చనుబాలతో నగల వ్యాపారం.. కోట్లల్లో ఆదాయం

మహిళలకు తమ జీవితంలో పెళ్లి తర్వాత మదురమైన జ్ఞాపకాలంటే.. ప్రెగ్నెస్సీ టైం, బాలింతగా ఉండే రోజులు ఉంటాయి. ఈ సమయంలో వాళ్లు ఓ పక్క కొన్ని ఆరోగ్య సమస్యలు భరిస్తూనే.. బిడ్డను చూసుకుంటూ ఎంతో మురిసిపోతారు. పిల్లలకు పాలివ్వడం అంటే.. ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ మదురంగానే ఉంటాయి. వీటిని అలానే ఉంచాలనుకుంది సఫియా రియాద్. చనుబాలతో నగలు చేస్తూ అంతర్జాతీయ గుర్తింపు పొందింది. అవును తల్లిపాలతో నగలండి. ఇదేం సాదాసీదా దందా కాదు.. లాభం కోట్లల్లో ఉంటుది.

సాంకేతిక రంగంలో ఏళ్ల అనుభవం, ఎన్నో పురస్కారాలనూ అందుకున్నా..సఫియా రియాద్‌ కు సంతృప్తినివ్వలేదు. దీంతో ఉద్యోగానికి స్వస్తి చెప్పి, వ్యాపారంలోకి అడుగుపెట్టింది. 2019లో భర్త అదామ్‌ రియాద్‌తో కలిసి మెజెంటా ఫ్లవర్స్‌ ప్రారంభించింది. ప్రత్యేక రోజులను మరింత ప్రత్యేకంగా చేసివ్వడమనే ఆలోచనతో ఆ సంస్థను ప్రారంభించారు. అది కూడా సక్సస్ ఫుల్ గా ముందుకెళ్లింది. ఈ క్రమంలోనే ఓసారి చనుబాలతో చేసిన నగల గురించి వింది. ముగ్గురు పిల్లలు ఉన్న సఫియాకు ఆ జ్ఞాపకాలు ఎంత అందంగా ఉంటాయో బాగా తెలుసు. ఆసక్తికరంగా అనిపించి ప్రయత్నించింది. దీనికీ విపరీతమైన ఆదరణ వచ్చింది.

పాలిచ్చే సమయం ప్రతి తల్లికి ప్రత్యేకం. బిడ్డకీ, తల్లికీ అతి సన్నిహిత తరుణమిది. మా చిన్నబిడ్డకి ఎక్కువ కాలం పాలివ్వలేకపోయా. పాలను దాయొచ్చన్న విషయం నాకు అప్పటికి తెలీదు. తెలిశాక చాలా బాధపడ్డా అని ఈరోజుకు చాలా మంది తల్లులు అనుకుంటారు.. ఇంకా పిల్లల నెలవారీ, ఏళ్లవారీ ఎదుగుదలను గుర్తు చేసుకోవడానికి ఫొటోలుంటాయి. కానీ స్తన్యాన్ని అందించే ప్రక్రియకు మాత్రం ప్రత్యేక జ్ఞాపకమంటూ ఉండదు. ఆ దశ దాటినప్పుడు ఏదో కోల్పోయానన్న భావన ఉంటుంది.

తల్లిపాలతో నగల తయారీ మొదలుపెట్టా. ఎన్నో వైఫల్యాల తర్వాత ఎట్టకేలకు చేయగలిగా అంటుంది సఫియా.. ఎలా తయారు చేసిందో ఆమె మాటల్లోనే..” ముందు పాలను డీహైడ్రేట్‌ చేసి, దానికి పసుపు రంగులోకి మారని రెజిన్‌ని కలిపి నగలుగా రూపొందించా. ఏళ్లు గడిచినా వాటిలో ఏ మార్పూ రాదు కూడా. జుంకీలు, ఉంగరాలు, బ్రాస్‌లెట్‌లు, పెండెంట్‌లు… ఇలా కోరిన విధంగా చేసిస్తున్నాం.” అంటోంది సఫియా.

ఈ వ్యాపారం ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే ఆదరణ వచ్చిందట.. కొద్దినెలల్లోనే వ్యాపారం 480 శాతం పెరిగింది. వచ్చే ఏడాదికి వార్షికాదాయం రూ.పది కోట్లకు చేరుకుంటుందని సఫియా అంటున్నారు.. స్తన్యాన్ని అందించే సమయంలో ఇబ్బంది పడ్డవారూ, పిల్లల్ని కోల్పోయిన తల్లులు, ఈ సమయాన్ని మరపురాని అనుభూతిగా మలచుకోవాలనుకునే వారు.. ఎంతోమంది తమ సేవల్ని వినియోగించుకుంటున్నారట. ఓ పక్క వ్యాపారం చేస్తూనే.. మరోపక్క మరుపురానీ జ్ఞాపకాలను అందిస్తూ.. సఫియా ముందుకెళ్తున్నారు. వ్యాపారంలో వినూత్నంగా ప్రయత్నిస్తే సక్సస్ అవ్వగలం అని సఫియా ద్వారా మరోసారి స్పష్టమైంది కదా..!