ఆ రోజు రాత్రి నర్తనశాలలో జరిగిందిదే !

-

పాండవులు అరణ్యవాసం పూర్తిచేసుకున్నారు. అనంతరం ఏడాది అజ్ఞాతవాసం కోసం విరాట రాజు కొలువులో మారు వేషాలలో పనిలో చేరారు. విరాట రాజు భార్య సుదేష్ణదేవి దగ్గర దాసిగా దౌప్రతి సైరంథ్రీ పేరుతో పనిలో చేరింది. ఇలా ఉండగా సుదేష్ణదేవి తమ్ముడు, విరాట రాజు బావమరిది కీచకుడు సైరంథ్రీ అందానికి వశుడై ఆమెను ఎలానైనా అనుభవించాలని తలంచాడు. ఒకనాడు అంతఃపురం గాఢనిద్రలో ఉంది. చీకటి, నిశ్శబ్దం పెనవేసుకుపోయి వున్నాయి. సైరంథ్రీగా మారువేషంలో ఉన్న ద్రౌపది వొక్కసారి తుళ్లిపడి లేచింది. స్నానం చేసి, మంచి వస్ర్తాలు అలంకరించుకుని పాకశాల వైపు నడిచింది. వంటపాత్రలతో సువిశాల శాల కిటకిటలాడుతోంది. పాక శేషాలు కమ్మని వాసనలు వెదజల్లుతున్నాయి. వాటి మధ్యన కొండవలె కటిక నేలపై ఆదమరచి నిద్రిస్తున్న భీమసేనుడు కనిపించాడు. ద్రౌపది భర్తను సమీపించి, నాథా! యింత చేసిన ఈ కీచకుడు నిర్భయంగా తన మందిరానికి వెళ్లి, గుండెలపై చేయి వేసుకుని నిద్రపోతున్నాడు.

నువ్వు కటిక నేలపై హాయిగా గురకలు పెడుతున్నావు. కంటికి నిదురరానిది నాకేనన్నమాట. కట్టుకున్న యిల్లాలికి నడివీధిన అంతటి అవమానం జరుగుతుండగా చూశావు కదా. అయినా, యింత సుఖంగా నిద్రిస్తున్నావంటే… అది నీ చేతకానితనం అనుకోవాలా? లేక అగ్రజుని ఆదేశానికి కట్టుబడి వున్నావా? లేక నాపై వైముఖ్యమా? అనగా విని, నీ రాకను యెవ్వరూ గమనించలేదు కదా అని ఆత్రుతగా ప్రశ్నించాడు భీమసేనుడు.లేదన్నట్టు తలవూపింది ద్రౌపది. ఆమె కళ్లవెంట అశ్రుధారలు జారుతున్నాయి. వలలుడు ఆమెను దగ్గరగా తీసుకుని వూరడించాడు. తన భర్తల పరాక్రమాన్ని, యీ దుస్థితిని తలచుకుని రోదించింది. భీముని వక్షస్థలం ద్రౌపది కన్నీళ్లతో అభిషిక్తమైంది. సాధ్వీ, ఎంతటివారికైనా కాలం కలిసిరానపడు కష్టాలు తప్పవు. గడచిన కాలంలో ఎందరో నీవంటి మహాసాధ్వులు ఎన్నో హింసలు వోర్చారు. సీత, దమయంతి, … యిలా ఎందరో విపత్తులనెదుర్కొని తరువాత సకల సుఖాలు అనుభవించలేదా? పాంచాలీ, మన అజ్ఞాతవాస దీక్ష పూర్తికావడానికి ఎక్కువ రోజులు వ్యవధి లేదు. మన కష్టాలు గట్టెక్కడానికి ఆట్టేరోజులు నిరీక్షించాల్సిన పనిలేదు. కీచకుని సంహరించడం నాకు పెద్దపనికాదు.

