దిగ్గజ నటుడు కృష్ణంరాజు కన్నుమూయడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మృతికి గల కారణాన్ని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ప్రకటన విడుదల చేశాయి.
‘‘82 ఏళ్ల కృష్ణంరాజు మధుమేహం, పోస్ట్ కోవిడ్, తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ రావడంతో చనిపోయారు. గుండె కొట్టుకునే వేగంతో చాలా కాలంగా సమస్య ఉంది. రక్తప్రసరణ సరిగా లేకపోవడంతో గతేడాది ఆయన కాలికి శస్త్రచికిత్స జరిగింది. దీర్ఘకాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యతోనూ కృష్ణంరాజు బాధపడుతున్నారు. పోస్ట్ కోవిడ్ సమస్యతో గత నెల 5వ తేదీన ఆస్పత్రిలో చేరారు. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కారణంగా ఊపిరితిత్తుల్లో తీవ్ర న్యుమోనియా ఉన్నట్టు గుర్తించాం. కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించాం. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గమనిస్తూ తగిన చికిత్స అందించాం. ఆదివారం తెల్లవారుజామున 3.16గంటలకు తీవ్రమైన గుండెపోటు రావడంతో కృష్ణంరాజు కన్నుమూశారు’’ అని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
కృష్ణం రాజు మృతిపట్ల సినీ, రాజకీయ వర్గాలు విచారం వ్యక్తం చేశాయి. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత కృష్ణంరాజు పార్థివదేహాన్ని ఇంటికి తీసుకురానున్నారు. అనంతరం ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం అందుబాటులో ఉంచనున్నారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.