నవరాత్రులు.. శక్తిస్వరూపిణిని పూజించే పరమ పవిత్రమైన రోజులు ఈ శరన్నవరాత్రులు. వీటిలో మొదటి మూడురోజులు కాళీ, తర్వాతి మూడురోజులు లక్ష్మీ, తర్వాత మూడురోజులు సరస్వతీ ప్రతీకలుగా భావించి ఆరాధిస్తారు. ఆరో రోజు అమ్మవారిని కాత్యాయిని అవతారంగా భావిస్తారు. అమ్మకు ఇష్టమైన రంగు కాషాయం. కాత్యాయని ధైర్యానికి ప్రతీక. ఆమె కటా అనే రుషి కుమార్తె. అందుకే ఆమెకు కాటాయాని అని పేరు పెట్టారు.
అలంకారం: నవరాత్రుల్లో అమ్మను కాత్యాయినీగా ఆరాధించినా అలంకారం మాత్రం శుక్రవారం కావడంతో క్ష్మీగా అలంకరిస్తారు. ధనలక్ష్మీగా కొన్ని చోట్ల విశేష అలంకారాన్ని చేస్తారు. ఈ తల్లి రెండు చేతులలో మాలలను ధరించి, అభయ, వరద, హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమహాలక్షీరూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మీ సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని. అష్టలక్ష్మిల సమష్టి రూపమే మహాలక్ష్మీ. డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది. శక్తి త్రయంలో మధ్య శక్తి. మహాలక్ష్మీని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి.
“యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవలలోనూ ఉండే లక్ష్మీస్వరూపం దుర్గాదేవి అని చండీ సప్తశతి చెబుతుంది.
ఈ శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ, మాంగల్యాలు కలుగుతాయి.
నైవేద్యం: కేసరిని నివేదిస్తారు. ఇది వీలుకాకుంటే ఏదైనా తియ్యని పదార్థం అమ్మవారికి సమర్పించవచ్చు.
– కేశవ