నువ్వు సింహబలుని కోరికను అంగీకరించినట్టు నటించి, వాడిని మచ్చిక చేసుకో. తదుపరి నర్తనశాలను సంకేత స్థలంగా నిర్ణయించి, నిశిరాత్రివేళ ఒంటరిగా అక్కడికి రమ్మను. అర్ధరాత్రి అక్కడకు వచ్చిన సింహబలుని చీకటిలోనే మట్టుపెట్టి నీ పగను చల్లారుస్తాను. అజ్ఞాతవాసంలో వున్న మనకు యింతకంటె మరొక మార్గం తోచడం లేదు- అంటూ ఆమె కన్నీరు తుడిచాడు. భీముని మాటలకు ఆమె ముఖం విప్పారింది. మన పథకాన్ని అత్యంత జాగరూకతలో నడిపించాలి. అదుగో, తెలవారడానికి ఆట్టే పొద్దులేదు. నువ్వింక బయలుదేరి వెళ్లు అంటూ మాలినిని కొంతదూరం సాగనంపాడు వలలుడు. తెల్లవారింది. సింహబలుడు సముచిత ప్రాతఃకాల విధులు ముగించాడు. ఏరికోరి, ఎంపిక చేసిన వస్త్రధారణ చేశాడు. విలువైన విభూషణాలను అలంకరించుకున్నాడు. వాని హృదయమంతా మాలిని గురించిన వూహలే. వడివడిగా సుధేష్ణాదేవి మందిరానికి బయలుదేరాడు. దారి పొడుగునా ఎన్నెన్నో రంగుల కలలు! ఏకాంతంలో మాలినిని సందర్శించి, తనివితీరా ఆమె రూప లావణ్యాలను ఆస్వాదించవలె. తీయతీయని పలుకులతో ఆ సుందరీమణి మనసు దోచి, ఆమెను నొప్పింపక వొప్పించవలె. అటు సూర్యుడు యిటు పొడిచిననూ నేటి రాత్రితో నేను సంపూర్ణ జీవిత సాఫల్యమును పొందవలె అని వువ్విళ్లూరుతున్న కీచకునికి సైరంథ్రి, సుధేష్ణ సౌధంలో పనిలో నిమగ్నమై కనిపించింది. క్షణమైనా ఆగక కీచకుడు ఆమెతో సరస సంభాషణకు దిగాడు. ఆమె ఉదాసీన వైఖరిని అలుసుగా తీసుకుని మరింత వుత్సాహంగా మాట్లాడాడు. మరొక అడుగు ముందుకు వేసి రకరకాల శృంగార చేష్టలు ప్రారంభించాడు. కాలం దాపురించిన సింహబలుని చేష్టలను రోషావేశాలను అణచుకుని పాంచాలి సహిస్తోంది.

కీచకుడు పగటి వేషధారివలె తన అలంకరణలను మాలిని వద్ద ప్రదర్శించడం మొదలు పెట్టాడు. భవనపు పాలరాతి స్తంభాలపై మునివేళ్లతో తాళం వేస్తూ, కూనిరాగాలు తీశాడు. వెలలేని వుంగరపు రాళ్ల మెరుపులు మాలిని కంటపడేట్టు వాటిని ప్రదర్శిస్తున్నాడు. ఎన్ని చేష్టలు చేసినా ఆమె కనులు కాదు కదా, చెవులైననూ వానిని గమనించలేదు. ఇక యీ మూగబాసలతో ప్రయోజనం లేదని సైరంథ్రీ, సౌందర్యరాశీ! నీ పాదకమలాలను సేవించుకోగల భాగ్యం అబ్బితే, అంతకు మించిన అదృష్టం లేదనుకుంటాను. నాపై విముఖతా లేక వైరాగ్యభావమా? ఎన్ని విధాల అర్థించినా దయమాలి నన్ను కాదనడం భావ్యమా? ఈ సువిశాల రాజ్యంలోని సిరి సంపదలు నీ సొంతం. యీ నగరిలోని భామినులందరూ నీ చెలికత్తెలు. విరాటుడు మత్స్యదేశాధిపతి యని భ్రమిస్తున్నావేమో. ఆయన రాజపదవి నామమాత్రం. నా అసహాయ శూరత్వమే విరటుని సింహాసనానికి కాళ్లు, చేతులు. మాలినీ, ఆనాడు రాజవీధిలో నిన్ను అవమానించినపడు కొలువులో వొక్కరైననూ పెదవి మెదిపారా? కనీసం రాజైననూ యిదేమని అన్నాడా? అయిదుగురు గర ధర్వులు, మహాబలశాలురు భర్తలుగా వున్నా నిన్ను ఆదుకున్నవారే లేకపోయారు. నేను యిష్టంతో నీ పొందును అభిలషిస్తున్నాను. లేకుంటే నన్ను అడ్డుకోగల వారెవరూ లేరు సుమా అంటూ హెచ్చరికతో ముగించాడు. మాలిని వాని ధోరణిని గమనించింది. ఉన్మాదిని రెచ్చగొట్టడం శ్రేయస్కరం కాదనుకుంది. ముఖంలోని రోషావమాన భావాలను దిగమింగి, బలవంతంగా పెదవులపైకి చిరునవ్వు తెచ్చుకున్నది. సింహబలా, మీ మగవారెపడూ యింతే. మీ తమకమే గాని ఎదుటివారి మనసు పసికట్టరు. ఎంతటి గాఢానురాగంతో వున్నా, నావంటి మగువలెపడూ బయటపడరు. వలదు వలదని ఎన్ని విధాల మొరపెట్టుకున్నా, వెనుక ముందులాలోచించక పదిమందిలో నన్ను ఆరడి పెడుతున్నావు. నిగూఢంగా కోరికలు తీర్చుకోవడం శ్రేయస్కరం కదా. పాంచాలి మాటలకు ఆనందంతో కీచకునికి మతి భ్రమించినట్టయింది.

