హనుమంతుడికి సంతానం ఉందా?

-

ఆంజనేయుడు.. హనుమంతుడు.. ఇలా ఏ పేరున పిలిచినా అందరికీ అభయహస్తం ఇచ్చి కాపాడే భక్తవశ్యుడు రామదాసుడు. అయితే హనుమంతుని ఆజన్మ బ్రహ్మచారిగా భక్తులు భావిస్తారు. కానీ ఆయనకే తెలియకుండా, హనుమంతునికి ఓ పుత్రుడు ఉన్నాడు. అ విషయాన్ని తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.. ఆ విశేషాలు తెలుసుకుందాం…

శ్రీరాముని దూతగా సీతను విడిపించమంటూ రావణాసురునికి నాలు0గు ముక్కలు చెప్పేందుకు లంకకు చేరుకుంటాడు హనుమంతుడు. రావణాసురుడు, హనుమంతుని మాటను లెక్కచేయకపోగా… అతని తోకను నిప్పంటించమని తన సైన్యానికి ఆదేశిస్తాడు. నిప్పంటుకున్న తన తోకతో ఏకంగా లంకనే ముట్టిస్తాడు హనుమంతుడు. కానీ లంక నుంచి తిరిగివెళ్తూ, ఆ వేడి నుంచి ఉపశమనం లభించేందుకు సముద్రంలో కొంత సేపు మునిగి ఉండేందుకు నిశ్చయించుకుంటాడు. హనుమంతుడు నీట మునగగానే అతని శరీరం నుంచి విడివడిన స్వేద బిందువు, ఓ జల కన్య నోటిలోకి ప్రవేశిస్తుంది. అదే ఆమె గర్భాన ఒక శిశువుగా మారుతుంది. ఇదేమీ గ్రహించని హనుమంతుడు తన దారిన తను వెళ్లిపోతాడు. కొన్నాళ్లకి పాతాళలోకాన్ని ఏలే మైరావణుడి భటుల వలలో జలకన్య చిక్కుతుంది.

మైరావణుడికి ఆహారంగా ఆ జలకన్యను మోసుకుపోతారు అతని భటులు. కానీ ఆమె పొట్టను కోసి చూసిన వారు ఆశ్చర్యంలో మునిగిపోతారు. జలకన్య గర్భాన శక్తిమంతమైన ఓ జీవి వారికి కనిపిస్తుంది. సగం కోతి రూపంలోనూ, మరో సగం మకరంగానూ ఉన్న ఆ జీవికి ‘మకరధ్వజురడు’ అని పేరు పెడతాడు మైరావణుడు. అంతేకాదు! అతని శక్తిని గమనించి తన రాజ్యానికి ద్వారపాలకునిగా కూడా నియమిస్తాడు.
రోజులు గడుస్తున్నాయి. రామరావణుల మధ్య రాయబారాలు బెడిసికొట్టడంతో యుద్ధం మొదలైంది. యుద్ధం జరుగుతున్న కొద్దీ రామలక్ష్మణులది పైచేయి కాసాగింది. దీంతో కంగారుపడిపోయిన రావణాసురుడు తన బంధువైన పాతాళాధిపతి మైరావణుడికి కబురు పంపాడు. ఎలాగైనా హనుమంతుని కన్నుగప్పి రామలక్ష్మణులను పాతాళానికి తీసుకుపోయి బంధించమంటూ అర్థించాడు.

రావణుడి కోరిక మేరకు మైరావణుడు మాయోపోయాలతో రామలక్ష్మణులను అపహరించి తన కోటలో బంధిస్తాడు. వారిరువురినీ బలి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటాడు. ఈలోగా రామలక్ష్మణుల జాడ తెలుసుకున్న హనుమంతుడు మైరావణపురానికి చేరుకుంటాడు. అక్కడ మకరధ్వజునితో హనుమంతుడు తలపడాల్సిన సందర్భం ఏర్పడుతుంది. మకరధ్వజుని బలపరాక్రమాలను చూసిన హనుమంతుడు నువ్వు ఎవరి కుమారుడవు అని అడుగుతాడు.

దానికి తాను హనుమంతుని కుమారుడినని చెప్పడంతో ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. ఆపై అతని జన్మవృత్తాంతాన్ని తెలుసుకుని సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతాడు. అటువైపు మకరధ్వజునికి కూడా తన తండ్రిని కలుసుకున్నానన్న సంతోషం నిలువనియ్యదు. కానీ తన ప్రభువైన మైరావణుడికి మోసం చేయలేననీ, ఆయన ఆజ్ఞను జవదాటలేనని తేల్చిచెబుతాడు మకరధ్వజుడు. తనను ఓడించిన తరువాతే కోట లోపలికి ప్రవేశించమని హనుమంతునితో సూచిస్తాడు. తన కుమారుని స్వామిభక్తికి అచ్చెరువొందుతూనే హనుమంతుడు అతనితో తలపడతాడు.

 

సుదీర్ఘకాలం సాగిన ఆ ద్వంద్వ యుద్ధంలో చివరికి హనుమంతుడు ఎలాగూ విజయం సాధిస్తాడు. ఆపై కోట లోపలికి ప్రవేశించి మైరావణుని సంహరించి రామలక్ష్మణులను విడిపిస్తాడు. హనుమంతుని నుంచి మకరధ్వజుని మాట విన్న రాములవారు, అతడిని పాతాళానికి అధిపతిగా నియమించి లంకకేగుతారు. అందండీ సంగతీ ఇంకా ఆంజనేయస్వామికి ఉన్న సంతానం గురించి మరోసారి తెలుసుకుందాం.
– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news