సింగీతం బర్త్ డే స్పెషల్.. తెలుగు సినిమాకు సరికొత్త దారిని చూపిన దర్శకుడు

-

తెలుగులో ప్రయోగాత్మక సినిమాలు తక్కువ అని చెబుతుంటారు. కానీ ఆ దర్శకుడు చేసిన సినిమాలన్నీ ప్రయోగాలే. అంతర్జాతీయ స్థాయి సినిమాలు రావట్లేదని వాపోతుంటారు. హాలీవుడ్ ను తలదన్నే కథలతో ప్రేక్షకులను మైమరపింప చేసిన దర్శకుడాయన. కాలంలో గిరికీలు కొట్టిస్తాడు. భవిష్యత్తులో ప్రయాణం చేయిస్తాడు. జానపద కథలతో ఊహాలోకంలోకి  తీసుకెళ్తాడు. మేడమ్ అంటూ హాస్యంతో నవ్వులు పండిస్తాడు. మాయా బజార్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి మాటల సినిమాలకు అలవాటు పడిన వారికి మాటలు లేని మూకీ సినిమాను చూపించి వారెవ్వా అనిపిస్తాడు.

singeetham-birthday-special

 

ఆయనే సింగీతం శ్రీనివాసరావు. తెలుగు సినిమా చరిత్రలో ఆయన తీసిన చిత్రాలు ఎల్లప్పటికీ గుర్తుండిపోతాయి. ఆదిత్య 369, భైరవ ద్వీపం, పుష్పక విమానం, మేడమ్, మయూరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. సినిమా సినిమాకు వేరియేషన్. ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం ఉండకపోవడం, సరికొత్త కథనం, ప్రేక్షకులను సరికొత్త సినిమాను చూపించాలన్న తాపత్రయం అన్నీ కలిస్తే సింగీతం శ్రీనివాసరావు.

ఆయన సినిమాలు విభిన్నంగా ఉంటాయి. అందుకే ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తెలుగు సినిమా మాస్ కథలతో ఊగిపోతున్న సమయంలో ఆదిత్య 369 అంటూ సరికొత్త కథాంశంతో వచ్చారు. అంతే, ఒక్కసారిగా తెలుగు సినిమా ముఖచిత్రమే మారిపోయింది. తెలుగులో ఇలాంటి సినిమాలు తీయొచ్చా? ప్రయోగాత్మక సినిమాలైన సరిగ్గా చూపిస్తే ప్రేక్షకులు పట్టం కడతారన్న సంగతి అర్థమైపోయింది. అటు బాలక్రిష్ణ నటన, ఇటు సింగీతం డైరెక్షన్ రెండూ కలిసి సినిమాను శిఖరం మీద నిలబెట్టాయి.

శ్రీక్రిష్ణ దేవరాయలను చూడని తెలుగువారికి క్రిష్ణదేవరాయలు ఇలాగే ఉండేవారేమో అన్నంతలా పాత్రలో ఒదిగిపోయారు బాలక్రిష్ణగారు. విజయనగర సామ్రాజ్యం ఇలానే ఉంటుందేమో అన్నట్టుగా చూపించారు సింగీతం గారు. తెలుగు సినిమాలో ఇంకా ఎన్నో అద్భుతమైన సినిమాలు వస్తుండవచ్చు. ఎన్ని వచ్చినా ఆదిత్య 369కి ఉన్న ప్రత్యేకత మాత్రం అలాగే ఉంటుంది. దటీజ్ సింగీతం శ్రీనివాసరావు గారు. మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు సార్.

Read more RELATED
Recommended to you

Latest news