దేశవ్యాప్తంగా ప్రజలకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలను చూపిస్తున్నాయి. సామాన్యులు ఈ ధరల వల్ల బెంబేలెత్తిపోతున్నారు. కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియని సంకట స్థితిలో ప్రజలు ఉండగా.. పెరుగులున్న పెట్రోల్, డీజిల్ ధరలు గోటి చుట్టుపై రోకలి పోటులా మారాయి. అయితే పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్‌టీ పరిధిలోకి తెస్తామని కేంద్రం ఎప్పటి నుంచో ఊరిస్తోంది. తాజాగా జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలోనూ ఈ నిర్ణయం తీసుకుంటారని అనుకున్నారు. కానీ కేంద్రం మళ్లీ మొండి చేయి చూపించింది.
వాస్తవానికి పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్‌టీ పరిధిలోకి తెస్తే ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుంది. ధరలు సగానికి సగం తగ్గుతాయని చెప్పవచ్చు. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. పెట్రోల్ లీటర్ బేస్ ప్రైస్ రూ.40.78గా ఉంది. డీలర్ల వద్దకు వచ్చే సరికి రవాణా చార్జిలు కలుపుకుని దాని ధర రూ.41.10 అవుతుంది.
ఇక ఎక్సైజ్ సుంకం రూ.32,90, డీలర్ కమిషన్ రూ.3.84, డీలర్ కమిషన్ మీద వ్యాట్ రూ.23.35 అవుతాయి. దీంతో మొత్తం కలిపి లీటర్ పెట్రోల్ ధర రూ.101.19 అవుతుంది. ఇది ఢిల్లీలో ఇండియన్ ఆయిల్ లీటర్ పెట్రోల్ ధర.
అయితే పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ కిందకు తెస్తే అప్పుడు జీఎస్‌టీ గరిష్ట చార్జి 28 శాతం అనుకున్నా బేస్ ప్రైస్ రూ.11.50, డీలర్ కమిషన్ రూ.3.84 అవుతాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.56.44 అవుతుంది. డీజిల్ ధర రూ.55.41 అవుతుంది. అంటే.. దాదాపుగా సగం వరకు ధరలు తగ్గుతాయి. అయినప్పటికీ వ్యాట్ ద్వారా రాష్ట్రాలకు, ఎక్సైజ్ సుంకం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఇక జీఎస్‌టీ పరిధిలోకి తెస్తే అంతటి ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కనుకనే రాష్ట్రాలు, కేంద్రం ఇందుకు సుముఖంగా లేవు. మరి ప్రజల కష్టాలు ఎప్పటికి తీరుతాయో చూడాలి..!