వయసు పెరిగినా తరగని అందం.. యాభై ఏళ్ళ రమ్యక్రిష్ణ సొంతం..

1990లలో రమ్యక్రిష్ణ ఒక సంచలనం. దక్షిణాదిన యువకులందరికీ కలల రాణి. తన అందంతో సినిమాకే గ్లామర్ తీసుకువచ్చింది. హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసింది. తన నటనతో ఎన్నో పాత్రల్లో మెప్పించింది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు క్రిష్ణవంశీని పెళ్ళి చేసుకున్న తర్వాత సినిమాలకి గ్యాప్ ఇచ్చిన రమ్యక్రిష్ణ, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది.

ఏ పాత్ర చేసినా ఆ పాత్రకి మరింత వన్నెతెస్తుంది. బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో ఆమె నటన అద్భుతం. రాజమౌళి సృష్టించిన దృశ్యకావ్యంలో ఆ పాత్రలో రమ్యక్రిష్ణని తప్ప మరొకరిని ఊహించుకోలేం అంటే శివగామిగా రమ్యక్రిష్ణ ఎంతలా మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. గర్వంతో విర్రవీగిపోయే పాత్రల్లో అయినా, అమాయకంగా తనకేమీ తెలీదన్నట్లుగా కనబడే పాత్రల్లో అయినా, రాజసం పలికించే పాత్రల్లో అయినా.. ఏ పాత్ర చేసినా అందులో రమ్యక్రిష్ణ ఉందంటే ఆ పాత్ర స్టైలే మారిపోతుంది.

ప్రస్తుతం రమ్యక్రిష్ణకి యాభై ఏళ్లు వచ్చాయి. 1970వ సంవత్సరంలో సెప్టెంబర్ 15వ తేదీన జన్మించిన రమ్యక్రిష్ణ, నేటితో 50వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న రమ్యక్రిష్ణ ఫోటోలు బయటకి వచ్చాయి. ఎంతో ఘనంగా జరుపుకోవాల్సిన పుట్టినరోజు వేడుకలని అంత సింపుల్ గా జరుపుకోవడం అందరికీ ఆశ్చర్యంగా ఉంది.

యాభైఏళ్ల వయసులోనూ రమ్యక్రిష్ణ జోరు తగ్గలేదు. ఇప్పటికీ ఆమెకి పాత్రలు వరుసకడుతున్నాయి. బాహుబలి ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, మరిన్ని మంచి మంచి పాత్రల్లో కనిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.