మిస్ యూనివర్స్-2021గా నిలిచిన భారతీయ యువతి హర్నాజ్ సంధుపై కోర్టులో పిటిషన్ వేసింది ప్రముఖ నటి ఉపాసన. చండీగఢ్‌లోని జిల్లా కోర్టులో తన లాయర్ల ద్వారా ఈ చర్యలు తీసుకుంది. అసలు ఏమైందో తెలుసుకుందాం.
హర్నాజ్ సంధు నటించిన పంజాబీ చిత్రం ‘బై జీ కుట్టంగే’ ప్రమోషన్లలో పాల్గొనట్లేదని ఆమెపై ఫిర్యాదు చేసింది ఉపాసన. మిస్ యూనివర్స్ అయిన తర్వాత.. అసలు సినిమా గురించి పట్టించుకోవట్లేదని ఆరోపించింది. చిత్రీకరణకు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆమె ప్రమోషన్లలో పాల్గొనాలని, లేదా సినిమాకు మద్దతుగా నిలవాలని చెబుతున్న ఉపాసన.. ఆమె అలా చేయట్లేదని పేర్కొంది.
సినిమా షూటింగ్‌కు ముందు ఆమె సాధారణ యువతి అని.. మిస్ యూనివర్స్ అయ్యాక సినిమాను పూర్తిగా విస్మరించిందని ఉపాసన తన పిటిషన్లో ఆరోపించింది. హర్నాజ్ సంధు ప్రమోషన్స్‌లో పాల్గొనాలనే.. మేలో విడుదల చేయాల్సిన సినిమాను ఆగస్టుకు వాయిదా వేశామని.. అయినా ఫలితం లేదని చెప్పింది.
మిస్ యూనివర్స్ తన తొలి సినిమా పట్ల ఇలా నిర్లక్ష్యంగా ఉండటం ఏమాత్రం బాలేదని, పంజాబ్ సినీ రంగానికి ఇది సిగ్గుచేటుగా అభివర్ణించింది ఉపాసన సింగ్. బై జీ కుట్టంగే సినిమా ఈ ఆగస్టు 19న విడుదల కానుంది. దేవ్ కరౌడ్, నానక్ సింగ్, హర్నాజ్ సంధు, ఉపాసన సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. సంతోష్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్‌పై సినిమాను నిర్మించింది. స్మీప్ కాంగ్ దర్శకుడు.
గతేడాది ఇజ్రాయెల్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచింది భారత్‌కు చెందిన హర్నాజ్ సంధు. 80 దేశాల నుంచి ముద్దుగుమ్మలు పాల్గొనగా వారందరినీ వెనక్కినెట్టి.. మిస్ యూనివర్స్ కిరీటాన్ని ముద్దాడింది.
దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్‌కు ఈ టైటిల్ దక్కింది. చివరిసారిగా 2000లో లారా దత్తా మన దేశం తరఫున ఈ కిరీటం దక్కించుకుంది. హర్నాజ్ సంధు.. 2000 మార్చి 3న పంజాబ్‌లోని చండీగఢ్‌లో జన్మించింది. డిగ్రీ పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మాస్టర్స్ చదువుకుంటోంది.
ఓ వైపు అందాల పోటీల్లో పాల్గొంటూనే మరోవైపు చదువు కొనసాగిస్తోందీ 22 ఏళ్ల అమ్మడు. 17ఏళ్ల వయసులో మోడలింగ్ ప్రారంభించింది హర్నాజ్ సంధు.
హర్నాజ్ ఇప్పటివరకు 2017లో టైమ్స్ ఫ్రెష్ ఫేస్ మిస్ చండీగఢ్, 2018లో మిస్ మ్యాక్స్ ఎమర్జింగ్ స్టార్, 2019లో ఫెమినా మిస్ ఇండియా పంజాబ్, మిస్ దివా 2021, ఇప్పుడు 2021లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకుంది.