ఎడిట్ నోట్: ‘ఉత్తరాంధ్ర’ నమ్మేది ఎవరిని?

రాజకీయ పరంగా పోటాపోటి వాతావరణమే చూడటమే తప్ప..ఎప్పుడు కూడా కుళ్ళు కుతంత్రాలని ఉత్తరాంధ్ర ప్రజలు చూసి ఉండరు. వారికి అలాంటి రాజకీయాలు కూడా తెలియవు. ఉత్తరాంధ్ర అంటే ప్రశాంతంగా ఉండే ప్రాంతం. అలా ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఇప్పుడు రాజధాని యుద్ధం నడుస్తోంది. అనూహ్యంగా రాజధాని విషయంలో అన్నీ పార్టీలు సరికొత్త క్రీడకు తెరలేపాయి. ఇప్పుడు ఎవరికి వారు ఉత్తరాంధ్రలో పైచేయి సాధించాలని చూస్తున్నారు. ఇక ప్రజలు ఎవరి తరుపున ఉంటారు..ఎవరిని నమ్ముతారనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఈలోపు ఉత్తరాంధ్రలో దారుణమైన రాజకీయ క్రీడ జరిగేలా ఉంది.

అసలు రాజధానికి సంబంధించి గతంలో ఉత్తరాంధ్రలో ఎలాంటి రచ్చ జరగలేదు. వాస్తవానికి ఏపీ విడిపోయాక..చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అమరావతిని రాజధానిగా ప్రకటించిన ఉత్తరాంధ్ర నుంచి నిరసనలు రాలేదు. అప్పుడు ప్రతిపక్ష వైసీపీ సైతం ఉత్తరాంధ్ర గురించి మాట్లాడలేదు. అమరావతికి మద్ధతు ఇచ్చింది. అయితే టీడీపీ అమరావతి రాజధానిగా పెట్టి..విశాఖని ఐటీ, పారిశ్రామిక రాజధానిగా తీర్చి దిద్దాలనే కాన్సెప్ట్‌తో ముందుకెళ్లింది. ఇక ఆ మేరకు ఎంత సక్సెస్ అయిందో పక్కన పెడితే..కొంతవరకు విశాఖకు పెట్టుబడులు తీసుకొచ్చే కార్యక్రమాలు చేశారు.

ఇక 2019లో గెలిచి అధికారంలోకి వచ్చిన జగన్ సైతం..అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తూనే..విశాఖని అభివృద్ధి చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమని మూడు రాజధానులు అని ప్రకటించారు. అమరావతిని శాసన రాజధానిగా ఉంచేసి..విశాఖని పరిపాలన రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా ప్రకటించారు. ప్రకటన వచ్చింది గాని.ఇది చట్టం కాలేదు. పైగా మూడు రాజధానుల బిల్లులో తప్పులు ఉండటంతో కోర్టులో నిలబడదని చెప్పి జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.

మళ్ళీ కొత్త బిల్లుతో వస్తామని చెప్పింది గాని..ఇంతవరకు దానిపై కార్యాచరణ లేదు. పైగా హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఇప్పుడు మూడు రాజధానుల అక్కడ పెండింగ్‌లో ఉంది. అయితే అధికారంలో ఉంటూనే..తాజాగా విశాఖ రాజధాని డిమాండ్‌తో ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు పోరాటం మొదలుపెట్టారు. అమరావతి రైతులు అమరావతి టూ అరసవెల్లి పాదయాత్ర మొదలుపెట్టాకే..ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు విశాఖ కోసం ఉద్యమం అన్నీ మొదలుపెట్టారు. ఒక జే‌ఏ‌సిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో అమరావతి అంటూ టీడీపీ..ఉత్తరాంధ్రకు ద్రోహం చేస్తుందని, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందవద్దా? అంటూ వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. అలాగే విశాఖలో అమరావతి పాదయాత్ర అడ్డుకుంటామని అంటున్నారు.

ఈ నెల 15న విశాఖ గర్జన పేరిట ర్యాలీ చేస్తున్నారు. విశాఖ రాజధాని అంటూనే..ఉత్తరాంధ్రలో టీడీపీని దెబ్బకొట్టి రాజకీయ లబ్ది పొందడమే లక్ష్యంగా వైసీపీ ముందుకెళుతుంది. ఇక వైసీపీకి కౌంటరుగా టీడీపీ నేతలు గళం విప్పుతున్నారు. అమరావతి రాజధాని అని చెబుతూనే..విశాఖని అభివృద్ధి చేసింది తామే అని, అసలు విశాఖని వైసీపీ దోచుకుంటుందని ఫైర్ అవుతున్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికే మూడు రాజధానులు అంటున్నారని ఫైర్ అవుతున్నారు. ఇక సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో వైసీపీకి పోటీగా టీడీపీ పోరాటం చేయనుంది.

అటు జనసేన అధినేత పవన్ సైతం అమరావతికి మద్ధతు ఇస్తూ..మూడు రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రని వైసీపీ ముంచేస్తుందని ఫైర్ అవుతున్నారు. అలాగే 15వ తేదీన వైసీపీకి ధీటుగా జనవాణి కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహించనున్నారు. ఇలా మూడు పార్టీలు విశాఖ వేదికగా రాజకీయ క్రీడకు తెరలేపాయి. అయితే ఈ మూడు పార్టీల్లో ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరిని నమ్ముతారు…ఎవరి వైపు ఉంటారో చూడాలి. ప్రజల మద్ధతు తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.