దేశభక్తి ఫార్ములా ఎప్పుడూ సూపర్​హిట్టే.. తొలిసారి సెట్లో జెండా ఆవిష్కరణ ఎప్పుడంటే?

-

ఆగష్టు 15.. తెల్లదొరల బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొంది భారతీయులను స్వాతంత్రం పొందిన గొప్ప రోజు. ఎన్నెన్ని కథలుగా చెప్పినా తరగని పోరాటాలు, ప్రాణ త్యాగాలతో కూడిన గొప్ప ఉద్యమ చరిత్ర మనది. ఇప్పటికే మనం మాతృభూమి గురించి, స్వరాజ్యం గురించి స్పృశించే ఎన్నో పుస్తకాలు చదివాం. అలానే తెరపైనా వారి జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలను చూశాం. ముఖ్యంగా చెప్పాలంటే మన సినిమాకు.. వెండితెరకు వీడదీయలేని అనుబంధం ఉంది. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా ఇంకా ఆ త్యాగాల్ని గుర్తు చేస్తూ ప్రేక్షకుల్లో స్ఫూర్తిని రగిలించే సినిమాలను తెరకెక్కిస్తూనే ఉన్నాం.

ఇక టాలీవుడ్‌ విషయానికొస్తే.. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్​ఆర్, కృష్ణ.. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలు తమ సినిమాల్లో దేశభక్తి అంశాలను తెలిపే కథలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ తరం వాళ్లు కూడా అలాంచి చిత్రాలతో స్ఫూర్తిని రగిలించారు. కమల్‌హాసన్‌ ‘భారతీయుడు’ మొదలుకొని ఈ ఏడాదే విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వరకు ఎన్నో సినిమాలు స్వతంత్ర సంగ్రామాన్ని ఆవిష్కరిస్తూ దేశభక్తిని చాటాయి. ‘రోజా’ మొదలుకొని ‘ఖడ్గం’, ‘మహాత్మ’, ‘ఘాజీ ఎటాక్‌’, ‘ఉరి’, ‘మేజర్’, ‘సీతారామం’ వరకు ఎన్నో సినిమాలకి దేశభక్తి ప్రధానంగా సాగే భావోద్వేగాలే కీలకం. నేడు 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్య ప్రాముఖ్యతను, దేశ గొప్పతనాన్ని తెలుపుతూ ఇటీవలే వచ్చిన కొన్ని సినిమాలేంటో తెలుసుకుందాం…

 

ఆర్ఆర్ఆర్… ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించిన చారిత్ర‌క చిత్రం ఆర్ఆర్ఆర్. ఆంగ్లేయుల‌పై తిరుగుబాటు చేసిన తొలిత‌రం స్వాతంత్ర్య‌ స‌మ‌ర‌యోధుడు అల్లూరి సీతారామ‌రాజుతో పాటు నిజాం పాలకుల అకృత్యాలను ఎదురించిన కొమురం భీమ్ జీవితాలకు ఫిక్ష‌న‌ల్ అంశాల‌ను జోడించి రాజ‌మౌళి ఈ సినిమాను రూపొందించారు. ఇద్ద‌రు పోరాట‌యోధులు క‌లిసి బ్రిటీష్ వారిపై చేసిన పోరాటాన్ని హీరోయిజం, ఎమోష‌న్స్ మేళ‌వించి శక్తివంతంగా సినిమాను తెరకెక్కించారు. భార‌తీయుల్ని బానిస‌లుగా భావిస్తూ బ్రిటీష్ పాలకులు ఎలా వివ‌క్ష‌కు గురిచేసేవారో ఆర్ఆర్ఆర్​లో రాజమౌళి చూపించారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించారు.