పూర్తిగా ఆమెకు వశుడై, అయితే యిపడు నేను ఎట్లా ప్రవర్తించాలో ఆజ్ఞాపించు అంటూ విధేయుడై నిలబడ్డాడు సింహబలుడు.తను పన్నిన వుచ్చులో కీచకుడు పడ్డందుకు ద్రౌపది సంతోషించింది. స్వరం తగ్గించి, సింహబలా! నర్తనశాల మనకు అన్ని విధాలా అనువైన తావు. నేటి రాత్రి, నాట్యశాలకు… ఒంటరిగా… సిగ్గులతో గుసగుసలాడింది. సింహబలుడు ఆనంద పారవశ్యంతో మెలికలు తిరిగిపోయాడు. కొద్దిసేపు మాలినిని క్రీగంట చూస్తూ, శిలా ప్రతిమలా వుండి, సుందరీ! యింతమాత్రం కరుణించావు. నా జన్మధన్యమైంది. నీ ఆజ్ఞ శిరసావహించి, నీ అడుగులకు మడుగులొత్తనా? నేటి రాత్రి, నర్తన శాలలో, నిలువెల్లా కనులు చేసుకుని నీ రాకకై నిరీక్షిస్తాను, మరి, నువ్వు మాట తప్పకూడదు సుమా! అన్నాడు లాలనగా. మాలిని విలాసంగా నవ్వి, నీ మీద ఆన! రాజా, ఇక్కడ మనం ఎక్కువ సేపు మాటలాడడం మంచిదికాదు. పోయి రమ్ము అంటూ పాకశాల వైపు కదిలింది. నెరవేరిన మనోరథంపై కీచకుడు తన మందిరానికి చేరాడు. జరిగినదంతా పూసగుచ్చినట్టు వలలునికి వివరించింది మాలిని. భీముడు ఆహ్లాద పారవశ్యంలో మునకలు వేశాడు.సింహబలునికి క్షణమొక యుగంలా గడుస్తోంది. సైరంధ్రీ సౌందర్య సంస్మరణలో ఆకలి దపలు మరిచాడు. వున్మత్త చిత్తంతో కీచకుడు అస్థిమితంగా తిరుగాడుతున్నాడు. సూర్యాస్తమయం అయింది. విరాట రాజ నగర వీధులలో సందడి సద్దుమణిగింది. సైరంథ్రి సంకేతాన్ని అందుకుని, భీమసేనుడు మేలిముసుగును నిండుగా కప్పుకుని బయలు దేరాడు. వారిద్దరూ చిమ్మచీకటిలో నర్తన శాలకు చేరారు. విశాల శాల నడుమ మాణిక్య కాంతులీనుతూ వొక శయ్య కనిపించింది. పాంచాలిని అచటి స్తంభం వెనుక నిలబడమని, భీముడు ఆ తల్పంపై పవళించాడు. అప్పటికే మదనోద్మాదంతో కలయ తిరుగుతున్న కీచకునికి శయ్యపై కనిపించిన మానవాకృతిని చూడగానే అనురాగ పారవశ్యం కమ్ముకుంది. మాలినీ, యిప్పటికైనను నన్ను అనుగ్రహించావు… అంటూ తన ధోరణిలో తాను మాట్లాడుతున్నాడు. భీముడు ఆర్ద్రానురాగంతో, సింహబలా! నా వంటి వనిత నీకీలోకంలో కానరాదు. నా శరీర స్పర్శతో నీకు దివ్యలోకాలు కనిపించగలవు. ఇక నీకు సంపూర్ణ శాశ్వత శరీర సాఫల్యమే సుమా అంటూ కీచకుని కేశపాశం చేజిక్కించుకున్నాడు. యీ హఠాత్పరిణామానికి వానికి చేష్టలుడిగాయి. వారిద్దరూ మదపు టేనుగుల వలె ద్వంద్వ సమరం సాగిస్తున్నారు. తన భంగపాటు బయట పడుతుందని కీచకుడు, తన నిజరూపం తెలుస్తుందని భీముడు వెరుస్తున్నారు. సవ్వడి నర్తనశాల దాటిపోకుండా, ముసుగులో గుద్దులాట భీకరంగా సాగుతోంది. పరస్పరం పిడికిలి పోట్లు పొడుచుకుంటున్నారు. సింహబలునికిది వూహించని దెబ్బ. భీముడు వ్యూహం పన్ని సంసిద్ధుడై వచ్చినవాడు.

