కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ తలపతి విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమా బుధవారం విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ పిక్చర్ అంచనాలను అందుకో లేకపోయిందని చెప్పొచ్చు. రొటీన్ డ్రామాతో ప్రేక్షకుల ఓపికను ‘బీస్ట్’ టెస్ట్ చేస్తోందని టాక్ వినబడుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన గత చిత్రాలు విజయం సాధించాయి. కానీ, విజయ్ సినిమా ‘బీస్ట్’ మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదని ఫ్యాన్స్ అంటున్నారు.
ఈ సినిమా డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని విజయ్ అభిమానులు ముందు నుంచి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాట ‘బీస్ట్’ సినిమా చూస్తే లీటర్ పెట్రోల్ ఫ్రీ అంటూ ఆఫర్స్ కూడా ఇచ్చారు. అయితే, సినిమాలో రొటీన్ స్టోరి, హీరో ఎలివేషన్ ఉన్నాయని కొందరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బుధవారం తమిళనాడులోని మధురై ప్రాంతానికి చెందిన ఓ టాకీసులో అభిమానులు ఏకంగా స్క్రీన్ కు నిప్పు అంటించారని తెలుస్తోంది. దాంతో సినీ ప్రేక్షకులు వెంటనే థియేటర్ నుంచి బయటకు పరుగులు తీశారు.
థియేటర్ లో వెంటనే మంటలు అదుపులోకి రావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అయితే, కొందరు అభిమానులు ఇలా చేయడం పట్ల సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సినిమా నచ్చకపోతే ఇలా చేయడం తప్పని అంటున్నారు. థియేటర్ యాజమాన్యానికి నష్టం కలిగితే ఎవరు భరిస్తారని ప్రశ్నిస్తున్నారు.
‘బీస్ట్’ నిర్మాతలు ఈ విషయమై స్పందించాల్సి ఉంది. ఇకపోతే విజయ్ నెక్స్ట్ మూవీ ‘తలపతి 66’..టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. నేషనల్ అవార్డు విన్నర్ ‘మహర్షి’ ఫేమ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో హీరోయిన్ గా క్యూట్ భామ రష్మిక మందన నటించనుంది.