మేజర్​… 2022లో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద హిట్‌ను సాధించిన సినిమాల్లో ఒక‌టిగా మేజ‌ర్ నిలిచింది. ముంబై ఉగ్ర‌దాడుల్లో క‌న్నుమూసిన ఎన్ఎస్‌జీ క‌మాండో మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ జీవితం ఆధారంగా దేశ‌భ‌క్తి ప్ర‌ధాన క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కింది. దేశం కోసం ప్రాణాల‌కు ప‌ణంగా పెట్టి సైన్యం, ఎన్ఎస్‌జీ క‌మాండోలో చేసే పోరాటాన్ని స్ఫూర్తిదాయ‌కంగా ఆవిష్కరించిన సినిమా ఇది. అడివిశేష్ హీరోగా న‌టించిన ఈ చిత్రానికి శ‌శికిర‌ణ్ తిక్కా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.
రాకెట్రీ.. ప్రఖ్యాత ఇస్రో శాస్త్రవేత్త‌, గూఢ‌చ‌ర్యం ఆరోప‌ణ‌ల్ని ఎదుర్కొని నిర‌ప‌రాధిగా బ‌య‌ట‌ప‌డ్డ నంబి నారాయ‌ణ‌న్ జీవిత క‌థే ఈ చిత్రం. జేమ్స్‌ బాండ్‌ని కూడా త‌ల‌ద‌న్నేలా ఉంటుంది నంబి నారాయ‌ణ‌న్ జీవితం. రాకెట్ సైన్స్ కోసం ఆయ‌న చేసిన కృషి.. మ‌న దేశం కోసం చేసిన త్యాగాలు స్ఫూర్తిదాయ‌కం. ప‌ద్మభూష‌ణ్ పుర‌స్కార గ్రహీత అయిన ఆయ‌న జీవితంలో మ‌లుపులు సినిమాల్లోని ట్విస్ట్‌లను త‌ల‌ద‌న్నేలా ఉంటాయి. ఈ చిత్రంలో మాధవన్​ ప్రధాన పాత్ర పోషించి ప్రశంసలను అందుకున్నారు.

సైరా నరసింహారెడ్డి… బ్రిటీష్ పాలకుల అన్యాయాలపై తిరుగుబాటు రాయలసీమ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం సైరా నరసింహారెడ్డి. చిరంజీవి టైటిల్ పాత్రలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తన అనుచరులు, చుట్టుపక్కల రాజ్యాలతో కలిసి బ్రిటీషర్లను ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎదురించి పోరాటాన్ని సాగించిన తీరును వాస్తవిక కోణంలో చాటిన సినిమా ఇది. సైరా నరసింహారెడ్డిలో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఘాజీ… రానా ప్రధాన పాత్రలో నటించిన ఘాజీ చక్కటి దేశభక్తి సినిమాగా ప్రేక్షకుల్ని మెప్పించింది. 1971 లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా సబ్ మెరైన్ వార్ బ్యాక్ డ్రాప్ రూపొందిన ఘాజీ సినిమాలో భారత నావికా దళం పోరాటపఠిమను చాటిచెప్పింది. అలాగే ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన రానా 1945 కూడా దేశభక్తి ప్రధాన కథాంశంతోనే తెరకెక్కింది. కానీ ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది.

గతంలోనూ పలు చిత్రాలు స్వతంత్ర సంగ్రామాన్ని ఆవిష్కరిస్తూ దేశభక్తిని చాటాయి. అవేంటే కూడా తెలుసుకందాం..

