‘బిచ్చగాడు-2’ సినిమా షూట్‌లో విజయ్ ఆంటోనీ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదం నుంచి కోలుకున్న ఆయన ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ ఆంటోనీ ఈ సినిమా షూటింగ్లో జరిగిన బోటు ప్రమాదం గురించి మాట్లాడారు.
‘‘బిచ్చగాడు 2’లో కొన్ని సీన్స్ షూట్ కోసం మేమంతా మలేసియాలోని లంకావి ప్రాంతానికి వెళ్లాం. లవ్ సాంగ్ షూట్‌లో భాగంగా నేనూ కావ్య ఓ జెట్ స్కిపై ఉన్నాం. మిగిలిన బృందం మొత్తం మరో బోట్‌పై ఉండి మమ్మల్ని చిత్రీకరిస్తున్నారు. విజువల్స్ చక్కగా రావాలనే ఉద్దేశంతో నేను ఫుల్ స్పీడ్‌లో జెట్ స్కిని డ్రైవ్ చేస్తుండగా ఉన్నట్టుండి ప్రమాదం చోటుచేసుకుంది. నా ముఖానికి బోటు గట్టిగా తగిలింది. ముఖం మొత్తం గాయాలు, రక్తం, దవడ భాగం కిందకు జారింది. నా ముఖానికి తగిలిన గాయాలు కనిపించకుండా, దవడను సరిచేయడానికి సుమారు 9 ప్లేట్లు వేశారు. దవడ భాగంలో ప్లేట్లు వేయడంతో నా లుక్ కూడా చాలా మారింది.’’ అని విజయ్ తెలిపారు.