భారతీయ సనాతన ధర్మం చాలా విశిష్టమైనది. అత్యంత సూక్ష్మంగా కాలగణన చేసిన మన పూర్వీకులు ప్రతి ఏడాదిని రెండు భాగాలుగా విభజించారు. అవి ఒకటి ఉత్తరాయణం, రెండు దక్షిణాయనం. అదేవిధంగా సంవత్సరాన్ని 12 నెలలుగా విభజించారు. వీటిలో ఆరునెలలు ఉత్తరాయణం, ఆరునెలలు దక్షిణాయనం. రెండూ పవిత్రమైనవే. ఒక్కో ఆయనం ఒక్కోదానికి ప్రత్యేకం. ఇక ప్రతి మాసాన్ని రెండు భాగాలుగా అంటే శుక్లపక్షం, కృష్ణపక్షంగా విభజించారు. ప్రతినెల సూర్యపరమైన సంక్రమణలు, చంద్రపరమైన శివరాత్రులు వస్తాయి. అయితే మకరరాశిలో వచ్చే సంక్రాతిని మకరసంక్రాంతిగా జరుపుకొంటారు. ఇది ఉత్తరాయణంలో వస్తుంది. అదేవిధంగా దక్షణాయణంలో కర్కాటక సంక్రాంతిని జరుపుకుంటారు. కానీ దీనికి అంత ప్రాముఖ్యత రాలేదు. ఇక చంద్రపరమైన విషయాలను పరిశీలిస్తే.. ప్రతినెల అమావాస్య ముందు అంటే కృష్ణపక్షంలో రాత్రిపూట అంటే రాత్రి 12 గంటల సమయానికి చతుర్దశి ఉన్నరోజునే శివరాత్రి అని నెలనెల వస్తాయి కాబట్టి మాస శివరాత్రిగా నిర్వహించుకుంటాం. పన్నెండు మాస శివరాత్రులలో 11వదైన మాఘమాస శివరాత్రిని మహా శివరాత్రిగా ఉత్సవంగా జరుపుకొంటాం. ప్రతినెల మాస శివరాత్రినాడు శివాభిషేకం, ఉపవాసం, శివపూజ చేసుకుంటే విశేషం. కానీ అందరికీ నెలనెల సాధ్యం కాదు. కాబట్టి సామాన్యులందరికీ జన్మకో శివరాత్రి అన్నట్లు మహాశివరాత్రి అత్యంత పరమ పవిత్రమైనదిగా శాస్ర్తాలు ప్రవచించాయి.
సూర్యచంద్రలే ఎందుకు- సూర్య పరంగా సంక్రమణం, చంద్ర పరంగా శివరాత్రులను ఎందుకు చెప్తారు. అని లోతైన శాస్త్ర పరిశోధన చేస్తే సకలచరాచర జగత్తుకు ప్రత్యక్ష దైవాలు సూర్యచంద్రులు. సూర్యుడు ద్వారా సకల జీవరాశులు అన్నాన్ని పొందుతున్నాయి. అదేవిధంగా ఓషధాలను సోముడు అంటే చంద్రుడు ఇస్తాడని శాస్త్రం చెప్తుంది. రాత్రిపూట కాచే వెన్నల ఆయా జీవరాశికి ఓషధగుణాలను అందిస్తుందనేది సత్యం. కాబట్టి వీరిరువురును ప్రామాణికంగా తీసుకుని మాసాలను, పండుగలను నిర్ణయించడం జరిగింది.
మహాశివరాత్రి
11వ మాసశివరాత్రిని మహాశివరాత్రి అని చెప్పుకున్నాం. 11 అనేది ఏకాదశ రుద్రులకు ప్రతీక. అంతేకాకుండా 11 ఇంద్రియాలు అంటే ఐదు జ్ఞానేంద్రియాలు. ఐదు కర్మేంద్రియాలు (చేతులు, కాళ్లు మొదలైనవి), వీటన్నింటికి నాయకుడైన అంతఃకరణాన్ని పదకొండవ ఇంద్రియంగా చెప్తారు. పది ఇంద్రియాలు బయటకు కన్పిస్తాయి. పదకొండవ ఇంద్రియం బయటకు కన్పించదు. ఇది చేసే పనులు మాత్రం నాలుగు పేర్లతో చెప్పుకుంటాం.అవి… మనస్సు, బుద్ధి, అంహకారం, చిత్తం. శివుడు రుద్రుడిగా ఉన్నప్పుడు అంహకారంగా వ్యవహరిస్తారు. అతడే సోముడు అయినప్పుడు మనస్సు అవుతాడు. ఇక కృష్ణపక్షంలోని రాత్రులకు వరుసగా మొదటిది సుతా, రెండు సున్వతీ,ప్రసుతా, సూయమాన, అభిషూయమాణా, పీతి,ప్రపా, సంపా, తృప్తిః, తర్పయన్తీ, కాన్తా, కామ్యా, కామజాతా, 14వది ఆయుష్మతీ, 15వది కామదుఘా అని పేర్లు. వీటిలో చతుర్దశికి ఆయుష్మతీ అని పేరు. అంటే జీవనాన్ని భద్రపరిచేది. అదేవిధంగా ప్రతినెలకు ఒక పేరు ఉంది. వీటిప్రకారం మాఘమాసానికి సర్వౌషధః అని పేరు. మాఘమాసం, చతుర్దశి రెండింటి శాస్త్రనామాలను కలిపితే శివరాత్రి పేరు సర్వౌషధమూ, ఆయుష్మతీ అవుతుంది.
అంటే సకల జీవరాశులకు జీవనాన్ని పోషిస్తూ ఆయుష్షును ఇస్తున్న పర్వదినం అని చెప్పుకోవచ్చు.
నేటి సైన్స్‌కు అందని ఎన్నో రహస్యాలను మన పూర్వీకులు పలురకాలుగా మనకు అందించారు. అయితే వాటిలో కొన్ని మధ్యమధ్యలో వచ్చి చేరి మూఢనమ్మకాలుగా ప్రబలాయి. కానీ అసలు ప్రతి పండుగ, కాలవిభజన వాటి ప్రాశస్త్యాలను మనం లోతుగా పరిశీలిస్తే చాలా విషయాలు తెలుస్తాయి. కేవలం ప్రకృతిని పరిశీలిస్తూ.. పెద్దలమాటను సద్దిమూటగా తీసుకెళ్తే భవిష్యత్తులోనైనా ఎవరో ఒకరు శాస్ర్తాలను నిరూపిస్తారు. ఓం నమఃశివాయ!!!
– కేశవ