అదనపు కట్నం కోసం భార్యను తీవ్రంగా వేధించాడు. అతడి వేధింపులు తాళలేక పుట్టింటికి వెళ్లిన ఆమెపై.. బంధువులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. అంతటితో ఆగకుండా రేప్ చేసిన తర్వాత ఆమెకు అక్కడే ముమ్మారు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాను.. ఇకపై నీకూ నాకు సంబంధం లేదంటూ వెళ్లిపోయాడు. ఈ అమానుష ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు మహమ్మద్ అద్నాన్.. లఖ్ నవూకు చెందినవాడు. అతడికి కొన్నేళ్ల క్రితం బాధితురాలితో వివాహమైంది. అదనపు కట్నం కోసం తరచుగా ఆమెను వేధించేవాడు. తీవ్రంగా కొట్టేవాడు. కొన్ని రోజుల నుంచి అద్నాన్ పెడుతున్న హింసలు తట్టుకోలేక.. బాధితురాలు తన పుట్టింట్లో ఉంటోంది.
అద్నాన్, అతని బంధువులు మంగళవారం.. బాధితురాలి కన్నవారింటికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనించారు. ఒంటరిగా ఉన్న మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిషేధించినా.. ముమ్మారు తలాక్ చెప్పి విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు అద్నాన్. ఇంటికి వచ్చిన బాధితురాలి తల్లిదండ్రులు విషయం తెలుసుకుని అద్నాన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు అద్నాన్ ను గురువారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న అతడి బంధువుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.