కీచక సంహారం

నర్తనశాల పదఘట్టనలతో కంపిచింది. తోక తొక్కిన నల్లతాచుల వలె భీమ కీచకులు బుసలు కొడుతున్నారు. చీకటికి భయాందోళనలు తోడుకాగా, మాలిని నిలువెల్లా చలించిపోతోంది. పిడికిలి పోట్లు వురుములు లేని పిడుగుల వలె మందిరం నాలుగు గోడల మధ్య ప్రతిధ్వనిస్తున్నాయి. సింహబలుని శక్తి క్షీణించ సాగింది. ప్రత్యర్థి మరింత బలం పుంజుకున్నాడు. కీచకుడు డస్సిపోయి. పెనుగులాటలో పడ్డాడు. ప్రాణాలు దక్కించుకుని పారిపోయే ప్రయత్నమని భావించిన భీమసేనుడు మరింత శక్తిని కూడదీసుకుని లేడిపైకి దుమికిన సింహంలా లంఘించాడు. భీకర ముష్టి ప్రహారాలతో కీచకుని దేహాన్ని కుళ్లబొడిచాడు. ఆ కముకు దెబ్బలకు సింహబలుడు, విలవిల తన్నుకోవడం మొదలు పెట్టాడు. వాని దేహభాగాలు క్రమక్రమంగా చైతన్యరహితమై, కుప్పకూలాడు. అయినా, భీముని కసి తీరలేదు. కీచకుని వక్ష స్థలాన్ని చీల్చి పాదాలను, చేతులను, తలను వాని గుండెలోనికి చొప్పించాడు. సింహబలుని వెన్నుముక పుచ్చిన విల్లువలె పూసకొక్కటిగా విరిగింది. వలలుడు వంటవానిగా సిద్ధహస్తుడు. అంతటితో ఆగక, చుట్టచుట్టిన కీచకుని దేహాన్ని నేలపై పదేపదే మోదాడు. రొట్టెలపిండిని మర్దించినట్టు మర్దించి, మాంసపు ముద్దగా తయారు చేశాడు. వెంటనే చనిపోయిన కీచకుడి శవం దగ్గర నుంచి భీముడు తనకేమి తెలియనట్లుగా వంటశాలకు వెళ్లిపోయాడు. తర్వాత తగినంత వ్యవధి యిచ్చి, పాంచాలి నర్తనశాల ప్రాంగణంలోకి పరుగున వచ్చి, భయాందోళనలతో గొంతెత్తి అరవసాగింది. నా గంధర్వపతులు సింహబలుని సంహరించారు. రండి, వచ్చి వీని దుస్థితి గమనించండి అని నాటకీయంగా భయాన్ని అతిగా నటించడం మొదలు పెట్టింది. ఆ రాత్రి పూట నిశ్శబ్దవాతావరణంలో ఆమె కేకలు నగరమంతా ప్రతిధ్వనించాయి. కేకలు విన్న రాజభటులు పెద్దపెద్ద దివిటీలతో నర్తనశాలకు చేరారు. క్షణాలలలో వార్త నగరమంతా సోకింది. ఉపకీచకులు కొందరు ఆత్రుతగా పరుగున నిద్రముఖాలతో వచ్చారు. అక్కడ తమ అగ్రజుని ఆకృతి చూసి నిశ్చేష్టులైనారు. ఆ మాంసపు ముద్దపై పడి, గొంతెత్తి విలపించారు. రాజబంధువులు, రాజాధికారులు కీచకుని దుస్థితిని చూసి నిర్ఘాంతపోయారు. వారికి నోటమాట రాలేదు. ఇటువంటి ఘాతుకాన్ని తాము యింతవరకు కనీవినీ యెరుగమనుకున్నారు. ఒక్క కీచకునికి తప్ప రాజ్యమంతటికీ పొద్దు పొడిచింది.
అదండి సంగతి ఆ రాత్రి నర్తనశాలలో కీచకవధ అతి క్రూరంగా పాశవికంగా చేశాడు భీమసేనుడు.

– కేశవ
 

Read more RELATED
Recommended to you

Latest news