నచ్చినట్టుగా గోర్లు పెంచుకోండి.. విరిగితే వాటి అంతు చూడండి!

అమ్మాయిలకు గోర్లు పెంచుకోవడం అంటే మహాఇష్టం. కొంతమంది గోర్లు పలుచగా ఉంటాయి. దాంతో చాలా సులువుగా విరిగిపోతాయి. మరికొంతమందికి గోర్లు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అలా ఉంటే ఎక్కువరోజులు ఉంటాయిలే అనుకుంటారు. కానీ ఏదొక పనిలో అవి కొంచెం విరగడం స్టార్ట్‌ అవుతుంది. ఆ కొంచెం కాస్త మొత్తం ఊడిపోయేలా చేస్తుంది. అలా ఊడితే పర్వాలేదు. అది పోవడంతోపాటు కొంచెం బాధను కలిగిస్తుంది. అందుకనే ఐదు వేళ్లల్లో బొటనవేలు, చిటికన వేళ్లు మాత్రమే పెంచుకొని తృప్తి పడుతుంటారు. అంత అవసరం ఏమి లేదు. మీ గోర్లను నచ్చినట్టుగా పెంచుకొని ఇష్టమైన నెయిల్‌పాలిష్‌ పెట్టుకొని ఫ్యాషన్‌లో మునిగిపోండి. పలుచని గోర్లు, గట్టి గోర్లు ఎలాంటివైనా విరగిపోకుండా ఉండాలంటే కొన్ని పద్ధతులు పాటిస్తే చాలు. కాకపోతే అవేంటో తెలుసుకోవాలంటే ఇది కింది చిట్కాలు చదవాలి.

 

 

గోర్లు ఇకపై విరగవు :

1. ఎక్కువగా గోళ్లను నీటిలో కానీ డిటర్జెంట్‌ పౌడర్‌నీటిలో కానీ నాననీయకూడదు. గోళ్లతో డబ్బాల మూతలు తీయడం, పాత్రలని గీరడంలాంటివి చేయకూడదు. నోటిలో పెట్టుకొని కొరకరాదు. గోళ్లు పగిలినా, పుచ్చినా వెంటనే కట్‌ చేసేయాలి.

2. ఒక స్పూన్‌ కొబ్బరి నూనెలో 5 చుక్కల నిమ్మరసం వేసి మైక్రో ఓవెన్‌లో ఒక సెకన్‌ వేడిచేయాలి. ఈ మిశ్రమాన్ని గోళ్లకు రాసి మసాజ్‌ చేస్తే గోళ్లు విరిగిపోకుండా బలంగా పెరుగుతాయి. నిమ్మకాయలో ఉండే సిట్రిక్‌ యాసిడ్‌ పాలిపోయిన గోర్లను ఆరోగ్యంగా చేయడంలో సాయపడుతుంది. కొబ్బరి నూనెలో ఉండే లారిక్‌యాసిడ్‌ గోళ్లకు అవసరమైన పోషణను ఇచ్చి బలంగా ఉండేలా చేస్తుంది.

3. కొందరు గోళ్లను కత్తెరతో కట్‌ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల గోళ్లకు ఇన్‌ఫెక్షన్‌ వచ్చి పాడవుతాయి. అలాగే బ్లేడును కూడా ఉపయోగించవద్దు. ఓన్లీ నెయిల్‌ కట్టర్‌తో మాత్రమే గోళ్లను తీసుకోవడం మంచిది. గోళ్లు ఆరోగ్యం కోసం చిట్కాలు పాటిస్తూనే రోజూ క్యారెట్‌ జ్యూస్‌ తాగాలి.

4. నారింజ రసంలో గోళ్లను ముంచి 5 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత శుభ్రంగా కడగాలి. గోర్లను పొడిటవల్‌తో తుడుచుకొని మాయిశ్చరైజర్‌ రాయాలి. ఇలా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. నారింజ రసంలోని ఫోలిక్‌ యాసిడ్‌తో పాటు విటమిన్‌ సి సమృద్ధిగా ఉంటుంది. గోళ్ల పెరుగుదలలో ఇది కీలకపాత్రపోషిస్తుంది.

5. ప్రతిరోజూ నిమ్మరసంతో గోరువెచ్చని నీటిలో కడిగితే గోళ్లపైన పచ్చదనం పోయి అందంగా తయారవుతాయి. బట్టలు ఉతికేటప్పుడు రబ్బరు గ్లౌజులు తొడుక్కోవాలి. లేదంటే కొన్ని రకాల డిటర్జెంట్‌ల వల్ల గోళ్లు పాడైపోయే అవకాశం ఉంది.