కార్తీకమాసం ప్రారంభమయింది. దీంతో మొదటి సోమవారం నుంచి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఏపీలోని విజయవాడ భ్రమరాంభమల్లేశ్వర స్వామి ఆలయం భక్తులతో నిండిపోయింది. తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తులు కృష్ణానదిలో స్నానాలాచరించి కార్తీక దీపాలు వెలిగించారు. మహాశివుడికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. దీపాల వెలుగులతో ఆలయం మరింత శోభను సంతరించుకుంది. బ్రమరాంభ మల్లేశ్వర స్వామి దర్శనానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గుంటూరు జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రం కోటప్ప కొండ భక్తులతో నిండిపోయింది. కార్తీకపూజల కోసం భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీపారాధన చేసి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి 30 వేల మంది వస్తారని అంచనా వేసిన అధికారులు అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశారు.