సుమ ఫ్యామిలీ నుంచి హీరో వ‌చ్చేస్తున్నాడు!

వెండితెర‌పై వార‌సుల అరంగేట్రం కొత్తేమీ కాదు. త‌రం మారుతున్నా కొద్దీ వార‌సులు వ‌స్తూనే వున్నారు. కొంత మంది నిల‌బ‌డుతున్నారు. కొంత మంది ఆచూకీ లేకుండా పోతున్నారు. ఇదే వ‌రుస‌లో మ‌రో వారసుడు వెండితెర‌కు ప‌రిచ‌యం కాబోతున్నాడు. బుల్లితెర‌పై యాంక‌ర్‌గా తిరుగులేని ఇమేజ్‌ని ద‌క్కించుకుంది సుమ‌.

న‌టుడిగా రాజీవ్ క‌న‌కాల కూడా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. వీరిద్ద‌రి వార‌సుడు రోష‌న్ క‌న‌కాల‌. ఇత‌న్నీ హీరోగా వెండితెర‌కు ప‌రిచ‌యం చేయాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీని రూపొందించ‌బోతున్నారు. కొత్త ద‌ర్శ‌కుడు విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ చిత్రానికి సుమ వ‌న్ ఆఫ్ ది ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతోంది. ఓ నూత‌న నిర్మాణ సంస్థ‌తో క‌లిసి సుమ నిర్మించ‌బోతోంది.

క‌న‌కాల ఫ్యామిలీ గ‌త కొన్నేళ్లుగా యాక్టింగ్ రంగంలో వుంది. రాజీవ్ క‌న‌కాల ఫాద‌ర్ దేవ‌దాస్ క‌న‌కాల కూడా న‌టుడు, మెంట‌ర్ అన్న విష‌యం తెలిసిందే. గ‌త కొంత కాలంగా రాజీవ్ క‌న‌కాల‌, సుమ దూరంగా వుంటూ వ‌చ్చారు. ఇటీవ‌లే మ‌ళ్లీ ఇద్ద‌రు క‌లిశారు. ఈ క‌లిసిన సంద‌ర్భంగా త‌మ త‌న‌యుడు రోష‌న్‌ని హీరోగా ప‌రిచ‌యం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానుంది.