కోలీవుడ్ దర్శకుడు ఇంద్రావతు ఒరు నాల్ ఫేమ్ వెట్రి దురైసామి(45) కారు నదిలో పడి ఆయన అదృశ్యమయ్యారు. అప్పటి నుంచి ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎట్టకేలకు తొమ్మిది రోజుల తర్వాత ఆయన మృతదేహం లభ్యమైంది. నది ఒడ్డున ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
వెట్రి దురైసామి తన స్నేహితులు గోపీ నాథ్ – తంజిన్‌లతో కలిసి హిమాచల్ ప్రదేశ్‌కు విహారయాత్రకు వెళ్లారు. తన తదుపరి సినిమాల కోసం లొకేషన్స్ చూసేందుకు అక్కడికి వెళ్లినట్లు సమాచారం. దారి మధ్యలో ఫిబ్రవరి 4వ తేదీన వారి కారు అదుపుతప్పి సట్లెజ్ నదిలో పడిపోగా గోపీ నాథ్‌కు(32) తీవ్ర గాయాలు అయ్యాయి. తంజిన్ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. గోపీ నాథ్ ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఈ విషయాన్ని తెలిపారు.
ప్రమాదం జరిగిన తర్వాత వెట్రి ఆచూకి లభించలేదు. అప్పటి నుంచి రెస్క్యూ టీమ్ వెట్రిని వెతుకుతూ ఉండగా తొమ్మిది రోజుల తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్ననూర్ జిల్లాలో దర్శకుడు వెట్రి దురైసామి మృతదేహం సట్లెజ్ నది ఒడ్డున దొరికింది. ఘటనా స్థలానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఆయన మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీకి పంపారు. ఆ తర్వాత దర్శకుడి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు.