భారత్‌లో రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య ఇప్పుడు 1 లక్ష దాటింది. దీంతో మనం ప్రపంచంలోని టాప్ 11 కరోనా ప్రభావిత దేశాల లిస్టులో చేరిపోయాం. అయితే కేసుల సంఖ్య 1 లక్ష దాటినప్పటికీ ఇంకా మనం సేఫ్ జోన్‌లోనే ఉన్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అందుకు గాను అధికారులు పలు గణాంకాలను సాక్ష్యంగా చూపిస్తున్నారు.
దేశంలో గడిచిన 24 గంటల్లో 2350 మంది కరోనా నుంచి బయట పడ్డారని, దీంతో దేశంలో కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 39,174కు చేరుకుందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో రికవరీ రేటు 38.73 శాతంగా ఉందని అన్నారు. ఇది ఇంకా మెరుగుపడుతుందని తెలిపారు. భారత్‌లో ప్రస్తుతం 58,802 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని, వీరందరికీ నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించడం జరుగుతుందని, అలాగే వీరిలో 2.9 శాతం మంది ఐసీయూలలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
ఇక దేశంలో లక్ష కరోనా కేసులకు మరణాల సంఖ్య 0.2 శాతంగా ఉందని, కానీ ప్రపంచంలో అది 4.1 శాతంగా ఉందని, దీన్ని బట్టి చూస్తే.. కరోనా కేసుల సంఖ్య లక్ష దాటినా.. ఇంకా మనం సేఫ్‌గానే ఉన్నామని అధికారులు తెలిపారు. ప్రపంచంలోని ఇతర దేశాల కన్నా మనం మెరుగైన స్థానంలో ఉన్నామని అన్నారు. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న లెక్కల ప్రకారం అమెరికా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, బ్రెజిల్, బెల్జియం, జర్మనీ, ఇరాన్, కెనడా, నెదర్లాండ్స్, మెక్సికో, చైనా, టర్కీ, స్వీడన్ దేశాల్లో లక్ష కరోనా కేసులకు నమోదైన మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉందన్నారు.
ఇక దేశంలో ఎప్పటికప్పుడు కరోనా కేసులను గుర్తిస్తుండడం, కాంటాక్ట్‌లను ట్రేస్ చేయడం, కరోనా బాధితులకు టైముకు చికిత్స అందిస్తుండడం వల్లే మరణాలు తక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. దీంతోపాటు దేశంలో కరోనా టెస్టింగ్ సామర్థ్యం కూడా రోజు రోజుకీ పెరుగుతుందన్నారు. కేవలం మే 18వ తేదీ ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1,08,233 మందికి పరీక్షలు నిర్వహించామని, మొత్తం 24,25,742 కరోనా టెస్టులు చేశామని తెలిపారు. దేశంలో జనవరి నెలతో పోలిస్తే ప్రస్తుతం టెస్టింగ్ కెపాసిటీ ఎన్నో రెట్లు పెరిగిందన్నారు.
దేశవ్యాప్తంగా 385 ప్రభుత్వ ల్యాబ్‌లు, 158 ప్రైవేటు ల్యాబ్‌లు కరోనా టెస్టులు చేస్తున్నాయని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ల్యాబ్‌లు, రాష్ట్రాల మెడికల్ కాలేజీలు, ప్రైవేటు మెడికల్ కాలేజీలు, ప్రైవేటు హాస్పిటల్స్‌లలో టెస్టింగ్ సామర్థ్యం పెరుగుతుందన్నారు. అందుకనే మనం కరోనా విజృంభిస్తున్నా సేఫ్ జోన్ లోనే ఉన్నామని తెలిపారు.