Tollywood Report: జులై ఫెయిల్​.. ఆశలన్నీ ఆగస్టుపైనే..

-

వేసవిలో సినిమా తర్వాత సినిమా అంటూ బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసిన బడా చిత్రాలన్నింటినీ ఎంచక్కా ఆస్వాదించాం. కానీ, జులై నెలలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రిలీజైనా ప్రతీ చిత్రం ఇటు ప్రేక్షకుడికి, అటు చిత్ర పరిశ్రమకు పడీకలను మిగిల్చింది. అన్నీ ప్లాఫ్​లు అయ్యాయి. ఓ సారి ఆ వివరాలను చూద్దాం..

‘పక్కా’ ఫెయిల్.. ​ గోపిచంద్‌ కథానాయకుడిగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన కోర్ట్‌రూమ్‌ యాక్షన్‌ డ్రామా ‘పక్కా కమర్షియల్‌’. రాశీఖన్నా కథానాయిక. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ ‘పక్కా’ఫెయిల్‌ అయిందనే చెప్పాలి. కథ, కథనాల్లో బలం లేకపోవడం, కామెడీ ఆర్టిఫిషియల్‌గా ఉండటం సినిమాకు ప్రధాన మైనస్‌.

‘హ్యాపీ’లేదు.. ఇక రెండో వారం వచ్చిన కొత్త సినిమా చూద్దామని థియేటర్‌కు వెళ్తే ప్రేక్షకులకు ‘హ్యాపీ’లేకుండా చేసింది ‘హ్యాపీబర్త్‌డే’. విభిన్న‌మైన క్రైమ్ కామెడీ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ‘మత్తు వదలరా’ ఈ మూవీకి దర్శకుడు. లావణ్య త్రిపాఠితో పాటు వెన్నెల కిషోర్‌, సత్య, నరేశ్‌ అగస్త్య తదితరులు నటించారు.

‘వామ్మో వారియర్​’.. లింగుస్వామి దర్శకత్వంలో రామ్‌ నటించిన ‘ది వారియర్‌’. పూర్తి మాస్‌ యాక్షన్‌ చిత్రంగా వచ్చిన ఈ సినిమా పెద్దగా మెప్పించలేకపోయింది. రామ్‌, ఆదిల నటన బాగున్నా, కథలో దమ్ములేకపోవడం బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది.

సారి చైతు.. యువ నటుడు నాగచైతన్య.. విక్రమ్‌ కుమార్ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం ‘థాంక్‌ యు’. జులై మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మెయిన్‌పాయింట్‌ బాగున్నా, భావోద్వేగ భరితంగా తెరకెక్కించడంలో విక్రమ్‌ తడబడ్డారు. మూడు వేరియేషన్స్‌ కోసం చైతు పడిన కష్టం తప్ప సినిమా చూసి ‘థాంక్‌ యూ’ చెప్పే ధైర్యం లేక, ‘సారీ చైతు’ అనాల్సి వచ్చింది.

స్టామినా సరిపోలే-ఆఫ్​ డ్యూటీ చేసిన రామారావు.. గత కొంతకాలంగా హిట్‌ లేకసతమతవుతున్న మాస్​మహారాజా రవితేజ.. ఈసారి ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శరత్‌ మండవ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియెన్స్‌ను మెప్పించ లేకపోయింది. కథ, కథనాలు, బలంలేని పాత్రల మధ్య రవితేజ మాస్‌ స్టామినా సరిపోలేదు. దీంతో ‘రామారావు ఆఫ్‌ డ్యూటీ’ చేయాల్సి వచ్చింది.

డబ్బింగ్‌ చిత్రాల పరిస్థితి అదే.. తెలుగు చిత్రాలతో పాటు పలు డబ్బింగ్‌ చిత్రాలు కూడా జులైలో థియేటర్లలో వచ్చాయి. ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌’ పాస్‌మార్క్‌లతో గట్టెక్కితే, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన రణబీర్‌కపూర్‌ ‘షంషేరా’ బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్​ అయింది. సిబిరాజ్‌ ‘మాయోన్‌’, సుదీప్‌’విక్రాంత్‌ రోణ’, సాయి పల్లవి ‘గార్గి’ యావరేజ్​ అయ్యాయి.

ఆశలన్నీ ఆగస్టుపైనే.. ‘బింబిసార’తో మొదలై, ‘సీతారామం’, ‘లాల్‌ సింగ్‌ చడ్డా’, ‘కోబ్రా’, ‘కార్తికేయ2’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘లైగర్‌’ ఇలా ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి ఇవి అలరిస్తాయో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news