సల్మాన్ ఖాన్ : ది బాక్సాఫీస్ బాద్షా…!!

-

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఖాన్ డిసెంబర్ 27, 1965లో జన్మించాడు. ఆయన తండ్రి సలీం ప్రముఖ స్క్రీన్ రచయిత. ఇక సినిమాల్లోకి అడుగుపెట్టిన తరువాత మెల్లగా విజయాలను అందుకుంటూ ముందుకు సాగిన సల్మాన్ సినీ జీవితంలో సక్సెస్ లతో పాటు ఫెయిల్యూర్ చిత్రాలు కూడా ఉన్నాయి. కెరీర్ పరంగా తొలిసారిగా బివి హోతో ఐసి అనే సినిమా ద్వారా1988లో సహాయనటునిగా ఎంట్రీ ఇచ్చిన సల్మాన్, ఆ తరువాత సూరజ్ బర్జత్య దర్శకత్వంలో తెరకెక్కిన మైనే ప్యార్ కియా సినిమాతో కథానాయకునిగా మారారు. తొలిసారి సల్మాన్ హీరోగా నటించిన ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో పాటు ఆయనకు ఫిలిం ఫేర్ అవార్డును కూడా తెచ్చిపెట్టింది.

ఇక 1990వ దశకంలో ఆయన నటించిన హమ్ ఆప్కే హై కౌన్, రాకేష్ రోషన్ దర్శకత్వంలో వచ్చిన కరన్ అర్జున్, బీవీ నెం.1 వంటి సినిమాలతో నటుడిగా బాలీవుడ్ లో తనదైన గుర్తింపు  తెచుకున్నారు సల్మాన్. అనంతరం 1998లో కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన కుచ్ కుచ్ హోతా హై సినిమాలోని  ఆయన నటనకు గాను మరొక్కసారి ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం  అందుకున్నారు సల్మాన్. ఇక తరువాతి 2000వ దశకం ఆయనకు చాలావరకు కలసి రాలేదనే చెప్పాలి. అక్కడి నుండి కొన్నేళ్లపాటు వరుసగా ఆయన సినిమాలు చాలా వరకు ఫెయిల్యూర్ బాట పట్టగా, మధ్యలో ప్రభుదేవా దర్శకత్వంలో తెలుగు పోకిరికి రీమేక్ గా తెరకెక్కిన వాంటెడ్ సినిమా, అప్పట్లో సల్మాన్ కు పెద్ద బ్రేక్ ని ఇచ్చింది. ఇక ఆ తరువాత 2010లో ఆయన హీరోగా తెరకెక్కిన దబాంగ్ సినిమాతో మళ్ళీ విజయాల బాట పట్టారు  సల్మాన్.

ఆ తరువాత ఆయన నటించిన బాడీ గార్డ్, ఏక్ థా టైగర్, కిక్, బజరంగీ భాయీజాన్, సుల్తాన్ సినిమాలతో బాలీవుడ్ లోనే అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాలను అందుకొని సరికొత్త రికార్డు సృష్టించారు సల్మాన్. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్య విషయం చెప్పుకోవాలి. బాలీవుడ్ హీరోల్లో దాదాపుగా 9 ఏళ్ళ పాటు వరుసుగా బాలీవుడ్ కు అత్యధిక వసూళ్ళు అనుకున్న సినిమాలు సల్మాన్ వే కావడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక ఈ ఏడాది నోట్ బుక్ అనే సినిమాను నిర్మించి అందులో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చిన సల్మాన్, అనంతరం భారత్ అనే సినిమాతో మంచి సక్సెస్ ని అందుకోగా, ప్రస్తుతం ఆయన నటించిన తాజా సినిమా దబాంగ్ 3 మంచి వసూళ్లతో ముందుకు సాగుతోంది. కాగా ప్రస్తుతం రాధే అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు సల్మాన్. ఈ విధంగా సల్మాన్ తిరుగులేని బాక్సాఫీస్ బాద్షాగా బాలీవుడ్ లో కొనసాగుతున్నారు…..!!

Read more RELATED
Recommended to you

Latest news