అమ్మతనానికి ‘ఉరి’ – మానవత్వానికి అప’కీర్తి’

-

తదేకంగా కన్నపేగు వైపే చూస్తున్న ఆ కళ్లనుండి ఆఖరి కన్నీటిబొట్టు. తన చాతీపై కూర్చుని ఆడుకున్న అవే చేతులు, పంతొమ్మిదేళ్ల తర్వాత అదే చాతీపై కూర్చుని గొంతుకు ఉరి బిగిస్తుంటే, ఆ గొంతులో కొట్టుమిట్టాడుతున్న చివరి మాటలు ఇవేనేమో.. ’‘చంపేయమ్మా… ఈ దారుణాలు చూడటం కంటే, నీ చేతిలో చావే సుఖంగా ఉంది.’’

ఒక ఉరి అమ్మతనానికి..
ఒక మరణం మానవత్వానికి…
ఒక తప్పు వికృతానిది..
ఒక శిక్ష నిండు జీవితానిది…

మానవత్వానికే అప‘కీర్తి’ తెచ్చిన కీర్తిరెడ్డి ఉదంతం మనుషులను ఉలిక్కిపడేలా చేసింది. విశృంఖలత్వానికి, విచ్చలవిడితనానికి, వికృతచేష్టలకు నెలవుగా మారిపోయిన ఒక టీనేజి అమ్మాయి ‘అమ్మ’నే కాదు, సగటు ‘మనిషి’నీ చంపేసింది.

తల్లో, తండ్రో మందలిస్తే, ఆత్మహత్య చేసుకున్న పిల్లలను చూసాం. అదే తల్లిని హత్య చేసిన కూతుర్నీ చూస్తున్నాం. తప్పులు సరిచేసుకోవడం మాని చావులు కొని తేవడం ఎలా అలవాటయింది? లెక్కలేనితనం నుండి విచ్చలవిడితనం ఎలా అభివృద్ధి చెందుతోంది? దోషి ఎవరు? శిక్ష ఎవరికి?

ఇద్దరితో ఏకకాలంలో ప్రేమాయణం (కాదు.. కాదు.. వాత్సాయనం) నడుపుతూ, తల్లి హెచ్చరించినందుకు, కోపం పెచ్చరిల్లింది. ‘కామాతురాణాం, న లజ్జ, న భయం’ అన్న మాటను అక్షరాల నిజం చేస్తూ, పశువుల కంటే హీనంగా ప్రవర్తించింది. విశృంఖల శృంగారంలో ఇద్దరు ప్రియులకు లోటు లేకుండా షిఫ్ట్‌ పద్థతిలో క్రమశిక్షణ కూడా పాటించింది. నిజానికి బలిపశువు శశికుమార్‌. బాల్‌రెడ్డి బాల్‌ బాల్‌ బచ్‌గయా..

ఇంకో ఏడాదిలో చదువు పూర్తయితే, యూఎస్‌ పంపించి, ఎమ్మెస్‌ చేయిద్దామనుకున్న ఆ తలిదండ్రుల ఆశలను వమ్ము చేస్తూ, కన్నతల్లినే కాటికి పంపింది. ఎలాగైనా ఒక్కగానొక్క బిడ్డను గొప్పదాన్ని చేయాలని రోజుల తరబడి కష్టపడుతున్న ఆ తండ్రికి తోడు లేకుండా చేసింది. నచ్చినవాడికే ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్న ఆ తల్లికి నచ్చిన‘వాళ్లు’న్నారని తెలియదు పాపం. ఈ ‘నచ్చడం’, ఏ ‘నచ్చడ’మో కూడా తెలియదు. తన శవం పక్కనే ‘రెచ్చిపోయేంత’ నచ్చడం అని అసలే తెలియదు.

ఇప్పుడు ఎవరెవరికి దిక్కు? కనీస దహనసంస్కారాలకు నోచుకోకుండా అనాధగా బూడిదైపోయింది ఆ తల్లి. వారాల తరబడి తిరిగొస్తే, ఒక్క బుక్క పెట్టే తోడు లేకుండాపోయింది ఆ తండ్రికి. తెలిసీతెలియనితనంతో, వికృతాలకు అలవాటుపడి, నిండు జీవితాన్ని జైలుపాలు చేసుకుందా కూతురు.

ఇక్కడ హత్యాయుధం విషం పూసిన ‘స్మార్ట్‌ఫోన్‌’. ఆ విషం, ఇంటర్‌నెట్‌, సోషల్‌మీడియా, బూతుసైట్లు. సరఫరాదార్లు, జియో, ఎయిర్‌టెల్‌, ఐడియా….ఇంకా.. ఇంకా.. ఎదిగీఎదగని ప్రాయంలో, దేన్నెలా వాడాలో తెలియని అమాయకత్వంతో, తెలియకూడని విషయాలు తెలుస్తున్న వయస్సులో , ఏం చేయాలో, ఎలా చేయాలో కొట్టుమిట్టాడుతూ, ఒంట్లో పెరుగుతున్న వేడికి ‘ఎగ్జాస్ట్‌’ లేక, తప్పుకు-తపనకు, విచక్షణకు-ఘాతుకానికి తేడా తెలియకుండా మత్తులో మునిగి ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇవ్వాళ్టి కీర్తి ఉదంతమైనా, నిన్నటి వరంగల్‌ ప్రవీణ్‌ ఘోరమైనా వెనకా ఉన్నది నిజానికి ఇంటర్నెట్లో విచ్చలవిడిగా లభిస్తున్న పోర్న్‌ కంటెంట్‌. రోడ్లపై ఎటుచూసినా, చెవుల్లో ఇయర్‌ఫోన్లు, స్మార్ట్‌ఫోన్లలో తలలు పెట్టి తిరుగుతున్న ‘జడల’ దయ్యాలు. అరచేతికంటే చిన్నగా ఉండే ఆ మెషిన్‌లో, హైస్పీడ్‌ టైపింగ్‌తో చాటింగ్‌.. పిట్‌మన్‌ కనుగొన్న షార్ట్‌హ్యాండ్‌ కంటే షార్ట్‌కట్లు. ఎంతమంది ఎమ్‌సెట్లు, జెఇఇలు, సివిల్స్‌, సీఎలలో అర్హత సాధిస్తున్నారు? మిగిలినవారంతా ఏం చేస్తున్నారు? వారి తల్లిదండ్రులు ఏం చూస్తున్నారు?

