పవన్​కల్యాణ్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారంటే?

-

ఓ వైపు సినిమాల్లో నటిస్తూ మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​.. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందు జీవితంలో ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డారట. ఈ క్రమంలోనే పలు రంగాల్లోనూ పనిచేశారట. ఆ సంగతులు తెలుసుకుందాం.

పవన్‌ కల్యాణ్‌ ఈ పేరు టాలీవుడ్​లో ఓ సంచలనం. ఆయన క్రేజ్‌ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పేరు వింటే చాలు అభిమానులకు పూనకాలే. భారీ డైలాగ్‌లు చెప్పకపోయినా.. అదిరిపోయే డ్యాన్స్‌లు చేయకపోయినా.. కేవలం ఆయన కటౌట్‌ కనిపిస్తే చాలు ఫ్యాన్స్​ ఊగిపోతారు. థియేటర్లలో ఈలలు వేస్తూ, కేరింతలు కొడుతూ పండగ చేసుకుంటారు. అయితే తెరపై అంత హంగామా చేసే పవన్‌ తెర వెనక సాదాసీదాగా ఉంటారు. అందుకే సగటు సినీ అభిమానితోపాటు ప్రముఖులూ ఆయన్ను ఇష్టపడతారు. ఇదంతా ఓవర్‌నైట్‌లో జరిగిందేమీ కాదు. మరి, పవన్‌ ఎలాంటి స్థితి నుంచి ఇంతటి స్థాయికి వచ్చారు, ఆయన సినిమాల్లోకి రాకముందు పనిచేసిన రంగాలు ఏంటి వంటి విషయాలను తెలుసుకుందాం..

పవన్​కల్యాణ్​ ఎనిమిదో తరగతి నుంచీ పరీక్షల్లో తప్పేవారు. అలానే ఇంటర్‌ కూడా ఫెయిల్​ అయ్యారు. అయినా ఆయన్ను ఎవరూ ఏమీ అనేవారు కాదు. కానీ, ఆయనలో మాత్రం ఏదో అపరాధభావం వేధించేది. ‘స్నేహితులంతా జీవితంలో ముందుకెళ్లిపోతున్నారు. మనం మాత్రం ఉన్న చోటే ఉంటున్నాం. ఎందుకిలా అవుతోంది’ అన్న ఎప్పుడూ నిస్పృహలో ఉండేవారట. ఆ ఒత్తిడిలో ఆత్మహత్మకు కూడా ప్రయత్నించారు. కుటుంబ సభ్యులు చూడటం వల్ల బతికి బయటపడ్డారు. ఆ సమయంలో ఇద్దరు అన్నయ్యలు, సురేఖ వదిన అండగా నిలిచారు.

అలానే పవన్​కు అనేక రంగాల మీద పట్టు సాధించాలని ఉండేది. ప్రతి వృత్తిపైనా ఆసక్తి చూపేవారు. అలా ఆయన ఫిన్‌లాండ్‌లో చదువుకునే తన మిత్రుడు సెలవుల్లో పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తున్నాడని తెలియడంతో పవన్‌ కూడా అలానే చేయాలనుకున్నారు. అలా ఆయన ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌లో కొన్ని రోజులు, ఓ గిడ్డంగిలో రెండు రోజులు పనిచేశారు. అన్ని రంగాల మీద పట్టు సాధించాలనుకునే క్రమంలో.. పారా గ్లైడింగ్ నేర్చుకున్నారు. కర్ణాటక సంగీతంలో ప్రవేశం పొందారు. వయొలిన్‌ సాధన చేశారు. డిప్లొమా ఇన్‌ ఎలక్ట్రానిక్స్‌ కోర్సులో చేరారు. కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ గురించి కొంత తెలుసుకున్నారు. బొమ్మలు గీయాలని, విదేశీ భాషలు నేర్చుకునే ప్రయత్నం చేశారు. కానీ, ఎందులోనూ పట్టు సాధించలేకపోయారు. చివరికి పలు విషయాలపై దృష్టిపెట్టడం వల్ల అయోమయంలో పడ్డారు. ఆ తర్వాత అన్నయ్య మెగాస్టార్​ సలహాతో సినిమాల్లోకి అడుగుపెట్టారు.

కాగా, ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ అనే సినిమాతో 1996లో పవన్‌ కల్యాణ్‌ నటుడిగా మారారు. అందులో ఆయన ముళ్లపూడి కల్యాణ్ అనే పాత్ర పోషించారు. ఆ తర్వాత, ‘గోకులంలో సీత’, ‘సుస్వాగతం’, ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘ఖుషి’, ‘జల్సా’, ‘గబ్బర్‌ సింగ్‌’, ‘అత్తారింటికి దారేది’.. ఇలా విభిన్న కథలతో ఆయన నెలకొల్పిన రికార్డులు గురించి చెప్పేదేముంది. ఈ ఏడాది ‘భీమ్లా నాయక్’తో సందడి చేసిన ఆయన ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ అనే చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు, హరీశ్‌ శంకర్‌, సురేందర్‌ రెడ్డి, సుముద్రఖని దర్శకత్వంలో నటించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news