మన దేశంలో నిండా 5 సంవత్సరాలైనా నిండకుండానే 2, 3 ఏళ్ల వయస్సులోనే చిన్నారులను స్కూళ్లలో వేస్తున్నారు. కానీ ఫిన్‌లాండ్‌లో అలా కాదు. అక్కడ 7 సంవత్సరాలు దాటాకనే పిల్లలను స్కూల్స్‌లో చేర్పించాలి.
ప్రస్తుతం మన దేశంలో విద్యావ్యవస్థ ఎంత దారుణ స్థితిలో ఉందో అందరికీ తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరైన సదుపాయాలు ఉండవు. దీంతో ప్రైవేటు స్కూల్స్‌లో చేరుదామంటే ఫీజులు మోత మోగిస్తుంటాయి. ఈ క్రమంలో చదువుకునే పరిస్థితి కాక.. ప్రస్తుతం చదువుకొనుక్కునే పరిస్థితి నెలకొంది. అయితే నిజానికి విద్యారంగం విషయానికి వస్తే ఏ దేశమైనా ఫిన్‌లాండ్ దేశాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ విద్యారంగం ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. మరి అందులో ఉన్న విశిష్టతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
మన దేశంలో నిండా 5 సంవత్సరాలైనా నిండకుండానే 2, 3 ఏళ్ల వయస్సులోనే చిన్నారులను స్కూళ్లలో వేస్తున్నారు. కానీ ఫిన్‌లాండ్‌లో అలా కాదు. అక్కడ 7 సంవత్సరాలు దాటాకనే పిల్లలను స్కూల్స్‌లో చేర్పించాలి. ఇక అక్కడ ప్రైవేటు స్కూళ్లు ఉండవు. స్కూళ్లన్నీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడుస్తాయి. అయితే విద్యార్థులు సగం కాలాన్ని స్కూల్‌లోనూ, సగం కాలాన్ని సెలవుల్లోనూ గడుపుతారు. అలాగే స్కూల్ టైమింగ్స్ కూడా తక్కువగానే ఉంటాయి. విద్యార్థులను హోం వర్క్ పేరిట రాచి రంపాన పెట్టడం ఉండదు. విద్యతోపాటు సంగీతం, ఆర్ట్స్, స్పోర్ట్స్‌కు కూడా సమాన ప్రాధాన్యతను ఇస్తారు.
ఫిన్‌లాండ్‌లో స్కూళ్లలో విద్యార్థులకు కావల్సిన అన్ని సదుపాయాలు ఉంటాయి. ఉదాహరణకు విద్యార్థులకు విశ్రాంతి కావలిస్తే నిద్రించేందుకు స్కూళ్లలోనే విశ్రాంతి గదులు ఉంటాయి. ఇక 13వ సంవత్సరం వచ్చే వరకు విద్యార్థులకు చదువుకు సంబంధించి గ్రేడ్లు, ప్రోగ్రస్ రిపోర్టులను ఇవ్వరు. పేరెంట్స్ కావాలనుకుంటే అప్లికేషన్ పెట్టుకుని ప్రోగ్రెస్ రిపోర్టు తీసుకోవచ్చు. దీంతో విద్యార్థుల మధ్య పోటీ పడి చదవాలనే ఒత్తిడి తగ్గుతుంది. వారు ఏ విషయాన్నయినా స్వేచ్ఛగా నేర్చుకోగలుగుతారు.
మన దేశంలో స్కూళ్లలా ఫిన్‌లాండ్‌లో విద్యార్థులకు హోం వర్క్ గట్రా ఇవ్వరు. ఇక అక్కడ ప్రతి స్కూల్‌లోనూ ఒక డాక్టర్ ఉంటాడు. అతను అక్కడే నివాసం ఉంటాడు. విద్యార్థుల ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తుంటాడు. అలాగే ఒక్కో స్కూల్‌లో 600కు మించి విద్యార్థులను ఉంచరు. ఈ క్రమంలోనే అక్కడి చిన్నారులందరూ 99 శాతం ప్రాథమిక విద్యను కచ్చితంగా అభ్యసిస్తారు. కాగా ఐక్యరాజ్య సమితి చేసిన సర్వే ప్రకారం ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే ఫిన్‌లాండ్‌లో ఉండే విద్యార్థులే ఎక్కువ సంతోషంగా ఉన్నారని వెల్లడైంది.
ఫిన్‌లాండ్‌లో చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం టీచర్లకు అక్కడి ప్రభుత్వం కఠిన నియమాలను అమలు చేస్తోంది. అక్కడ టీచర్ ఉద్యోగం చేయడం అంటే.. మన దేశంలో అది ఐఏఎస్, ఐపీఎస్‌తో సమానం. అంతటి కఠినంగా అక్కడి చట్టాలుంటాయి. మన దేశంలో మాదిరిగా మంచినీళ్లు తాగినట్లు అక్కడ టీచర్ కాలేరు. అందుకు చాలా కష్టపడాలి. విద్యలో బాగా రాణించే వారికే టీచర్ అయ్యేందుకు ఎక్కువగా అవకాశం కల్పిస్తారు. అక్కడ టీచర్ కావాలంటే.. 5 సంవత్సరాలు టీచర్ కోర్సులో కచ్చితంగా శిక్షణ తీసుకోవాలి. తరువాత 6 నెలలు ఆర్మీలో పనిచేయాలి. మళ్లీ ఒక సంవత్సరం ఏదైనా ఒక స్కూల్‌లో ట్రైనీగా పనిచేయాలి. ఆ తరువాతే సర్టిఫికెట్ ఇస్తారు. దాంతో అలాంటి అభ్యర్థులు టీచర్లు అవుతారు. అంతటి కఠినమైన నిబంధనలను అమలు చేస్తుంది కాబట్టే ఇప్పుడు ఫిన్‌లాండ్ విద్యారంగంలో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. మరి మన దేశంలో అలాంటి వ్యవస్థ ఎప్పుడు వస్తుందో చూడాలి..!