తెలంగాణలో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఏటికి ఎదురీదుతోందా ? బీజేపీ అక్కడ అంచనాలకు మించి పుంజుకుందా ? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ గెలుపు తీరాలకు దగ్గర్లో ఉందా ? అంటే తాజా అంచనాలు, సర్వేలు అవుననే అంటున్నాయి. ఉప ఎన్నిక నోటిఫికేషన్‌కు ముందు అధికార పార్టీలో ఉన్న ధీమా చివరకు పోలింగ్ తేదీ దగ్గర పడుతోన్న కొద్ది సడలుతోన్న పరిస్థితే కనిపిస్తోంది. ఇప్పటికే పలు ప్రీ పోల్ సర్వేలు దుబ్బాక కారు జోరుకు ఈ సారి కొన్ని బ్రేకులు అయినా పడతాయన్న అంచనాలు వెలువడ్డాయి.
తాజాగా దుబ్బాక ఉప ఎన్నికపై పబ్లిక్ పల్స్ సర్వే సంస్థ చేసిన సర్వేలో అనూహ్యంగా బీజేపీ పుంజుకోవడంతో పాటు ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు 2 శాతం ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో నాడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సోలిపేట రామలింగారెడ్డి ఏకంగా 62 వేల ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఇప్పుడు ఆయన భార్య సుజాతనే కేసీఆర్ రంగంలోకి దింపి.. సానుభూతి మంత్రాన్ని బాగా జపిస్తున్నారు. అయితే ఇటు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు వివాద రహితుడు, ప్రజా సమస్యలపై పోరాటం చేసిన నేతతో పాటు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసిన నేత కావడంతో ఆయనకు ప్లస్ అవుతోంది.
అన్నింటికి మించి రఘునందన్ ఇప్పటికే దుబ్బాకలో ఎమ్మెల్యేగా రెండుసార్లు, మెదక్ ఎంపీగా ఓ సారి ఓడిపోయారు. అంతకుముందు ఇదే ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ నుంచి ఓడిపోయారు. నాలుగుసార్లు ఓడిన రఘునందన్‌కు ఇప్పుడు సోలిపేట సుజాతను మించిన సానుభూతి ఏర్పడుతోంది. రఘునందన్ నుంచి గట్టి పోటీ వస్తుండడంతోనే మంత్రి హరీష్‌రావు కాంగ్రెస్‌ను ప్రచారంలో పూర్తిగా వదిలేసి బీజేపీ, రఘునందన్‌నే టార్గెట్ చేస్తున్నారు. అందుకే రఘునందన్‌ను టార్గెట్‌గా చేసుకుని పోలీసులను ప్రయోగిస్తున్నారన్న విమర్శలు కూడా టీఆర్ఎస్‌పై ఉన్నాయి. అలాగే బీజేపీ అభ్యర్ధి మామ ఇంట్లో డబ్బలు దొరికాయనే వివాదంతో టీఆర్ఎస్ నేతలపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఇక తాజాగా పబ్లిక్ పల్స్ సర్వేలో బీజేపీ రఘునందన్ 2 శాతం ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు. ఇక ప్రాంతాల వారీగా చూస్తే దుబ్బాక మున్సిపాల్టీలో బీజేపీకి, రూరల్లో టీఆర్ఎస్‌కు లీడ్ ఉంది. మిరుదొడ్డి, రాయపోల్, దౌలతాబాద్ మండలాల్లోనూ టీఆర్ఎస్‌కు ఆధిక్యత ఉంది. తొగుంట మండలంలో కాంగ్రెస్‌కు ఆధిక్యత కనిపించగా, చేగుండ, నర్సింగ్ మండలాల్లో బీజేపీకి ఆధికత్య ఉంది. ఒక్క మండలంలో కాంగ్రెస్‌కు లీడ్ రాగా.. మిగిలిన చోట్ల బీజేపీ, టీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే కీలకమైన మున్సిపాల్టీలో బీజేపీ ఆధిక్యతతో ఉంది. బీజేపీ జాగ్రత్తగా పోల్ మేనేజ్‌మెంట్ చేసుకుంటే ఆ పార్టీకి గెలుపు అవకాశాలున్నాయంటున్నారు. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.