మాజీ సీఎం డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేపథ్యంలో యాత్ర చిత్రం రూపొందిన విషయం విదితమే. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా నటించిన ఈ సినిమాకి మహి వి.రాఘవ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. కానీ కమర్షియల్‌గా సత్తా చాటలేకపోయింది. దీనికి సీక్వెల్‌గా యాత్ర 2ను రూపొందించబోతున్నట్టు దర్శకుడు మహి వి.రాఘవ ఇటీవల ప్రకటించారు. వై.ఎస్.జగన్ ఏపీలో భారీ మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో యాత్ర 2 సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు రాఘవ తెలిపారు. ఈ సినిమాకి సంబంధించి ఒక్కొక్కటిగా హింట్స్ ఇస్తూ వస్తున్న రాఘవ తాజాగా సినిమా ఎలా ఉండబోతుందో అనేది క్లారిటీ ఇచ్చారు.
రాజశేఖర్ రెడ్డి జీవితం, ఆయన తండ్రి రాజారెడ్డి, కుమారుడు జగన్ లేకుండా సంపూర్ణం కాదంటూ యాత్ర 2 కథ ఎక్కడి నుంచి ప్రారంభించబోతున్నారో తెలిపారు. యాత్ర సినిమాను జగన్ మీద ముగించిన విషయం విదితమే. సీక్వెల్ తీయాలని భావించి అలా ముగించారని దర్శకుడు తెలిపారు. వైఎస్సార్ యాత్ర ఆయన తండ్రి రాజారెడ్డి సమాధి వద్ద నుండి మొదలైంది. అలాగే జగన్ యాత్ర కూడా ఆయన తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద నుండే ప్రారంభమైంది. తన తండ్రి వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను కలుసుకోవడానికి జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఈ ఓదార్పు యాత్ర నుంచే సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ భాగంలో పార్టీ పెట్టినప్పట్నుంచి ముఖ్యమంత్రి అయ్యేవరకు జగన్ రాజకీయ జీవితంలోని ఒడిదుడుకుల ప్రస్తావనలు ఉండనున్నాయట.
ఇంత వరకు బాగానే ఉంది. మరి యాత్ర 2లో వైఎస్ జగన్‌గా ఎవరు నటిస్తారనే సస్పెన్స్ నెలకొంది. వైఎస్ జగన్ పాత్రలో తమిళ నటుడు సూర్యని నటింప చేయాలనే ఆలోచనలో దర్శకుడు రాఘవ ఉన్నారట. వైఎస్ జగన్‌కి, సూర్యకి దగ్గరి పోలికలుంటాయి. పైగా వీరిద్దరు చాలా రోజులుగా మంచి స్నేహితులు. ఇరువురి కుటుంబాలకు మంచి అనుబంధం ఉంది. జగన్ గురించి సూర్యకి బాగా తెలుసు. దీంతో ఆ పాత్రలో నటించడం ఆయనకు ఈజీ అవుతుందని భావిస్తున్నారట. ఇదిలా ఉంటే జగన్ బయోపిక్‌లో నటించేందుకు సూర్య కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఆయన తాజాగా నటించిన ఎన్జీకే చిత్ర ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్‌కి వచ్చిన సూర్య ఈ విషయాన్ని వెల్లడించారు. నా వద్దకు స్ర్కిప్ట్ వస్తే, అది నచ్చితే నటించేందుకు నేను రెడీగానే ఉన్నా అని తెలిపారు. దీంతో యాత్ర 2కి హీరో విషయంలో చిత్రబృందానికి ఓ క్లారిటీ వచ్చేసింది. ఇక యూనిట్ సూర్యని కలవడమే ఆలస్యమని చెప్పొచ్చు. సూర్య నటించిన ఎన్జీకే ఈ శుక్రవారం విడుదలవుతుంది. దీంతోపాటు ఆయన కాప్పాన్, సూరారై పోట్రు చిత్రాల్లో నటిస్తున్నారు.