోజాలు రాలిపోవడాన్ని వారు ఆపలేకపోతుంటారు. అయితే స్త్రీలలో హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుందో, అసలు అందుకు కారణాలు ఏముంటాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
* శరీరంలో తగినంతగా ఐరన్ లేకపోయినా స్త్రీలలో హెయిర్ ఫాల్ వస్తుంటుంది. ఎందుకంటే ప్రతి నెలా పీరియడ్స్ సమయంలో కొందరికి రక్తస్రావం ఎక్కువగా అవుతుంటుంది. అలాంటి వారిలో రక్తం ఎక్కువగా పోవడం వల్ల ఐరన్ లోపం ఏర్పడుతుంది. దీంతో హెయిర్ ఫాల్ మొదలవుతుంది. అయితే ఇలాంటి వారు నిత్యం తీసుకునే ఆహారంలో తగినంత ఐరన్ ఉండేలా చూసుకుంటే హెయిర్‌ఫాల్‌ను ఆపవచ్చు. అందుకు గాను పాలకూర, గోంగూర, గుమ్మడికాయ విత్తనాలు, పప్పు ధాన్యాలు, యాప్రికాట్స్, మటన్ లివర్ వంటి ఆహారాలను తీసుకోవాలి. దీంతో ఐరన్ లోపం పోతుంది. శిరోజాలు రాలిపోకుండా ఉంటాయి.
* బరువు తగ్గాలనుకుని ఆహారం తక్కువగా తినేవారి శిరోజాలు కూడా రాలిపోతుంటాయి. అలా గనక జరుగుతుంటే నిత్యం తీసుకోవాల్సిన ఆహారాన్ని ఏమాత్రం తగ్గించకూడదు. రోజుకు ఎన్ని క్యాలరీల ఆహారం అవసరమో అంత తింటే శరీరానికి పోషణ అందుతుంది. దీంతో హెయిర్‌ఫాల్‌ను అరికట్టవచ్చు.
* సాధారణంగా మహిళలకు వయస్సు మీద పడడం వల్ల కూడా శిరోజాలు ఎక్కువగా రాలిపోతుంటాయి. అలాంటి వారు ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించేలా చేసే ఆహారాలను తీసుకోవాలి. పుచ్చకాయలు, నారింజ, నిమ్మ, కివీలు, స్ట్రాబెర్రీలు, అవకాడోలు, బీట్‌రూట్ తదితర పండ్లను ఎక్కువగా తీసుకుంటే వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావు. దీంతో వెంట్రుకలు కూడా రాలిపోకుండా ఉంటాయి.
* థైరాయిడ్ సమస్య ఉన్నా వెంట్రుకలు రాలిపోతుంటాయి. థైరాయిడ్ ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు నిత్యం మెడిసిన్‌ను వాడితే థైరాయిడ్ సమస్య అదుపులో ఉంటుంది. దీంతో హెయిర్ ఫాల్ ఆగుతుంది.
* వెంట్రుకలకు కొందరు తరచూ స్టైలింగ్ చేస్తుంటారు. కలర్లు మార్చడం, ఆకృతి, స్టైల్ చేంజ్ చేయడం చేస్తుంటారు. ఇలా చేసినా శిరోజాలు రాలుతుంటాయి. అలాగే తీవ్రమైన ఒత్తిడి ఉన్నా హెయిర్ ఫాల్ వస్తుంది. కనుక ఈ రెండు సమస్యలను అధిగమిస్తే హెయిర్ ఫాల్ తగ్గుతుంది.