గణపతి.. గణాలకు అధినాయకుడు. వినాయకుడు అని పిలుస్తాం. అసలు వినాయకుడిని ఎందుకు పూజిస్తారు అంటే విఘ్నాలు పోవడానికి. ఇది నిజమేనా అనే సందేహం చాలామందికి వస్తుంది. దీనివెనుక మర్మం తెలుసుకుందాం…
విశేషంగా (ఎన్నడూ ముడిపడని రీతిలో), ఘ్న- పనిని ప్రారంభించిన వ్యక్తి శారీరక మానసిక ధైర్యాలని నాశనం చేసేది (విశేషేణ కార్యసామర్థ్యం హంతీతి విఘ్నః) అని విఘ్న పదానికి అర్థం. మనం పూర్వజన్మల్లో చేసుకున్న పాపాల కారణంగా రావలసిన విఘ్నాలేమేమి వున్నాయో వాటన్నింటినీ తొలగించగల శక్తి ఏ భగవంతుడికీ లేదు. అలాగే తొలగింపజేయగలిగిన వాళ్లయితే ప్రతివాళ్లూ నిత్యం పూజా పురస్కారాల్లో మునిగి అసలు విఘ్నాలే రాకుండా చేసేసుకునేవాళ్లు. అప్పుడు తాము లోగడ చేసిన పాపాలకి శిక్ష అనేది లేకుండానే పోయేది కూడా. ఇది లోక రక్షణ వ్యవస్థకి విరుద్ధం.
మరి వినాయకుడేం చేస్తాడంటే, ఆయన్ని ప్రార్థించిన పక్షంలో సర్వవిఘ్న ఉపశాంతయే… రావలసిన విఘ్నాలంటూ మనకేం ఉన్నాయో, ఆ విఘ్నాలు మనకి సంప్రాప్తించిన వేళ మానసిక ఉపశాంతిని ఇచ్చి జీవితం మీద విరక్తి రానీయకుండానూ, కొత్తధైర్యంతో ముందుకి అడుగు వేసేలానూ చేస్తాడన్నమాట. అంటే విఘ్నమనేది కాలానికి సంబంధించింది కాబట్టి, ప్రతి వ్యక్తికీ ఒక్కొక్క కాలంలో జీవితదశలో వచ్చేది కాబట్టి ఆ కాలాన్ని తన అధీనంలో ఉంచుకున్న విఘ్ననాయకుణ్ణి ప్రార్థించి విఘ్నాలనుండి దూరం కావలసింది గానూ, ఒకవేళ విఘ్నమే తప్పనిసరై వస్తే తట్టుకోగలిగిన మానసిక స్థైర్యాన్ని ఈయనని ప్రార్థించడం ద్వారా పొందవలసిందిగానూ ఈ పండుగ మనకి చెప్తుంది. ఇక ఆలస్యమెందుకు భక్తితో వినాయ ఆరాధన చేసి జీవితంలో వచ్చే ఆటుపోట్లను తట్టుకోని ముందుకుసాగండి. జై వినాయక!!
పాలవెల్లి ఎందుకు..?
వినాయకుడి ప్రత్యేకతల గురించి తెలుసుకుంటున్నాం. వినాయక వ్రతం అంటే అదేనండి వినాయకచవితి నాడు అర్చించే సమయంలో వినాయకుడికి పాలవెల్లి కడుతారు. పాలవెల్లి అంటే వినాయకుని పైభాగంలో చతురస్రాకారంలో ఒక జల్లెడలాంటి అలంకారాన్ని వెదురుబద్దలతో ఏర్పాటు చేసి, వెలగ, బత్తాయి వంటి ఫలాలూ, కూరగా యలూ వేలాడదీస్తారు. దీనిలో పరమార్థం తెలుసుకుందాం… జ్యోతిస్సు అంటే గ్రహాలూ నక్షత్రాలూ. ఆ జ్యోతిస్సు ఆధారంగా ఏర్పడిన శాస్త్రమే జ్యోతిశ్శాస్త్రం. ఈ గ్రహాలూ నక్షత్రాలూ అన్నీ ఆకాశంలోనే ఉంటాయి కాబట్టే వినాయక చవితినాడు ఈ రహస్యాన్ని విశదీకరించేందుకే పాలవెల్లి. మనం ఉన్న ఈ భూమి పాలపుంత లేదా పాలవెల్లి అనే గెలాక్సీలోనే ఉందండి.
– కేశవ