తొలి చిత్రం ఇదే.. తెలుగులో రూపొందిన తొలి సాంఘిక చిత్రం ‘ప్రేమవిజయం’. 1936లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అప్పటిదాకా పౌరాణిక కథలే మన ప్రేక్షకులకు పరిచయం. తొలిసారి ఒక సాంఘిక కథతో వచ్చిన ఈ సినిమాలోనే స్వాతంత్య్ర కాంక్ష కనిపిస్తుంది. ఆ తర్వాత రూపొందిన పలు సాంఘిక చిత్రాల్లోనూ అప్పటికే సమాజంలో వేళ్లూనుకుపోయిన దురాచారాల్ని విమర్శిస్తూ, దేశభక్తిని చాటిచెబుతూ, స్వరాజ్య బాణీని వినిపించే ప్రయత్నం చేశారు. ‘మాల పిల్ల’, ‘మళ్ళీ పెళ్ళి’, ‘రైతు బిడ్డ’, ‘వందేమాతరం’, ‘సుమంగళి’, ‘దేవత’ తదితర చిత్రాల్లో దేశభక్తి ప్రధానంగా సాగే సన్నివేశాలు కనిపిస్తాయి.

బ్రిటిష్‌ ప్రభుత్వ నిషేధం: గూడవల్లి రామబ్రహ్మం రూపొందించిన ‘రైతుబిడ్డ’ అప్పటి జమిందారీ వ్యవస్థని విమర్శిస్తూ రూపొందింది. ఆ సినిమా ప్రదర్శనని కొన్నిచోట్ల నిషేధించింది బ్రిటిష్‌ ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి సానుభూతి పరులైన కొద్దిమంది జమిందార్ల కోరికతోనే ఆ ప్రయత్నం చేసింది. ‘వందేమాతరం’ సినిమాకీ అదే పరిస్థితి ఎదురైంది. బ్రిటిష్‌ పాలనలో భారతీయులు ఎదుర్కొంటున్న నిరుద్యోగం, సంఘంలోని వరకట్నం దురాచారాలపై ఎక్కుపెట్టి తీసిన చిత్రమది.

1947లో విడుదలై.. 1941లో మహాత్మాగాంధీ ఆశయాలతో ‘మహాత్మాగాంధీ’ చిత్రం రూపొందింది. ఆ సినిమా అప్పట్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. డాక్యుమెంటరీ తరహాలో రూపొందడమే కారణం అంటారు. 1946లో గూడవల్లి రామబ్రహ్మం ‘పల్నాటియుద్ధం’ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమా పూర్తి కాక ముందే ఆయన కన్నుమూయడంతో, మిగిలిన సినిమాని ఎల్‌.వి.ప్రసాద్‌ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 1947లో విడుదలైన ఈ సినిమాలో తెల్లదొరల పాలనని విమర్శించే పౌరుషమైన సంభాషణలు వినిపిస్తాయి.

దేశం కోసం ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా తెల్లవారిని ఎదురించిన పోరాట యోధుల జీవితాల ఆధారంగా విరివిగా సినిమాలు రూపొందాయి. కృష్ణ నటించిన ‘అల్లూరి సీతారామరాజు’, శివాజీ గణేశన్‌ ‘వీర పాండ్య కట్ట బొమ్మన్‌’, విజయ్‌ చందర్‌ ‘ఆంధ్రకేసరి’, చిరంజీవి ‘ఠాగూర్​’, ‘సైరా నరసింహారెడ్డి’ తదితర చిత్రాలు ఆ కోవకి చెందినవే. వెంకటేష్‌ ‘సుభాష్‌ చంద్రబోస్‌’ చిత్రంతో స్వాత్రంత్ర స్ఫూర్తిని రగిలించారు. ‘బొబ్బిలియుద్ధం’, ‘తాండ్ర పాపారాయుడు’, ‘సర్దార్‌ పాపారాయుడు’, ‘మేమూ మనుషులమే’, ‘నాడు నేడు’ తదితర చిత్రాలు స్వతంత్ర పోరాటం నేపథ్యంగా రూపొందినవే. అల్లూరి సీతారామరాజు పాత్రపై మన కథానాయకులు ఎంతోమంది మక్కువ ప్రదర్శించారు. కృష్ణ ఆ పాత్రపై తనదైన ముద్రవేయగా, ఎన్టీఆర్‌ పలు చిత్రాల్లో అల్లూరిగా మెరిశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా సందడి చేశారు.

