రెండే రెండు పార్టీల కొట్లాట సాగుతోంది తెలంగాణలో! ఓ విధంగా రెండు కూడా కాదు ఒకే ఒక్క పార్టీ ఆధిపత్యంలో ఉంది. కాంగ్రెస్ కూడా కొన్ని సార్లు అస్సలు మాట్లాడిన దాఖలాలు లేవు. బీజేపీ కూడా మాట్లాడినా అవన్నీ రాజకీయ వ్యూహంలో భాగంగా తీసుకున్నా కూడా పెద్దగా ఫలితాలు అయితే లేవు. గెలిచిన ఈటెల, గెలిచిన రఘునందన్, గెలిచిన రాజా సింగ్ వంటి వ్యక్తులు కేవలం వారి పర్సనల్ ఇమేజ్ తోనే నెగ్గుకు వచ్చారు.
ఎంపీల విషయంలో కూడా అంతే అరవింద్ కానీ కిషన్ రెడ్డి కానీ ఆ రోజురాణించారంటే అందుకు కారణం బీజేపీ కాదు.. ఆయా సందర్భాల్లో వారి స్వశక్తే ప్రధాన బలం మరియు ప్రధాన కారణం. ఈ దశలో కేసీఆర్ ను ఏమీ అనలేని స్థితిలో రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి. అదేవిధంగా బీఎస్పీ కూడా ఉంది. షర్మిలక్క మాట్లాడినా కూడా పెద్దగా ప్రభావం లేదు.ఆ విధంగా వైఎస్సార్టీపీ కూడా జనంలోకి చొచ్చుకుపోలేకపోతోంది.
కమ్యూనిస్టులు ఉన్నా లేకున్నా ఒక్కటే అన్న విధంగా ఉంది.ఒకనాటి ఓయూ కేంద్రంగా జరిగిన రాజకీయ శిబిరాలు ఇప్పుడు లేవు. ఉన్నా కూడా కేసీఆర్ ను గద్దె దింపేంత శక్తిని కూడదీసుకుని లేవు. ఇక రాష్ట్రంలో కేసీఆర్ ను అదిరించడానికో బెదిరించడానికో కమ్యూనిస్టులతో పాటు శక్తిమంతం అయిన నక్సలైట్లూ లేరు.ఇంకేం కేసీఆర్ కు తిరుగేలేదు.ఆంధ్రా పార్టీలు అయిన టీడీపీ కానీ వైసీపీ కానీ ఇవాళ అక్కడ ఉనికిలోనే లేవు. మరి! తెలంగాణ రాష్ట్ర సమితిని ఢీకొనేదెవ్వరు?
ఈ దశలో కేసీఆర్ కు దీటుగా కేజ్రీవాల్ ఎదగాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు.తన కలలకు దగ్గరగా తన ఆశలకు దగ్గరగా కొన్ని ప్రణాళికలు కూడా వేశారు. ఇందులో భాగంగా కేసీఆర్ తనదైన రాజకీయం నడుపుతూ ఉంటే ఆయనకు భిన్నంగా ఆమ్ ఆద్మీ పార్టీ బాస్ అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీని విస్తృతం చేసే పనిలో పడ్డారు.త్వరలో ఆయన పార్టీ వర్గాలు పాదయాత్ర చేపట్టనున్నారని తెలుస్తోంది. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా పాదయాత్ర ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.ఈ యాత్రను కేజ్రీవాల్ (ఢిల్లీ సీఎం,ఆప్ అధినేత) ఆరంభిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లోనూ ఈ పాదయాత్ర సాగనుంది. ఇందుకు సంబంధించి రోడ్ మ్యాప్ ను కూడా ఆ పార్టీ తెలంగాణ ఇంఛార్జి సోమనాథ్ సిద్ధం చేశారని సమాచారం.