వసంత పంచమి.. చదువుల త‌ల్లి అనుగ్రహానికి అద్భుతమైన రోజు

-

ఫిబ్ర‌వ‌రి 10, 2019 ఆదివారం వ‌సంత పంచ‌మి సంద‌ర్భంగా మ‌న‌లోకం పాఠ‌కుల కోసం…

Vasantha panchami is a wonderful day to get blessings of saraswathi ammavaru
శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి
వాసరా పీఠ నిలయే సరస్వతి నమోస్తుతే
ప్రపంచాన్ని శాసించేది జ్ఞానం. ఆ జ్ఞానానికి అధిష్టాన దేవత సరస్వతి దేవీ. ఆ తల్లి పుట్టిన శుభదినాన్నే వసంత పంచమి అని శ్రీపంచమి అని పిలుస్తారు. ఈరోజు ఎలాంటి ముహుర్తాలు చూడకుండానే అక్షరాభ్యాసాలు చేసుకోవచ్చు. ఆదిపరాశక్తి అంశంలో మొదటి అవతారంగా సరస్వతిదేవీగా అభివర్ణిస్తారు. ఈ తల్లి శంభ, నిశంభులని సంహరించడానికి అవతరిస్తుంది. శంభ అంటే చెడు ఆలోచనలను కలిగించేవాడు, నిశంభుడు అంటే జ్ఞాపకశక్తిని పొగొట్టేవాడు. అంటే చెడు, మతిమరుపును పోగొట్టి జ్ఞానాన్ని అందించే శ్వేతవస్త్రధారిణి అమ్మ. ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించి అమ్మవారి దేవాలయం లేదా ఇంట్లోనైనా అమ్మవారి విగ్రహం లేదా ఫొటో (అమ్మగా భావించాలి)కు పూజ చేసుకోవాలి. తెల్లని వస్ర్తాలు ధరించి పూజిస్తే మరీ మంచిది. తెల్లని పూలు, తెల్లని వత్తుల దీపారాధన, పాయసం, తెల్లని పేలాలు, పాలు, పెరుగు వంటి పదార్థాలతో అమ్మవారికి పూజచేయాలి. అమ్మవారి పూజలో పెన్నులు, నోట్‌బుక్‌లు, రైటింగ్ ప్యాడ్, కంపాక్స్‌లు తదితర వస్తువులను అమ్మవారి ముందు ఉంచి పూజించి పాఠశాలలో, ఇంటి పక్కన, తెలిసిన పిల్లలకు బహుమతిగా ఇవ్వండి. అమ్మ కటాక్షం కలుగుతుంది.

– పిల్లలు, పెద్దలు అందరూ అమ్మవారికి పూజ చేయాలి. చదువు అంటే కేవలం పిల్లలకే కాదు శతాధిక వఋద్ధులకు అవసరమే. వేదశాస్త్ర ప్రకారం తల్లి, తండ్రి, గురు, దేవ రుణంతోపాటు రుషి రుణం తీర్చుకోవాలి. రుషి రుణం అంటే వేదవిజ్ఞానం. ప్రతిరోజు ఏదో ఒక శ్లోకం, పురాణంలో ఒక పేజీ, భగవద్గీత, భాగవతం వంటి ఏదో ఒకదాన్ని చదవాలి. అర్థం చేసుకోవాలి. ఆచరించాలి. అంటే జ్ఞానసముపార్జన చేయాలి. దీనివల్ల రుషి రుణం తీరడమే కాకుండా జీవన్ముక్తి లభిస్తుంది. వీటన్నింటిని ప్రసాదించే తల్లి సరస్వతీ దేవీ. అమ్మవారి ద్వాదశనామాలను ప్రతిరోజు ఒక్కసారి చదువుకుంటే చదువు, జ్ఞానం పెరుగుతుంది. మంచి ఆలోచనలు వస్తాయి.

– పిల్లలు నుదిటిపైన (కనుబొమ్మల మధ్య కాదు, కొంచెం పైన) కుంకుమ ధరిస్తే అమ్మ కటాక్షం లభిస్తుంది.

– సరస్వతి దేవి హంసిక వాహిని అంటే ఆడ హంస వాహన ధారియై లోకసంచారం చేస్తుంది. బ్రహ్మ మగ హంసను వాహనంగా కలిగి ఉన్నారు.

శ్రీపంచమి నాడు ఏం చేయాలి?

పిల్లలు, పెద్దలు చదువుల తల్లిని అత్యంత భక్తి శ్రద్ధతో పూజించాలి.

అక్షరాభ్యాసం చేయించుకునేవారు ఓం నమఃశివాయనమః అని పలక మీద రాసి అక్షరాభ్యాసం చేయాలి. ఎందుకంటే భాషకు వ్యాకరణం ఇచ్చినది పరమశివుడు. కాబట్టి శివనామంతో అక్షరాన్ని ప్రారంభించాలి.

– సంప్రదాయ దుస్తులతో ముఖ్యంగా తెల్లని రంగు వస్ర్తాలతో అమ్మవారి దగ్గర అక్షరాభాస్యం చేసుకుంటే చాలు అమ్మ పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది.

పిల్లలతో ఓం నమో సరస్వత్యేనమః అని నామాన్ని లేదా శారదాదేవ్యైనమః అని పారాయణాన్ని చేయించండి విశేష ఫలితం ఉంటుంది.

నోట్- పుణ్యక్షేత్రాలైన బాసర, వర్గల్ వంటి దగ్గర అక్షరాభ్యాసం మంచిదే. కానీ అందరికీ అది సాధ్యం కాదు. కాబట్టి ఎవరి స్తోమతను, అవకాశాలను బట్టి దగ్గర్లోని ఏ దేవాలయమైనా పర్వాలేదు, ఉదయాన్నే వెళ్లి అక్షరాభ్యాసం చేయించండి. ఇప్పటికే చదువుతున్నవారు అమ్మవారినామాలతో ఆయా దేవాలయాల్లో మూర్తులను ఆరాధించండి తప్పక విశేష ఫలితాలు వస్తాయి. ఆంజనేయస్వామి, శివ, వేంకటేశ్వర, అమ్మవారు ఇలా ఏ దేవడు/దేవత అయినా పర్వాలేదు. శారదామాత/సరస్వతి దేవిగా భావించి ఆరాధించండి. అమ్మ అనుగ్రహం కలుగుతుంది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news