కిరికిరి వ‌ద్దంటున్న‌ రామ్..  ఇస్మార్ట్‌ శంకర్ మూవీ టీజ‌ర్‌ విడుదల

‘నాతో కిరికిరి అంటే పోచమ్మ గుడి ముంగట పొట్టేలుని కట్టేసినట్లే.., మూర్ ముంత చోడ్ చింత‌!’ అని అంటున్నారు ఎన‌ర్జిటిక్ హీరో రామ్‌. ఇదంతా ఆయ‌న ప్ర‌స్తుతం న‌టిస్తున్న‘ఇస్మార్ట్‌ శంకర్’ సినిమా కోసం. మ‌రి ఆయ‌న్ని కిరికిరి పెడుతున్న‌దెవ‌రో అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే అంటోంది చిత్ర బృందం. రామ్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వ‌హిస్తున్నారు. నేడు(బుధవారం) రామ్‌ పుట్టినరోజు. ఈ సంద‌ర్భాన్ని పురస్కరించుకుని తాజాగా ఈ చిత్ర టీజ‌ర్‌ని విడుదల చేశారు. టీజ‌ర్‌లో ‘పతా హై మై కౌన్‌ హూ.. శంకర్‌.. ఉస్తాద్‌ ఇస్మార్ట్‌ శంకర్‌’ అని రామ్ త‌న పేరుని ప‌రిచ‌యం చేసిన తీరు ఆక‌ట్టుకుంటుంది.

ఇందులో ఆయ‌న డాన్సులు, ఫైట్స్ ఎన‌ర్జిటిక్ గా సాగుతూ ఆద్యంతం ఆక‌ట్టుకుంటున్నాయి. సినిమా ఫుల్ మాస్‌గా సాగుతుంద‌ని టీజ‌ర్ చెప్ప‌క‌నే చెబుతుంది. అలాగే పూరీ మార్క్ హీరో క్యారెక్ట‌రైజేష‌న్ కి రామ్ ఎన‌ర్జీ తోడ‌వ్వ‌డంతో సినిమా మ‌రో రేంజ్‌లో ఉండ‌బోతుంద‌నే విష‌యం అర్థ‌మ‌వుతుంది. అయితే ఇటీవ‌ల పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడిగా త‌న స‌త్తాని చాట‌లేక‌పోతున్నారు. టెంప‌ర్ త‌ర్వాత వ‌రుస‌గా ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమాలు డిజాస్ట‌ర్స్ గా నిలుస్తున్నాయి. ఆడియెన్స్ ని ఆక‌ట్టుకోవ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో పూరీ ఎలాగైనా హిట్ కొట్టాల‌నే క‌సితో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. రామ్ సైతం అదే క‌సితో ఉన్నారు. ఆయ‌న‌కు కూడా వ‌రుస‌గా మూడు ఫ్లాప్‌లు చ‌విచూశారు.

త‌న‌కూ అర్జెంట్‌గా ఓ హిట్ కావాలి. ఈ నేప‌థ్యంలో ఈ ఇద్ద‌రు ఫెయిల్యూర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్నఈ సినిమా అటూ పూరీకి, ఇటు రామ్‌కి చాలా కీల‌కం. మ‌రి రొటీన్ మాస్, మ‌సాలా ఎలిమెంట్స్ తో మాయ చేస్తారా? లేక‌ కొత్త‌ద‌నంతో కూడిన క‌థ‌తో తెర‌పై మ్యాజిక్ చేస్తారా? అన్న‌ది చూడాలి. ఇక ఇందులో నిధి అగర్వాల్‌, నభా నటేశ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. పూరీ జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ పూర్తి చేసుక‌న్న ఈ సినిమా ప్రస్తుతం గోవాలో ఓ సాంగ్ చిత్రీకరణ జరుపుకుంటోంది. రామ్‌, నభాలపై ఈ పాటని తెరకెక్కిస్తున్నారు. మరో మూడు పాటలు చిత్రీకరిస్తే షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. దీనికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. జూన్‌ చివరివారంలో కానీ, జులైలో కానీ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.