ఆ వైసీపీ లేడీ ఎమ్మెల్యే ప‌ద‌వికి ముప్పు…!

-

గుంటూరు జిల్లా తాడికొండ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున డాక్టర్ శ్రీదేవి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత కొద్ది రోజులుగా శ్రీదేవి కులధ్రువీకరణపై రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీదేవి కులంపై రాష్ట్రపతి భవన్ కు ఫిర్యాదు వెళ్లింది. ఇప్పటికే ఆమె కులంపై కోర్టులో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. వాస్తవంగా ఆమె కులం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆమె మెడ‌కు చుట్టుకున్నాయి.

ఇటీవల వినాయక చవితి వేడుకల సందర్భంలో వచ్చిన వివాదం నేపథ్యంలో గతంలో ఆమె ఎల‌క్ట్రానిక్ మీడియ సాక్షిగా త‌న కులం గురించి ఓపెన్ అయ్యారు. తాను క్రిస్టియన్‌ అని… తన భర్త కాపు కులస్థుడని శ్రీదేవి వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంపై లీగల్‌ రైట్స్‌ ప్రొటక్షన్‌ ఫోరానికి చెందిన వారు దృష్టి సారించారు. అయితే చ‌ట్ట ప్ర‌కారం దళితులు మతం మార్చుకుంటే కులం ద్వారా వచ్చే రిజర్వేషన్‌ హక్కులు కోల్పోతారని ఆమెకు వ్యతిరేకంగా ఆమె ఎన్నిక చెల్లదనే వాదనను తెరమీదకు తెచ్చారు.

శ్రీదేవి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తాను ఎస్సీనంటూ ఎన్నికల కమిషన్‌కు తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించింది అని… ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందినందున‌ ఆమె ఎన్నికను రద్దు చేయాలని లీగ‌ల్‌ రైట్స్ ప్రొట‌క్ష‌న్‌కు చెందిన వారు కోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా వీరు ఇదే అంశంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడంతో రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది.

శ్రీదేవి అఫిడవిట్‌ దాఖలులో లోపాలపై, ఎస్సీ రిజర్వేషన్‌ దుర్వినియోగంపై వచ్చిన అభియోగాలపై పూర్తి విచారణ జరిపించాల్సిందిగా ఏపీ చీఫ్‌ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ వివాదంలో ఆమె ఎస్సీ కాద‌ని తేలితే ఆమె ఎమ్మెల్యే ప‌ద‌వికి ముప్పు త‌ప్ప‌దు. ఇదిలా ఉంటే ఆమె వినాయ‌క‌చ‌వితి సంద‌ర్భంగా తుళ్లూరు మండ‌లంలో ఓ గ్రామానికి వెళ్లిన‌ప్పుడు జ‌రిగిన వివాదంలో ఆమె టీడీపీ కార్య‌క‌ర్త‌లు త‌న‌ను కులం పేరుతో దూషించారంటూ పోలీస్ కేసులు పెట్టారు. ఇప్పుడు వారంతా ఆమె ఎస్సీ కానందున ఆ కేసులు కూడా చెల్ల‌వ‌ని వాదిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news