పదవ తరగతికి కూడా రాకుండానే ప్రేమాయణాలు, వాటి ఫలితాలు గర్భస్రావాలు. ఈ పైత్యాలను పెంచి పోషిస్తున్న యూత్‌ (బూతు) సినిమాలు, ఎటువంటి నిర్భందాలు లేని ఇంటర్నెట్‌. ఫేస్‌బుక్‌లో ప్రేమలు, వాట్సప్‌లో నగ్నచిత్రాలు, రోడ్లమీద రేప్‌లు, పొదల్లో మర్డర్లు. ఎటు చూసినా, ఎక్కడ విన్నా.. లైంగిక సంబంధిత నేరాలే. ఎవరు వీరిని ప్రేరేపిస్తున్నారు? ఎవరు దీనికి బాధ్యులు?

నిక్కచ్చిగా తల్లిదండ్రులు, ప్రభుత్వాలే. ..

చిన్న వయస్సులో స్మార్ట్‌ఫోన్‌ ఇవ్వాల్సిన అవసరమేముంది? వాళ్ల ఆనుపానులు తెలియడానికి ఒక మామూలు ఫీచర్‌ఫోన్‌ చాలు. ఎర్రబటన్‌, పచ్చబటన్‌ ఉంటే చాలు. ఐదువేలకు వచ్చే చైనా ఫోన్లు ఇప్పుడు అణ్వాయుధాల్లా మారిపోయాయి. కుటుంబాలకు కుటుంబాలను మాయం చేస్తున్నాయి. తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఏదోరకమైన చావును కొనితెచ్చుకోవాల్సివస్తుంది. ప్రభుత్వాలు కూడా ఇప్పటికైనా ఇంటర్‌నెట్‌పై తగిన నిఘా, పరిమితులు విధించకపోతే ఇంకా ఎన్నో దారుణాలు, ఘాతుకాలు చూడాల్సివస్తుంది. ఈ దేశంలో అధికశాతం ఉన్న యువత ఈ రకంగా నాశనమవుతుంటే ఇక దేశమెలా బాగుపడుతుంది?

సోషల్‌మీడియా వల్ల నిజానికి ఏరకమైన ఉపయోగం లేదు. ఉన్నవల్లా రోగాలు, వ్యసనాలు, కుంగుబాటు, నిద్రలేమి. నేరాలు, ఘోరాలు. మప డబ్బులతో జల్సాచేసే సెలెబ్రిటీలను ఫాలో అయితే ఏంటి? వాళ్లు పన్నెండోపెళ్లి చేసకుంటే మనకెందుకు? ఇరవైమూడోసారి విడాకులు తీసుకుంటే మనకెందుకు? అడ్డమైన ఫోటోలు పోస్ట్‌ చేసి వాటికి ఎన్ని లైకులు వచ్చాయనే లెక్కలు. రాకపోతే అలవికాని బాధ… అవసరమా? ఇది ఏరకంగా మన జీవితాలను ఉద్ధరిస్తుంది?

ఏది ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉండాలి. పరిమితులు దాటితే ఏదైనా ప్రమాదకరమే. దేన్నెలా వాడాలో, ఎంతవరకు వాడాలో మనకింకా తెలియడంలేదు. ప్రతీ ఆవిష్కరణలో మంచి చెడు రెండూ ఉంటాయి. దేన్ని స్వీకరించాలి అనేది మన విచక్షణపై ఆధారపడిఉంటుంది. ఆ విచక్షణను పిల్లలకు అలవాటు చేయాల్సింది తల్లిదండ్రులే. దాన్నే పెంపకం అంటారు. సమాజానికి మంచి సంతానాన్ని ఇవ్వడం ప్రతీ జంట బాధ్యత. ఇంటర్నెట్‌లో అపారమైన విజ్ఞాన సంపద ఉంది. దానితో సివిల్స్‌ సాధించినవారున్నారు. మంచి ఉద్యోగాలు పొందినవారున్నారు. ఎంతో జ్ఞానాన్ని సముపార్జించినవారున్నారు. ఇదంతా వదిలేసి, కేవలం చెడునే పట్టుకుంటే జరిగే అనర్థాలు ఇలాగే ఉంటాయి. పిల్లల ప్రతీ చర్యను గమనిస్తూ, మొదట్లోనే అడ్డుకుంటే వారు సరైన దారిలో పయనించే అవకాశముంటుంది. ఆ దిశగా ప్రతీ తల్లీ, తండ్రీ కృషి చేయాలి. ప్రభుత్వం కూడా ఇంటర్నెట్‌ వల్ల సమాజంపై పడుతున్న దుష్ప్రభావాలను విశ్లేషించి తదనుగుణంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు కూడా ఈ జాడ్యాలను వ్యాప్తి చెందకుండా నిరోధించాల్సివుంది.

– రుద్రప్రతాప్‌

Read more RELATED
Recommended to you

Latest news