ట్రెండ్ ఇన్ : సోనూ సూద్

-

రాజ‌కీయాలు వేరు సేవా మార్గం వేరు అన్న సంగ‌తి సోనూ కు తెలుసు. కానీ ఐదేళ్లు ఆగితేనే తానేంటో నిరూపించుకునే అవ‌కాశం వ‌స్తుంద‌ని భావించ‌డం సోనూకు మాత్ర‌మే సాధ్యం. ప్ర‌స్తుతం సోనూ చెల్లాయి మాళివిక కాంగ్రెస్ త‌ర‌ఫున పంజాబ్ ఎన్నిక‌ల్లో బ‌రిలో ఉంది. మోగా నియోజ‌క‌వ‌ర్గం త‌ర‌ఫున పోటీ చేస్తోంది. దీంతో సోనూ కూడా రాజ‌కీయాల్లోకి రాక త‌ప్ప‌డం లేదు. చెల్లాయి కోసం ఆయ‌న ప్ర‌చారం చేయ‌క త‌ప్ప‌డం లేదు.

తాను కేవ‌లం త‌న చెల్లి కోస‌మే త‌ప్ప ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం చేయ‌న‌ని సోనూ స్ప‌ష్టం చేయ‌డంతో ఇప్పుడిక కాంగ్రెస్ వ‌ర్గాలు ఆయ‌న‌ను ఒప్పించే ప‌నిలో ప‌డ్డాయి. ఎవ‌రు ఏం అనుకున్నా సోనూ సూద్ మాత్రం త‌న‌కు కొంత స‌మ‌యం ఇస్తేనే పొలిటిక‌ల్ ఎంట్రీపై ఏద‌యినా ఒక స్ప‌ష్టత ఇవ్వ‌గ‌ల‌నని చేతులు జోడించి మ‌రి! ప్రార్థిస్తున్నాడు.

అస‌లు ఎవ‌రూ అనుకోలేదు
ఎవ్వరూ ఊహించ‌ని స్థితిలో
ఒక గొప్ప మ‌నిషి అత‌డు అని
నిరూపించుకునేందుకు కాలం
ఇచ్చిన అవ‌కాశం లాక్డౌన్

లాక్డౌన్ అనే పేరు చెబితేనే హ‌డ‌లిపోతున్న స‌మ‌యాన దేవుడే మ‌నిషి రూపంలో క‌నిపించి వ‌రాలు ఇచ్చాడా అన్నంత స్థాయిలో బాధిత వ‌ర్గాల‌ను ఆదుకున్నాడు విల‌క్ష‌ణ న‌టుడు సోనూసూద్. ఎక్క‌డెక్క‌డో కూలీలు చిక్కుకుపోతే వారికి స్పెష‌ల్ ట్రైన్లూ, ఫ్లైట్లూ ఏర్పాటు చేసి మ‌రీ! స్వ‌స్థలాల‌కు చేర్చిన ఘ‌నత ఆయ‌న‌దే! క‌ష్టం అంటే చాలు ఆరోజు ఆయ‌న చ‌లించి పోయారు. క‌ష్టం అని తెలిస్తే చాలు ఆయ‌న ఆరోజు త‌న మ‌నుషులను పంపి మ‌రీ ప‌రిష్క‌రించారు.

ఓ విధంగా ఆయ‌న రియ‌ల్ హీరో. ఏ హీరో కూడా ఆయ‌న ద‌గ్గ‌ర స‌రిపోడు అన్నంత‌గా సేవా కార్య‌క్ర‌మాలతో త‌న‌దైన మాన‌వ‌తా దృక్ప‌థం చాటాడు. అలాంటిది ఆయ‌నపై కొన్ని పార్టీలు క‌క్ష క‌ట్టాయి. ఆయ‌న ఆఫీసుపై దాడులు చేయించాయి. అయినా కూడా సోనూ అద‌ర‌క బెద‌రక త‌న ప‌ని తాను చేసుకునిపోయాడు.

మ‌నిషి ఎలా ఉంటాడు అనేందుకు
నిఖార్సయిన మ‌నిషి ఎలా ఉంటాడు
అని చెప్పేందుకు చాటేందుకు
సోనూ భాయ్ ఓ ఉదాహ‌ర‌ణ అయ్యాడు


ఇప్పుడాయ‌నకు సంబంధించి దేశంలో ఓ సంచ‌ల‌న వార్త వెల్ల‌డిలో ఉంది. త్వ‌ర‌లోనే ఆయ‌న రాజ‌కీయాల్లోకి రానున్నారు అన్న వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ముఖ్యంగా ఆయ‌న రాక‌కు సంబంధించి ఇప్ప‌టికే ప్ర‌ధాన పార్టీల‌న్నీ త‌మ త‌మ ప‌రిధిలో ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ సోనూ మాత్రం ఏ విష‌య‌మూ పైకి చెప్ప‌డం లేదు. ప్ర‌స్తుతం తాను స‌మాజ సేవ మాత్ర‌మే చేస్తాన‌ని, రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ప్ర‌స‌క్తే లేద‌ని అంటున్నాడు.

– పొలిటిక‌ల్ స్పియ‌ర్ – మ‌నలోకం ప్ర‌త్యేకం

Read more RELATED
Recommended to you

Latest news