ఇటీవలే ఓ ఐపీఎస్ అధికారితో దురుసుగా ప్రవర్తించిందనే ఆరోపణలతో సినీ నటి డింపుల్ హయాతీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ జీ అనుపమా చక్రవర్తి .. డింపుల్ హయతి, న్యాయవాది విక్టర్ డేవిడ్ పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ మేరకు వారిద్దరికీ సీఆర్‌పీసీ 41ఏ సెక్షన్ కింద నోటీసులు జారీ చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
పిటిషనర్లపై అసత్య అభియోగాలు నమోదు చేశారని, పోలీసులు అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. ట్రాఫిక్ డీసీపీ ప్రోద్బలంతోనే ఆయన కారు డ్రైవర్ చేసిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని తెలిపారు. ఏపీపీ గణేశ్ వాదిస్తూ, నటి డిపుల్ హయతికి పోలీసులు 41ఎ నోటీసులు జారీ చేశారని చెప్పారు. కారును ధ్వంసం చేసినట్టుగా ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. వాదనల అనంతరం న్యాయమూర్తి పైఆదేశాలు జారీ చేశారు.