అశ్వినీదత్ రాగానే కుర్చీలో నుంచి లేచి నిలబడ్డ ఎన్టీఆర్..ఆ తర్వాత..!!

ఎన్టీఆర్..సినిమాకు ఇచ్చే గౌరవం ఎంతనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షూటింగ్ సమయంలో ఒక టైమ్ అనుకుంటే చాలు.. తప్పకుండా ఆ టైమ్ కు వచ్చి షూట్ చేసేవారు ఎన్టీఆర్. క్రమశిక్షణకు మారు పేరు ఆయన. అదే సమయంలో పిక్చర్ తీసే ప్రొడ్యూసర్ కు సీనియర్ ఎన్టీఆర్ ఎంతో గౌరవం ఇస్తారు. ఓ సందర్భంలో సీనియర్ ఎన్టీఆర్, అశ్వినీదత్ మధ్య జరిగిన ఆసక్తికర సంఘటన గురించి ఇవాళ తెలుసుకుందాం.

వైజయంతీ మూవీస్ అధినేత అయిన అశ్వినీ దత్..సీనియర్ ఎన్టీఆర్ తో సినిమాలు తీయాలని అనుకున్నాడు. అందుకుగాను ప్రతీ రోజు ఎన్టీఆర్ ఇంటి ముందర వెయిట్ చేసేవారు. అలా వెయిట్ చేస్తున్న క్రమంలో ఓ రోజు ఎన్టీఆర్ పిలిచి అశ్వినీదత్ తో మాట్లాడి ఆయన నిర్మాణ సారథ్యంలో మూవీ చేయడానికి ఒప్పుకున్నారు.

అలా వీరి కాంబోలో ‘ఎదురు లేని మనిషి’ చిత్ర షూటింగ్ జరుగుతున్న రోజులవి. ఓ షాట్ కోసం సీనియర్ ఎన్టీఆర్ రెడీ అయిన తర్వాత కుర్చీలో కూర్చొని ఉన్నారు. దర్శకుడు పిలవగానే వెళ్లాలనుకున్నారు. అంతలో అక్కడకు నిర్మాత అశ్వినీదత్ వచ్చారు.

అంతే ఆయన రాగానే సీనియర్ ఎన్టీఆర్ కుర్చీలో నుంచి లేచి నిల్చున్నారు. అది చూసి అశ్వినీదత్..‘అన్న గారు మీరు లేచి నిల్చోవడం ఏంటీ? ’ అని అడగగా, మీరు నిర్మాత అంటే యజమాని..ఇక్కడున్న వారందరికీ అన్నం పెడుతున్నారు..కాబట్టి మిమ్ములను గౌరవించాలి, మిమ్ములనే గౌరవించకపోతే ఇంకెవరిని గౌరవిస్తాం అని అన్నారట. అలా నిర్మాత అంటే అంత గౌరవమిచ్చారు దివంగత సీనియర్ ఎన్టీఆర్. అప్పుడు అశ్వినీదత్ వయసు పాతికేళ్లు కాగా, సీనియర్ ఎన్టీఆర్ వయసు సుమారుగా 52 ఏళ్లట.

అశ్వినీదత్ బ్యానర్ కు సీనియర్ ఎన్టీఆరే పేరు పెట్టారన్న సంగతి చాలా మందికి తెలుసు. ‘వైజయంతీ మూవీస్’ అనే పేరు సజెస్ట్ చేసింది సీనియర్ ఎన్టీఆర్. ‘వైజయంతీ’ అనగా..కృష్ణుడి మెడలో ఉన్న దండ..అది ఎప్పుడూ వాడిపోకుండా ఉంటుంది. అది దాని ప్రత్యేకత కాగా, ఆ మాదిరిగా సంస్థ ఎల్లప్పుడూ నిలబడాలనే ఉద్దేశంతో సీనియర్ ఎన్టీఆర్ ఆ పేరు సజెస్ట్ చేసి ఉండొచ్చు.