రామ్ చరణ్ మరెంతో ఎదగాలి.. చెర్రీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

మెగా ఫ్యామిలీ ఇంట వరుసగా శుభాలే జరుగుతుండడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. గతేడాది రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడని ప్రకటించడం, ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ దక్కడం, ఈ క్రమంలోనే చరణ్ కు గ్లోబల్ స్టార్ గా క్రేజ్ దక్కడం వంటి ఎన్నో అంశాలు మెగా అభిమానుల ఆనందానికి కారణమయ్యాయి. ఈ సందర్భంలోనే నేడు ( మార్చ్ 27)న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా చాలా తక్కువ సమయంలో హాలీవుడ్ రేంజ్ కి ఎదిగిన చెర్రీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

రామ్ చరణ్ మరెంతో ఎదగాలని… మన్ననలు పొందాలని ట్వీట్ చేశారు. “అంతర్జాతీయ స్థాయి ప్రశంసలు పొందేలా ఎదిగిన రామ్ చరణ్ కి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. స్నేహభావంతో మెలిగే చరణ్ మరెన్నో విజయాలు అందుకొని ఎదగాలని, అందరి మన్ననలూ అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. దైవ చింతన, ప్రశాంత చిత్తం కలిగిన చరణ్ కి ఉన్న క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్ధత ఆయుధాల్లాంటివి. కచ్చితంగా భవిష్యత్తులో మన సినిమా కీర్తి పతాకాన్ని ఎగురవేసే మంచి చిత్రాలను తను అందిస్తాడని ఆశిస్తున్నాను” అన్నారు పవన్ కళ్యాణ్.