పవన్ కళ్యాణ్ తెలుగులో, సక్సెస్, ఫెయిల్యూర్‌కి అతీతంగా రాణించగలిగే హీరో. పవన్ గొప్ప నటుడు కాకపోయినా ఆయన స్టయిల్‌కి, మ్యానరిజానికి అభిమానులు ఊగిపోతుంటారు. టాలీవుడ్ పవర్‌స్టార్‌గా పాపులర్ అయిన పవన్ కళ్యాణ్ ఇటీవల రాజకీయాల్లోకి వెళ్ళి ఘోర పరాభవాన్ని చవిచూశారు. ఆయన స్థాపించిన జనసేన పార్టీ కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. తాను పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన పూర్తి నైరాష్యంలో పడ్డారు. దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అయిన పరిస్థితి ప్రస్తుతం పవన్‌ది. ఈ క్రమంలో ఆయన తిరిగి సినిమాలు చేస్తారా? లేదా? అన్న సందేహం అటు ఆయన అభిమానుల్లో, ఇటు చిత్ర పరిశ్రమ వర్గాల్లోనూ నెలకొంది.
ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తాను రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పిన పవన్ సినిమాల విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. దీంతో రోజుకో కొత్త పుకారు పుట్టుకొస్తుంది. గతంలో ఆయన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రామ్ తాళ్ళూరి ఆసినిమాని నిర్మించనున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై హరీష్ శంకర్ స్పందించి పుకార్లని ఖండించారు. ఇటీవల మరో వార్త సామాజిక మాద్యమాల్లో హల్ చల్ చేసింది. పవన్ స్నేహితుడు బండ్ల గణేష్ నిర్మాతగా, బోయపాటి దర్శకత్వంలో దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో ఓ సినిమా చేయబోతున్నారనే వార్త వైరల్ అయ్యింది. ఈ చిత్రానికిగానూ పవన్ కి పారితోషికంగా రూ.40 కోట్లు ఇవ్వాలని నిర్మాత నిర్ణయించారని తెలిసింది. ఈ వార్త విని ఆయన అభిమానులు ఫుల్‌ఖుషీ అయ్యారు. పవర్ స్టార్ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో తమకు నచ్చిన కొటేషన్స్ పెట్టుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో దీనిపై నిర్మాత బండ్ల గణేష్ స్పష్టత ఇచ్చారు. ‘నా నిర్మాణ సంస్థలో ఏ సినిమా ఫైనల్ కాలేదు. నా నుంచి ఏదైనా సినిమా వస్తే అందరి కన్నా ముందుగా నేనే చెబుతా’ అని ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులపై నీళ్ళు చల్లినంత పనైంది. అయితే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్‌ని కలిసిన మాట వాస్తవమేనట. సినిమా చేయాలని పవన్‌ని రిక్వెస్ట్ చేయగా, అందుకు పవన్ నో చెప్పారట. తిరిగి సినిమాల్లోకి వచ్చేది లేదని పవన్ స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ ఆయన్ని కన్విన్స్ చేసే పనిలో బండ్ల గణేష్ ఉన్నారట. మరి రాజకీయ స్టాండ్‌పై నిలబడతారా? మళ్ళీ సినిమాల్లోకి వస్తారా? రాజకీయాల్లో కొనసాగుతూ సినిమాలు చేస్తారా? లేక పూర్తి రాజకీయాలకే పరిమితమవుతారా? అన్నది సస్పెన్స్ గా మారింది. అప్పటి వరకు ఊహారాయళ్ళకు వార్తలు పుష్కలంగా దొరుకుతాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పవన్ చివరగా 2018లో ‘అజ్ఞాతవాసి’ సినిమాలో నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ అయ్యారు.