తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ.. 6 మంది కొత్త మంత్రులకు చాన్స్.. ఇవాళే ప్రమాణ స్వీకారం..!

-

సీఎం కేసీఆర్ కేబినెట్‌లో ప్రస్తుతం 10 మంది మంత్రులు ఉండగా, వారిలో కొందరి శాఖలు మార్పు చేయనున్నట్లు తెలిసింది. ఇక మంత్రివర్గంలోకి మరో 6 మందిని కొత్తగా తీసుకుంటారని సమాచారం.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాక చాలా కాలం వరకు సీఎం కేసీఆర్ మంత్రి పదవులను ఎవరికీ కేటాయించలేదు. ఆ తరువాతైనా పూర్తి స్థాయిలో మంత్రి వర్గాన్ని విస్తరించకుండా కేవలం 10 మందికి మాత్రమే ఆ పదవులను ఇచ్చారు. అయితే ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మరో 6 మందికి కేసీఆర్ మంత్రి పదవులు ఇవ్వనున్నారని తెలిసింది. అందులో భాగంగానే ఆదివారం సాయంత్రం నూతన గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులతో ప్రమాణం చేయించనుండగా ఈ కార్యక్రమానికి గాను అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని ఇప్పటికే ఆదేశించారు. అయితే కొత్త మంత్రులు ఎవరు ? ఇప్పుడున్న మంత్రుల్లో ఎవర్నయినా తొలగిస్తారా ? అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

సీఎం కేసీఆర్ కేబినెట్‌లో ప్రస్తుతం 10 మంది మంత్రులు ఉండగా, వారిలో కొందరి శాఖలు మార్పు చేయనున్నట్లు తెలిసింది. ఇక మంత్రివర్గంలోకి మరో 6 మందిని కొత్తగా తీసుకుంటారని సమాచారం. వారిలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, శాసనమండలి సభ్యురాలు సత్యవతి రాథోడ్ పేర్లు ఖరారు కాగా.. కేటీఆర్‌కు మరోసారి ఐటీ, పరిశ్రమల శాఖ ఇస్తారని, అలాగే హరీష్ రావుకు మళ్లీ నీటి పారుదల శాఖ లేదా ఆర్థిక శాఖ ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఇక గత ప్రభుత్వంలో కేసీఆర్ తన మంత్రివర్గంలో మహిళలకు అవకాశం కల్పించలేదు. కానీ ఈసారి సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లకు అవకాశం కల్పించనున్నారు.

కాగా మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డిల పేర్లు కూడా మంత్రి పదవులకు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరికి ఇతర ముఖ్యమైన పదవులు ఇస్తారని సమాచారం అందుతోంది. కాగా గుత్తా సుఖేందర్ రెడ్డిని మండలి చైర్మన్‌గా ఎన్నుకునే అవకాశం ఉండడంతోపాటు పార్టీలో కీలకనేతల్లో ఒకరైన కడియం శ్రీహరికి మరోసారి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని, అలాగే నాయిని నర్సింహారెడ్డికి టీఎస్‌ఆర్‌టీసీ చైర్మన్ పదవిని, జూపల్లి కృష్ణారావుకు రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవిని ఇస్తారని తెలిసింది. అలాగే మాజీ అసెంబ్లీ స్పీకర్ మధుసుదనాచారి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌లకు కీలక పదవులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

ఇక మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు మరోసారి రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ పదవి ఇస్తారని తెలుస్తుండగా.. శాసనమండలి విప్‌గా ఉన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. గత కొంత కాలంగా ఈయన కేటీఆర్‌కు పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాల్లో సహాయకారిగా ఉంటున్నారు. ఈ క్రమంలో పల్లాకు పార్టీలో కీలక బాధ్యతలు ఇస్తే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆయన కేటీఆర్‌తో కలిసి మరింత చురుగ్గా పనిచేస్తారని కేసీఆర్ భావిస్తున్నారట. అందుకని పల్లాకు పార్టీలో కీలకపదవి ఖాయంగా కనిపిస్తోంది. కాగా సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం కొత్త మంత్రులచే గవర్నర్ ప్రమాణం చేయించిన తక్షణమే వారికి శాఖలను కూడా కేటాయించి ఆ తరువాత రాత్రి 7 గంటలకు మంత్రి మండలి సమావేశం నిర్వహించనున్నారని తెలిసింది. మరి సీఎం కేసీఆర్ కేబినెట్‌లో కొత్తగా అవకాశం దక్కించుకోనున్న మంత్రులెవరో సాయంత్రం వరకు వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Latest news