ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నతస్థానానికి ఎదగాలంటే మామూలు విషయం కాదు. ప్రతి పనిలో అంతర్గత, బాహ్య శత్రువులు సహజం. గ్రహచారపరంగా, శారీరకంగా, మానసికంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. అవే మన అంతః శత్రువులుగా పరిగణిస్తారు. ఉదాహరణకు ఒక పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేవారికి బద్దకం ఒక శత్రువు. నిద్ర మరొక శత్రువు. ఇలా రకరకాల శత్రువులు ఉంటారు. ఇక బాహ్యంలో చూస్తే ఆయా రంగాలలో పోటీదారులు విపరీత ధోరణిలతో శత్రువులుగా వ్యవహరిస్తుంటారు. ఇలా జీవితంలో రకరకాల శత్రుబాధలు ఉంటాయి. వీటన్నింటిని అధిగమించి ముందుకు పోవాలంటే మానవ ప్రయత్నంతోపాటు దైవబలం అవసరం. కలియుగంలో శ్రీఘ్రంగా శక్తి పొందాలంటే అమ్మవారిని ఆశ్రయించాల్సిందే.
దశ మహావిద్యల్లో అష్టమ విద్యగా ప్రసిద్ధి చెందిన బగళాదేవి శత్రుసంహారిణిగా పేరుగాంచింది. ఈ తల్లిని బ్రహ్మాస్త్ర ధారిణిగా, స్తంభన దేవతగా పిలుస్తారు. ఈ దేవతను ఉత్తరాదిలో విశేషంగా పూజిస్తారు. ఈ దేవిని పూజించడం వల్ల మనలోని అంతఃశత్రువులతోపాటు, బాహ్య శత్రు బాధ తొలుగుతుంది. పీతాంబరదేవీగా పిలిచే ఈ దేవతను భక్తి, శ్రద్ధలతో పూజిస్తే చాలు శ్రీఘ్రంగా అమ్మ అనుగ్రహిస్తుంది. బగళాముఖీ దేవి మంత్రాన్ని గురువుద్వారా ఉపదేశం తీసుకుని జపించాలి. అది వీలుకాని వారు అమ్మవారిని భక్తితో అమ్మా బగళా అని ఆర్తితో మనస్సులో నిత్యం ధ్యానించినా తప్పక మంచి జరుగుతుంది. అమ్మవారి ఫొటో ముందు పసుపుతో నామాన్ని జపిస్తూ అర్చించాలి.
ఇటీవల సీఎం నిర్వహించిన చండీయాగంలో బగళాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. శత్రు సంహారం అంటే శత్రువులుగా మనం/మనల్ని చూస్తున్నవారిలో ఆ భావనలు పోయి ప్రేమపూరిత వాతావరణం ఏర్పడుతుంది. స్నేహవాతావరణంలో పనులు పూర్తవుతాయి. విజయం లభిస్తుంది.
ఓం శ్రీ బగళాదేవ్యేనమః!
-కేశవ