ఇప్పటివరకూ ఉమ్మడి ఆంధ్రాకు తరువాత అవశేషాంధ్రకు పనిచేసిన ముఖ్యమంత్రులందరిలో చంద్రబాబు ప్రత్యేకం. ఆ విధంగా ఆయన విజన్ ఉన్న నాయకుడు. ఇప్పటివరకూ పనిచేసిన ముఖ్యమంత్రులందరి కన్నా పరిశ్రమించడంలో ఆయన ప్రత్యేకం.అభివృద్ధి కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఓట్ల ప్రాధాన్యంలో ఆ రోజు కొన్ని పార్టీలు లెక్కకు మిక్కిలి నగదు బదిలీ పథకాలు ఎన్నో తెచ్చాయి కానీ ఆయన మాత్రం వాటిపై మొగ్గు చూపలేదు.
అలా అని ఆ రోజు సంక్షేమ పథకాలు లేవు అని కాదు కానీ ఇన్ని లేవు. ఇన్ని అక్కర్లేదు కూడా ! ఓ రాష్ట్ర బడ్జెట్ ను పూర్తిగా సంక్షేమానికే కేటాయించే విధంగా చేయడం చాలా తప్పు. ఏ విధంగా చూసినా తప్పే ! ఆ మాటకు వస్తే ఉమ్మడి రాష్ట్రంలో కూడా రెండే రెండు పథకాలు ఖజానాకు ఎంతో భారం అయ్యాయి. అవి కూడా చంద్రబాబు తీసుకువచ్చినవి కావు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చినవి. వాటిలో ఒకటి ఆరోగ్య శ్రీ రెండు ఫీజు రీయింబర్స్ మెంట్ .. ఈ రెండు పథకాలు కూడా ఆర్థికంగా భారమే అయ్యాయి. అయినా కూడా కేంద్రంతో సఖ్యత ఉండడం, అక్కడున్న వారితో వైఎస్సార్ చెప్పి నిధులు ఏర్పాటుకు కృషి చేయడం వంటి విషయాలు ఎంతగానో కలిసి వచ్చాయి. కానీ ఇవాళ అలా లేదు. ఇకపై ఉండదు కూడా !
ఆ రోజు హైద్రాబాద్ తో సహా పలు ప్రాంతాల అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇవ్వలేకపోయినా కూడా కొన్ని విషయాల్లో మాత్రం చంద్రబాబు టాప్. హైటెక్ నగరి నిర్మాణం తరువాత అభివృద్ధి ఇంకా అనేక పనులకు ఇచ్చిన ప్రాధాన్యం ఇవాళ్టికీ చర్చకు తావిస్తున్నాయి. ఆరోజు హైద్రాబాద్ ను ప్రపంచ పటంలోనే ఓ గొప్ప నగరంగా చూపించారు. ఆ విధంగా ఆయన విజన్ ఇవాళ్టికీ ప్రశంసలు అందుకుంటూనే ఉంది. హైద్రాబాద్ తరువాత ఆంధ్రుల రాజధాని అమరావతిపై కూడా ఆయన అంతే మమకారం పెంచుకున్నారు. అందుకు తగ్గ విధంగా నిధులు వెచ్చించి అత్యవసర నిర్మాణాలు పూర్తి చేశారు. సరే ! కొన్ని లోపాలు పాలన పరంగా ఉన్నా కూడా ఆ పాటి కూడా ఇప్పటి ప్రభుత్వం చేయలేకపోతుంది అన్న అపవాదును వైసీపీ మోస్తూ ఉంది. కనీసం పట్టుదలకు పోయి అభివృద్ధి పనులు కొన్నయినా చేపట్టగలదా అంటే అదీ లేదు.. ఓ ఎంపీ (నరసరావు పేట ఎంపీ కృష్ణదేవరాయులు) తన ఆఫీసు ముందు అస్తవ్యస్తంగా ఉన్నా దారిని బాగు చేయించేందుకు, పాత రోడ్డు స్థానంలో కొత్త రోడ్డును వేయించుకోవాలని అనుకున్నా, అందుకు తగ్గ నిధులున్నా కూడా పనిచేయించుకోలేకపోతున్నారు. ఇంకేం చేయించగలరు? అని ప్రశ్నిస్తోంది టీడీపీ. అదే తమ హయాంలో కనీస స్థాయిలో పనులు జరిగేవి అని గుర్తు చేస్తోంది.
ఇవాళ ఆర్థికంగా అటు కేంద్రం మరియు రాష్ట్రం పెద్దగా పురోగమన దిశలో లేవు. ఒప్పుకోవాలి. అందుకు రెండేళ్ల కరోనా సంక్షోభమే ఓ కారణం. అయినా కూడా వీటిని అధిగమించి పనిచేయాల్సిన రోజులు ముందున్నాయి. ఆ రోజు చంద్రబాబు కొన్నంటే కొన్ని అభివృద్ధి పనులు అయినా చేయించగలిగారు, ఆ స్థాయిలో వైసీపీ ఇప్పటికిప్పుడు చేయించలేకపోయినా కనీసం రోడ్ల మరమ్మతులకు ఇంకా కొన్ని పనులకు నిధులు ఇవ్వాలి. కానీ ఇవేవీ లేకుండా చంద్రబాబునో, టీడీపీనో తిడితే ఏం లాభం?