ప్రేమకథలకూ స్ఫూర్తిగా నిలుస్తున్న దేశభక్తి.. బయోపిక్స్, యాక్షన్, థ్రిల్లర్ చిత్రాలకు మాత్రమే కాదు… ప్రేమకథలకూ దేశభక్తి స్ఫూర్తిగా నిలుస్తోంది. ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అంటూ ‘సీతారామం’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్ల దగ్గర స్పందన ఎలా ఉందో చూశాం. ‘ప్రేమ యుద్ధంలోనూ ఉంటుంది. ఎక్కడైనా ప్రేమ యుద్ధంలానే ఉంటుంది’ అని కొన్నేళ్ల క్రితం ‘కంచె’ వచ్చింది. తీవ్రవాదం నేపథ్యంలో మణిరత్నం తీసిన ‘రోజా’ను మర్చిపోగలమా? ఇలా చాలా సినిమాలే వచ్చాయి.

1947 ఆగస్టు 15 తర్వాత స్వరాజ్యం సిద్ధించిన ఉత్సాహాన్ని చాటి చెప్పేలా ఎన్నో పాటలు రూపుదిద్దుకొన్నాయి. మొదట ప్రైవేటు గీతాలుగా బయటికొచ్చిన అవి ఆ తర్వాత సినిమాల్లోనూ వినిపించాయి. ‘స్వాతంత్య్రము మా జన్మహక్కని చాటండీ…’, ‘మ్రోయింపుము జయభేరీ’, ‘ఓహోహో స్వాతంత్య్ర దేవీ ఏవీ నీవిచ్చెడి కానుకలేవీ..’, ‘హే భారత జననీ…’, ‘దేశమును ప్రేమించుమన్నా..’, ‘ఉదయమ్మాయెను… స్వేచ్ఛా భారత ఉదయమ్మాయెను’, వంటి పాటలు అప్పట్లో వినిపించాయి. ఏఎన్నార్‌ ‘వెలుగునీడలు’లో ‘పాడవోయి భారతీయుడా…’ అంటూ సందేశాత్మక గీతం వినిపిస్తుంది.

ఎన్టీఆర్‌ నటించిన ‘కోడలు దిద్దిన కాపురం’, ‘బడిపంతులు’ మొదలుకొని ‘మేజర్‌ చంద్రకాంత్‌’ వరకు పలు చిత్రాల్లోని పాటలు స్వాతంత్య్ర పోరాట యోధుల్ని గుర్తు చేస్తాయి. ‘నా జన్మభూమి ఎంతో అందమైన దేశమూ… నా ఇల్లు అందులో చక్కనీ ప్రదేశమూ’ మొదలుకొని ‘దేశం మనదే తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే’ వరకు ఎన్నో సినిమా పాటలు మన జెండా పండగలో భాగం అవుతున్నాయి.

తొలిసారి సెట్లో జెండా ఆవిష్కరణ.. మన దేశానికి స్వాతంత్య్రం లభించిన ఘడియల్లో చిత్తూరు నాగయ్య ‘భక్తజనా’ సినిమా చిత్రీకరణలో ఉన్నారు. సెట్లోనే ఆ విషయాన్ని తెలుసుకున్న చిత్తూరు నాగయ్య శాంతకుమారి తదితరులు అప్పటికప్పుడు జాతీయ పతాక ఆవిష్కరణకి ఏర్పాట్లు చేశారట. నాగయ్య చేతులమీదుగా పతాకావిష్కరణ చేశారు. తెలుగు సినిమా రంగానికి సంబంధించి తొలి స్వాతంత్య్ర దినోత్సవం ‘భక్తజనా’ సెట్లో జరిగిన పతకావిష్కరణ అనే చెబుతారు.అంతకుమునుపే చిత్తూరు నాగయ్య సత్యాగ్రహంలో పాల్గొన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ గాయకుడు ఘంటసాల క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు.

Read more RELATED
Recommended to you

Latest news