దేశ వ్యాప్తంగా అశేష అభిమానగణం కలిగిన యువ సూపర్‌స్టార్ , ఫిలింఫేర్ అవార్డు, నంది అవార్డు, సైమా అవార్డు సహా ఎన్నో అవార్డులు గెలుచకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు భారతదేశంలో అగ్రగామి ప్రొఫెషనల్ టీమ్‌లలో ఒకటైన హైదరాబాద్ బ్లాక్ హాక్స్ సహ యజమానిగా మారారు. తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్కటీమ్ హైదరాబాద్ బ్లాక్ హాక్స్. ‘అర్జున్ రెడ్డి’ మరియు ‘పెళ్లి చూపులు ’ వంటి చిత్రాలలో విభిన్నమైన పాత్రల ద్వారా ప్రాచుర్యం పొందిన శ్రీ విజయ్ దేవరకొండ , బ్లాక్ హాక్స్ టీమ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.
లీగ్ మ్యాచ్‌లకు ఆవల ప్రచారం చేయడంతో పాటుగా అంతర్జాతీయంగా వీక్షకుల ముందుకు విభిన్నంగా ఈ టీమ్‌ను ప్రదర్శించనున్నారు. ఈ మహోన్నత భాగస్వామ్యం గురించి శ్రీ దేవరకొండ మాట్లాడుతూ ‘‘ బ్లాక్ హాక్స్ మరో స్పోర్ట్స్ టీమ్ అని కాకుండా అంతకు మించినది. తెలుగు వారసత్వం సగర్వంగా ప్రదర్శించాలనుకునే మా అందరికీ ఇది గర్వ కారణం. తెలుగు ప్రజలకు ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది. అంతేకాదు, మన స్ఫూర్తి మరియు శక్తికి ప్రతీకగా నిలుస్తుంది. మా బ్రాండ్ మరియు టీమ్‌ను భారతదేశం మాత్రమే కాదు, ఇతర ప్రాంతాలకు సైతం తీసుకువెళ్లేందుకు చేయాల్సినంతగా నేను చేస్తాను’’ అని అన్నారు.